అవి ట్రబుల్‌ ఐటీలే!

ABN , First Publish Date - 2022-03-23T08:10:35+05:30 IST

గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ట్రిపుల్‌ ఐటీలను..

అవి ట్రబుల్‌ ఐటీలే!

‘నాన్న కుమారుడిగా పోలవరం ప్రాజెక్టును నేనే పూర్తి చేస్తా! పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేస్తాం’... ఇది మంగళవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన! పోలవరం పూర్తి చేసి, తండ్రి విగ్రహం ఏర్పాటు చేసే సంగతేమోకానీ... గ్రామీణ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యా వరాన్ని అందించేందుకు తండ్రి వైఎస్‌ ప్రారంభించిన ఐఐఐటీలను ఆయన కుమారుడు జగన్‌ మెల్లమెల్లగా చంపేస్తున్నారు. సమస్యల సుడిలో ముంచేస్తున్నారు. సొంత జిల్లా, అందునా తమ సొంత ఎస్టేట్‌లాంటి ఇడుపులపాయ క్యాంపస్‌లోని విద్యార్థులను రోడ్డెక్కేలా చేశారు.


వైఎస్‌ హయాంలో ఏర్పాటు.. కుమారుడు రాగానే కష్టాలు

మూడేళ్లుగా అందని ల్యాప్‌టాప్‌లు.. యూనిఫామ్‌, బూట్లు కూడా కరువే

సగం కూడా లేని బోధనా సిబ్బంది.. సమస్యల వలయంగా ‘ఇడుపులపాయ’

ఒంగోలు క్యాంపస్‌పై రాజకీయం.. ఆ విద్యార్థులూ ఇడుపులపాయలోనే

ఆరుగురు పట్టే గదిలో పది మంది.. పాత షెడ్లలోకి విద్యార్థినుల తరలింపు


(కడప - ఆంధ్రజ్యోతి)

గ్రామీణ పేద విద్యార్థులకు ఉన్నత సాంకేతిక విద్య అందించాలనే లక్ష్యంతో 2008లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ, నూజీవీడు ట్రిపుల్‌ ఐటీ కళాశాలలను వైఎస్‌ ప్రారంభించగా... 2017లో ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలను చంద్రబాబు ప్రారంభించారు. ఒక్కో క్యాంప్‌సలో ఏటా 1100 మందికి ప్రవేశం... మొత్తంగా 4400 మంది విద్యార్థులకు ఉన్నత విద్య! ఇదీ ట్రిపుల్‌ ఐటీల ఘనత! జగన్‌ హయాంలో వాటికి కూడా ట్రబుల్స్‌ వచ్చి పడ్డాయి. 


ల్యాప్‌టా్‌పలు లేవు... 

కంప్యూటర్‌పైనే విద్యాబోధన... ఇది ట్రిపుల్‌ ఐటీ ఆశయాల్లో ఒకటి. అందుకే... మొదటి సంవత్సరంలో చేరగానే విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌ అందిస్తారు. 2008 నుంచి 2018 వరకు ఏ ఇబ్బందీ లేకుండా అందించారు. జగనన్న వచ్చారు... ల్యాప్‌టా్‌పలు ఆగిపోయాయి. 2019 నుంచి ఇప్పటిదాకా ల్యాప్‌టా్‌పలు ఇవ్వడంలేదు. కొన్ని కాలేజీల్లో ఈ-4 విద్యార్థులు వెళ్లేముందు వారి ల్యాప్‌టా్‌పలు తీసుకుని కొత్తగా చేరుతున్న వారికి సర్దుబాటు చేస్తున్నారు. కరోనా సమయంలో పూర్తిగా ఆన్‌లైన్‌ చదువులు కావడంతో.. ల్యాప్‌టా్‌పలు లేక విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. ఈ కళాశాలల్లో విద్యార్థులకు ప్రతి రెండేళ్లకోసారి 2 జతల యూనిఫామ్‌, బూట్లు ఇవ్వాలి. మూడేళ్లుగా వీటిని కూడా ఇవ్వడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


బోధన సిబ్బంది కొరత

ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లో ప్రతి 16మంది విద్యార్థులకు ఒకరు చొప్పున బోధన సిబ్బంది ఉండాలి. అయితే, 50శాతం దాకా ఖాళీలు ఉన్నాయని ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలోని నాలుగు కళాశాలల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఉన్న కొద్దిమందిని కూడా  హాస్టల్‌, మెస్‌ల నిర్వాహణ వంటి బోధనేతర పనులకు ఉపయోగిస్తున్నారు. రెండేళ్ల క్రితం 400 మంది బోధన సిబ్బంది (లెక్చరర్లు) నియామకం కోసం నోటిఫికేషన్‌ జారీ చేసినా కోర్టు వివాదం కారణంగా ఆ ప్రక్రియ పూర్తి కాలేదు.  ఆర్‌జీయూకేటీ వ్యవస్థాపక చాన్స్‌లర్‌ రాజ్‌రెడ్డి ఫిబ్రవరి 26న ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీలో జరిగిన ఐదో స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ సమయంలో మూడేళ్లుగా ల్యాప్‌టా్‌పలు ఇవ్వలేదని, విద్యార్థులు చెప్పడంతో విస్తుపోయారు. ‘‘ట్రిపుల్‌ ఐటీ ప్రధాన లక్ష్యమే కంప్యూటర్‌పైన విద్యాబోధన! ల్యాప్‌టా్‌పలు ఇవ్వకపోతే ఎలా? తక్షణమే విద్యార్థులకు ల్యాప్‌టా్‌పలు అందించేలా చర్యలు తీసుకోండి’’ అని సూచించారు. ఇప్పటికీ ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ‘నాలుగు బిల్డింగులు కడితేనే అభివృద్ధి అంటారా?’ అని ముఖ్యమంత్రి జగన్‌ గతంలో అసెంబ్లీలో అన్నారు.


ఆ సంగతేమిటోకానీ... ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీకి చెందిన వేలాదిమంది విద్యార్థులు ఆ భవనాల కోసమే రోడ్డెక్కారు. నిద్రాహారాలు మాని అర్ధరాత్రి వరకు ఆందోళన చేశారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీ కళాశాలకు పక్కా భవనాలు లేకపోవడమే దీనికి కారణం! ఇక్కడ అద్దె భవనాలు చాలక.. 3వేల మంది విద్యార్థులను  ఇడుపులపాయలో సర్దుతున్నారు. ఒంగోలు ట్రిపుల్‌ ఐటీకి చంద్రబాబు ప్రభుత్వం 250ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించింది. భవనాల పనులకు 2017 ఆగస్టు 7న చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పనులు మాత్రం మొదలుకాలేదు. 2019లో జగన్‌ అధికారంలోకి రాగానే.. విషయం మళ్లీ మొదటికి వచ్చింది. చంద్రబాబు కేటాయించిన స్థలంలో ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌ నిర్మిస్తే ఆయనకే పేరొస్తుందనుకున్నారో ఏమో! ఆ భూములను రద్దు చేసి.. కనిగిరి మండలం బల్లిపల్లె దగ్గర 240 ఎకరాలను కేటాయించారు. 6500 మంది విద్యార్థులకు సరిపడా అకడమిక్‌ భవనాలు, ల్యాబ్స్‌, హాస్టళ్లు, భోజన హాళ్లు.. వంటి భవనాల నిర్మాణాలకు రూ.1,200 కోట్లతో అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపారు. కానీ, మూడేళ్లుగా వైసీపీ ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క పైసా కూడా కేటాయించలేదు.


నేటికీ భవనాలు సమకూర్చలేదు. వెరసి... ఒంగోలు క్యాంపస్‌ కూడా ఇడుపులపాయలోనే నడుస్తోంది. మొత్తం 9500 మందికి ఇక్కడ వసతి కల్పించాల్సి వస్తోంది. సోమ, మంగళవారాల్లో ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో ఆర్‌జీయూకేటీ చాన్స్‌లర్‌ కేసీ రెడ్డి సమావేశమయ్యారు. మూడేళ్లుగా ల్యాప్‌టా్‌పలు, యూనిఫాం అందని మాట వాస్తవమే అని అంగీకరించారు. 31వేల ల్యాప్‌టా్‌పలకు టెండర్లు పిలిచామని, త్వరలో పంపిణీ చేస్తామని, త్వరలోనే బోధన సిబ్బంది నియామకాలు చేపడతామన్నారు. అవసరమైతే మరో ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని అద్దెకు తీసుకుని, ఒంగోలు విద్యార్థులను తరలిస్తామన్నారు. పీ-1 విద్యార్థినులు ప్రస్తుతానికి పాత క్యాంప్‌సలోనే ఉండాలని, త్వరితగతిన అన్ని సౌకర్యాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఐదు నెలల తర్వాత కొత్త క్యాంప్‌సలోకి పంపిస్తామన్నారు. దీంతో మూడు రోజులుగా ట్రిపుల్‌ఐటీలో ఆందోళనతో అట్టుడికిన వాతావరణం సద్దుమణిగింది.

Updated Date - 2022-03-23T08:10:35+05:30 IST