ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ మరింత జాప్యం

ABN , First Publish Date - 2022-06-23T05:23:30+05:30 IST

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల జాప్యం కానుంది. పదో తరగతి ఇన్‌స్టంట్‌ పరీక్షల తర్వాతే వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్జీయూకేటీ పరిధిలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయలోని ట్రిపుల్‌

ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ మరింత జాప్యం



ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ మరింత జాప్యం
పదో తరగతి ఇన్‌స్టంట్‌ పరీక్షల తర్వాతే..

ఎచ్చెర్ల: రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ టెక్నాలజీస్‌ (ఆర్జీయూకేటీ)లోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదల జాప్యం కానుంది. పదో తరగతి ఇన్‌స్టంట్‌ పరీక్షల తర్వాతే వెలువడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఆర్జీయూకేటీ పరిధిలో శ్రీకాకుళం, నూజివీడు, ఒంగోలు, ఇడుపులపాయలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో ప్రవేశాలు కొవిడ్‌ ముందువరకు పదో తరగతిలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ ఆధారంగానే కేటాయించేవారు. కొవిడ్‌ రెండేళ్లు పది పరీక్షలు లేకుండానే అందర్నీ ఉత్తీర్ణులు చేశారు. దీంతో ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్లకు ప్రవేశపరీక్ష తప్పనిసరైంది.

టెన్త్‌ ఇన్‌స్టంట్‌ తర్వాతనే..
2021-22 విద్యా సంవత్సరంలో పదోతరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా విడుదల చేశారు. అయితే ఉత్తీర్ణత గణనీయంగా తగ్గిందన్న విమర్శలు రావడంతో ఇన్‌స్టంట్‌ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇన్‌స్టంట్‌లో ఉత్తీర్ణులైనవారికి రెగ్యులర్‌ విద్యార్థులు మాదిరిగానే పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. మార్కులు తక్కువ వచ్చినట్టు భావించిన వారికి బెటర్‌మెంటుకు కూడా అవకాశం కల్పించారు. వీరికి కూడా మార్కులు పెరిగే అవకాశం ఉంది. ఇన్‌స్టంట్‌, బెటర్‌మెంటు, పునఃమూల్యాంకనం తర్వాతే ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశానికి నోటిఫికేషన్‌ వెల్లడయ్యే అవకాశం ఉంది.

మార్కుల ఆధారంగానే..
ట్రిపుల్‌ ఐటీలో ప్రవేశాలు పదో తరగతి మార్కుల ఆధారంగానే జరిగే అవకాశం ఉంది. అడ్మిషన్లు ఎలా జరుగుతాయన్న అంశం ఇప్పటివరకు స్పష్టత అయితే లేదు. ఆర్జీయూకేటీ పరిధిలో ఒక్కో ట్రిపుల్‌ ఐటీలో 1100 సీట్ల వంతున ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. తొలుత నూజివీడు, ఇడుపులపాయలో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించగా.. రాష్ట్ర విభజన తర్వాత శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్‌ ఐటీలను టీడీపీ హయాంలో ప్రారంభించారు. ఇందులో సీటు పొందే ప్రతి విద్యార్థికి ఉజ్వల భవిత ఉంటుందనడంలో సందేహం లేదు. క్యాంపస్‌ నుంచే కంపెనీల్లోకి ఉద్యోగాల్లోకి వెళ్లే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు.

త్వరలో నోటిఫికేషన్‌
ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి త్వరలో నోటిఫికేషన్‌ వెలువడుతుంది. 2022-23 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు పదో తరగతి మార్కుల ప్రాతిపదికగానే జరిగే అవకాశం ఉంది. దీనిపై ఓ నిర్ణయం వెలువడాల్సి ఉంది.
ప్రొఫెసర్‌ పెద్దాడ జగదీశ్వరరావు, డైరెక్టర్‌, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌


Updated Date - 2022-06-23T05:23:30+05:30 IST