15 ఏళ్లకే పెళ్లి.. 19 ఏళ్లకు 12 తరగతి పరీక్షల్లో టాప్ టెన్!

ABN , First Publish Date - 2020-08-02T01:59:49+05:30 IST

పదిహేనేళ్లకే పెళ్లి.. ఊహ తెలిని వయసులో భార్య హోదా..బాధ్యతలు. ఇంతలో ఆమె కడుపును ఓ కాయ కూడా కాసింది. దీంతో తల్లి బాధ్యతలు కూడా జత అయ్యాయి. అయితే ఇవేవీ ఆ యువతికి చదువుపై ఉన్న ఇష్టాన్ని తగ్గించలేకపోయాయి.

15 ఏళ్లకే పెళ్లి.. 19 ఏళ్లకు 12 తరగతి పరీక్షల్లో టాప్ టెన్!

అగర్తల: పదిహేనేళ్లకే ఆమెకు పెళ్లైంది. ఊహ తెలీని వయసులోనే భార్యగా హోదా.. దానితోపాటే వచ్చిపడే బాధ్యతలు. ఇంతలోనే ఆమె కడుపున ఓ కాయ కూడా కాసింది. దీంతో తల్లి బాధ్యతలు కూడా జత అయ్యాయి. అయితే ఇవేవీ ఆ యువతికి చదువుపై ఉన్న ఇష్టాన్ని తగ్గించలేకపోయాయి. ఫలితం.. ఇటీవల జరిగిన పన్నెండో తరగతి పరీక్షల్లో ఆమె రాష్ట్రంలోనే పదో స్థానాన్ని సంపాదించుకుంది. ఆ చదువుల తల్లి పేరు సంఘమిత్రా దేబ్. ఆమెది త్రిపుర. రాజధాని అగర్తలకు కూత వేటు దూరంలో ఉన్న గాంధీ గ్రామ్ టౌన్‌లో అత్తమామలతో కలసి నివసిస్తుంటుంది. ఆమె భర్త పేరు రాజు ఘోష్.. బీఎస్ఎఫ్‌లో జవానుగా విధులు నిర్వహిస్తుంటాడు.


కాగా.. ఇటీవల విడుదలైన 12వ తరగతి పరీక్షల్లో సంఘమిత్ర రాష్ట్ర స్థాయిలో పదో ర్యాంకు సాధించింది. తన ఆర్ట్స్ గ్రూపులో ఆమెది రాష్ట్ర స్థాయిలో ఏడో ర్యాంకు. ‘ఇంటి పని, పిల్లాడి పనులూ పూర్తి చేసిన తరువాత మిగిలిన సమయంలో చదువుకునే దాన్ని. అత్తమామలు కూడా నాకు ఎంతో సహాయం చేశారు. ఈ ఫలితాలు నాకు ఎంతో సంతోషాన్నిచ్చాయి. డిగ్రీ చదవాలన్నదే ప్రస్తుతం నాముందున్న లక్ష్యం’ అని సంఘమిత్ర మీడియాతో వ్యాఖ్యానించారు. చదువులో సంఘమిత్ర విజయం సాధించడంపై అనేక మంది హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇది.. రాష్ట్రంలో ఇప్పటికీ  బాల్యవివాహాల వ్యవస్థ కొనసాగుతున్న విషయాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. 

Updated Date - 2020-08-02T01:59:49+05:30 IST