కరోనా కొత్త సవాల్! డబుల్‌కు తోడు ట్రిపుల్..!

ABN , First Publish Date - 2021-04-21T19:35:12+05:30 IST

రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ సవాలు విసురుతున్న కరోనా తాజాగా మరో అవతారం ఎత్తింది. ఇప్పటికే దడపుట్టిస్తున్న డబుల్ మ్యూటెంట్‌కు తోడుగా.. ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి వచ్చింది.

కరోనా కొత్త సవాల్! డబుల్‌కు తోడు ట్రిపుల్..!

న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభిస్తోంది. రోజువారి కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువవుతోంది. దేశంలోనే పుట్టిన డబుల్ మ్యూటెంటే ఈ పరిస్థితికి కారణమని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం దీన్ని ఇంతవరకూ ధృవీకరించలేదు. ప్రజల్లో క్రమంగా పెరుగుతున్న అలసత్వమే ప్రస్తుత పరిస్థితికి కారణమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే... రోజుకో కొత్త అవతారం ఎత్తుతూ సవాలు విసురుతున్న కరోనా తాజాగా మరో అవతారం ఎత్తింది. ఇప్పటికే దడపుట్టిస్తున్న డబుల్ మ్యూటెంట్‌కు తోడుగా.. ట్రిపుల్ మ్యూటెంట్ వెలుగులోకి వచ్చింది. 


ట్రిపుల్ మ్యూటెంట్ అంటే..మూడు జన్యుమార్పులు ఉన్న వైరస్ అని అర్థం. ఇప్పటికే ఉనికిలో ఉన్న మూడు వేరియంట్లలోని కొన్ని లక్షణాలు ఈ ట్రిపుల్ మ్యూటెంట్‌కు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ ట్రిపుల్ మ్యూటెంట్‌ను గుర్తించారు. మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో కొత్తగా నమోదవుతున్న కేసులకు ఈ ట్రిపుల్ మ్యూటెంట్ కారణమనే అభిప్రాయం శాస్త్రవర్గాల్లో నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి తరచూ పేట్రేగిపోతుండటానికి ఈ కొత్త వేరియంట్లే కారణమని నిపుణులు భావిస్తున్నారు. 


‘‘కొత్త వేరియంట్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. అనేక మందికి కరోనా వేగంగా సోకుతోంది.’’ అని మెక్‌గిల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ముధుకర్ పాయ్ వ్యాఖ్యానించారు. ‘‘టీకాకు తరచూ మార్పులు చేస్తుండాలి. ఇందుకు కోసం ఈ మహమ్మారిపై లోతైన అవగాహన ఉండాలి’’ అని ఓ జాతీయ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయ్ వ్యాఖ్యానించారు. అయితే..భారత్ వంటి దేశాలకు ఇది పెను సవాలు అని నిపుణులు భావిస్తున్నారు. భారత్‌లో కరోనా జన్యుమార్పులను పసిగట్టే జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు కేవలం ఒక శాతం కేసుల్లో మాత్రమే జరుగుతున్నాయి. కాబట్టే.. కరోనా డబుల్ మ్యూటెంట్ గుర్తించడంలో ఆలస్యం జరిగి కేసులు విపరీతంగా పెరిగి ఉండొచ్చని డా. పాయ్ అభిప్రాయపడ్డారు. కాగా.. వైరస్ వేగంగా వ్యాపించే కొద్దీ అనేక కొత్త తరాలు పుట్టుకొస్తాయని, ఈ క్రమంలో కొన్ని జన్యుమార్పులు సంతరించుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.  

Updated Date - 2021-04-21T19:35:12+05:30 IST