Abn logo
Sep 30 2020 @ 20:07PM

సరస్సులో స్కూటర్లు.. టూరిస్టులను ఆకర్షించడానికే!

అగర్తల: కరోనా మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టాలెదుర్కొన్న రంగాల్లో పర్యాటక రంగం కూడా ఒకటి. లాక్‌డౌన్‌ల కారణంగా రోడ్లపై మనుషులెవరూ కనిపించకుండా పోయారు. దీంతో విహారయాత్రల మాట దేవుడెరుగు, ఇళ్ల నుంచి బయటకు రావడానికే ప్రజలు వణికిపోయారు. ఈ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా టూరిజంపై పడిన ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ప్రపంచం మొత్తం లాక్‌డౌన్‌ల ముసుగులు తొలగించుకుంటోంది. అందుకే మళ్లీ పర్యాటకరంగానికి పూర్వవైభవం తెచ్చేదిశగా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.

మనదేశంలో.. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో సంపద సృష్టించే రంగాల్లో టూరిజం ఒకటి. హిమాలయ పర్వతాల మధ్య ఉండే ఈ రాష్ట్రాలు టూరిస్టులను భలేగా ఆకట్టుకుంటాయి. కానీ కరోనా కారణంగా ఇక్కడి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్‌ జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటోంది. అయితే పర్యాటకులు మాత్రం అంతంతమాత్రమే కనబడుతున్నారు. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు ఈ రాష్ట్రాలు పరిష్కార మార్గాల కోసం వెదుకుతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి పర్యాటకులను ఆకర్షించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

Kaakateeya

కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్‌ 5 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం, అక్టోబరు 1 నుంచి దాదాపుగా అన్ని సర్వీసులూ ప్రారంభం అవుతాయి. వీటిలో టూరిస్టు కేంద్రాలు కూడా ఉన్నాయి. ఇంతకాలం ప్రజలు గుంపులుగా కనిపించే ప్రాంతాలను రీ-ఓపెన్ చేయడానికి ఆలోచించిన కేంద్రం.. ఇప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో తమ రాష్ట్రంలో పర్యాటకానికి పూర్వవైభవం తెచ్చేందుకు త్రిపుర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇక్కడి మందిర్‌ఘాట్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

మందిర్‌ఘాట్‌లోని దంబూర్ సరస్సులో కొత్తగా వాటర్ స్కూటర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సేవలను స్వయంగా త్రిపుర పర్యాటకశాఖ మంత్రి ప్రాణజిత్ సింగరాయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూడా కాసేపు ఈ వాటర్ స్కూటర్లపై దంబూర్‌ లేక్‌లో చక్కర్లు కొట్టారు. ఇలా వాటర్‌ స్కూటర్ల ఏర్పాటు రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారని సింగగరాయ్ ప్రకటించారు. 'ఈ ఏడాది ప్రపంచ టూరిజం డే థీమ్‌.. పర్యాటకం, గ్రామీణాభివృద్ధి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే మందిర్‌ఘాట్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలోనే ఇక్కడ ఓ హెలీప్యాడ్‌ కూడా నిర్మిస్తాం' అని సింగరాయ్ తెలియజేశారు.

వాటర్ స్కూటర్లతోపాటు రెండు ఫ్లోటింగ్ జెట్టీలను కూడా ఈ సరస్సులో ప్రవేశపెట్టినట్లు సింగరాయ్ చెప్పారు. వీటిపై పిల్లలు, పెద్దవారు ఎవరైనా చక్కగా ప్రయాణించవచ్చని, దంబూర్ సరస్సుకు ఇవి కూడా మరింత ఆకర్షణను తీసుకొస్తాయని అభిప్రాయపడ్డారు. ఈ జెట్టీల వల్ల వయసులో పెద్దవారు, పిల్లలు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సరస్సులో ప్రయాణించగలుగుతారని నిర్వాహకులు వివరించారు.  ఈ సరస్సుకు చెందిన నార్కేల్ కుంజా ప్రాంతంలో సుందరీకరణ పనులు కూడా ముగిశాయని, టూరిస్టులకు ఆహారం, లాడ్జింగ్ సదుపాయాలను కూడా త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని సింగరాయ్ హామీఇచ్చారు.

త్రిపురలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని టూరిస్టు కేంద్రాలను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు వాళ్లు చెప్పారు. ఉదయ్‌పూర్‌లోని మాతాబరి, అమర్‌పూర్‌లోని చాబిమూరా, దంబూర్‌లేక్‌ మధ్య ప్రత్యేకంగా ఓ టూరిజం సర్క్యూట్ నిర్మాణానికి పథకాలు సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. ఈ సర్క్యూట్ పూర్తయితే ఈ మూడు ప్రాంతాలను సందర్శించడం మరింత సులభతరం అవుతుందని వివరించారు.

Advertisement
Advertisement
Advertisement