‘ట్రిపుల్‌’ సమస్యలు..!

ABN , First Publish Date - 2020-07-08T11:01:48+05:30 IST

ట్రిపుల్‌ ఐటీ.. పేద విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్య అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కళాశాల.

‘ట్రిపుల్‌’ సమస్యలు..!

పేరుకే ఇడుపులపాయ ఆర్జీయూకేటీ యూనివర్సిటీ.. పాలనంతా నూజివీడు నుంచే

వేధిస్తున్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కొరత

ముఖ్య అధికారులంతా ఇన్‌చార్జిలే

నీరుగారుతున్న మహోన్నత లక్ష్యం

సీఎం జగన్‌ సార్‌.. దృష్టి సారించండి

నేడు రూ.40 కోట్లతో నిర్మించే ఆడిటోరియానికి శంకుస్థాపన


(కడప-ఆంధ్రజ్యోతి): ట్రిపుల్‌ ఐటీ.. పేద విద్యార్థులకు శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్య అందించే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కళాశాల. 2008లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి మహోన్నత ఆశయంతో నెలకొల్పిన ట్రిపుల్‌ ఐటీలో బోధన సిబ్బంది కొరత ప్రధానంగా వేధిస్తోంది. సగం మంది లెక్చరర్లు లేరు. ఉన్నవారికి పరిపాలన అదనపు బాధ్యతలు అప్పగించడంతో లక్ష్యం నీరుగారుతోంది. వైస్‌ చాన్సలర్‌, డైరెక్టరు వంటి కీలక పోస్టులన్నీ ఇన్‌చార్జిలతోనే నడిపిస్తున్నారు. దీనికితోడు నిధుల కొరత. రూ.139 కోట్లతో నిర్మించిన డిపార్ట్‌మెంట్‌ భవనాల ప్రారంభోత్సవానికి బుధవారం ట్రీపుల్‌ ఐటీ కళాశాలకు వస్తున్న సీఎం జగన్‌ అక్కడ నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


ఇడుపులపాయ (ఆర్‌కే వ్యాలీ)లో పేద విద్యార్థులకు సైతం శాస్త్ర, సాంకేతిక ఉన్నత విద్య అందించాలనే ఆశయంతో 2008లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ, ట్రీపుల్‌ ఐటీ కళాశాలను ఏర్పాటు చేశారు. 6 వేల మంది విద్యార్థులు ఇక్కడ ఉంటూ విద్యాభ్యాసం సాగించేలా 300 ఎకరాల్లో దీనిని స్థాపించారు. సీఎ్‌సఈ, ఈసీఈ, ఎంఎంఈ, కెమికల్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ఉన్నాయి. ఇప్పటికే 8 వేల మంది విద్యార్థులు కోర్సు పూర్తి చేసుకొని కళాశాల నుంచి బయటకు వెళ్లారు. నిరుపేద విద్యార్థుల ఆశాజ్యోతి అయిన ట్రీపుల్‌ ఐటీ కళాశాలలో ఎన్నో సమస్యలు వేధిస్తున్నాయి. వాటిని పరిష్కరించి ఉత్తమ విద్యాలయంగా తీర్చిదిద్దాలని పలువురు కోరుతున్నారు.


వేధిస్తున్న బోధన సిబ్బంది కొరత

ఆర్జీయూకేటీ నిబంధనల ప్రకారం 20 మంది విద్యార్థులకు ఒక లెక్చరరు ఉండాలి. ఈ లెక్కన 6 వేల మంది విద్యార్థులకు 300 మంది భోదన సిబ్బంది అవసరం ఉంది. ప్రస్తుతం 140 మందే పనిచేస్తున్నారు. 160 మంది లెక్చరర్ల కొరత ఉంది. ఉన్నవాళ్లలో 30 మంది రెగ్యులర్‌ సిబ్బంది కాగా.. 110 మంది కాంట్రాక్ట్‌ సిబ్బందే. సాంకేతిక విద్యా ప్రమాణాలు మెరుగుపడాలంటే పూర్తిస్థాయి భోదన సిబ్బందిని నియమించాలని నిపుణులు కోరుతున్నారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను రెగ్యులర్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే.. నాన్‌ చీటింగ్‌ సిబ్బంది కొరతను కూడా అధిగమించాల్సి ఉంది. 


ఇన్‌చార్జిల పాలనతో సరి

ఆర్జీయూకేటీ వైస్‌చాన్సలర్‌ పోస్టుతో పాటు డైరెక్టరు, పరిపాలన అధికారి (ఏవో), ఫైనాన్స్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌వో), విద్యా సంరక్షణ అధికారి, అకడమిక్‌ డీన్‌.. ఇలా కీలకమైన పోస్టులన్నింటిని ఇన్‌చార్జిలతోనే కొనసాగిస్తున్నారు. వీరిలో ఎక్కువ శాతం మంది లెక్చరర్లకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఒకే వ్యక్తికి రెండు బాధ్యతలు ఇవ్వడంతో  బోధన ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని ఉద్యోగులే అంటున్నారు. విద్యా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలలంటే పూర్తి స్థాయి టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.


నిధుల కొరత

ట్రీపుల్‌ ఐటీ కళాశాల నిర్వహణకు నిధుల కొరత శాపంగా మారింది. ఉద్యోగుల జీతాలు ఓకే.. నిర్వహణకు నిధులేవీ.? అని ప్రశ్నిస్తున్నారు. కళాశాల నిర్వహణకు సుమారుగా ఏటా రూ.50 కోట్లు అవసరమని, ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని అక్కడ పనిచేసే సిబ్బంది ఏకరువు పెడుతున్నారు. కాగా.. తమ పేరు బయటకు చెప్పడానికి ఇష్ట పడడం లేదు. గత ప్రభుత్వం ఈ కళాశాలకు చెందిన రూ.185 కోట్ల నిధులను సంక్షేమ పథకాలకు తీసుకుంది. ఇప్పటికీ ఆ డబ్బు ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు. అవి ఇచ్చినా నిధుల సమస్య కొంతైనా తీరుతుందని అంటున్నారు.


యూనివర్సిటీ ఇక్కడ.. నూజివీడు నుంచి పాలన

రాజీవ్‌గాంధీ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ యూనివర్సిటీ ఇడుపులపాయ కేంద్రంగా ఏర్పాటు చేస్తూ నాటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2008లో గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. కొత్తగా ఏర్పాటు చేయడంతో సౌకర్యాలు లేక ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాదు నుంచి పాలన సాగించారు. రాష్ట్ర విభజన తరువాత నూజివీడు నుంచి కొనసాగిస్తున్నారు. అయితే.. జగన్‌ సీఎం అయ్యాక వైస్‌చాన్సలర్‌ కేసీ రెడ్డి ఆర్జీయూకేటీ పాలన కార్యక్రమాలను ఇపుడుపులపాయ నుంచే కొనసాగిస్తామని క్యాంప్‌ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఆయన నెలలో రెండుమూడు పర్యాయాలు వచ్చివెళ్తున్నారని స్థానిక ఉద్యోగులు పేర్కొంటున్నారు. విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయంతో పాటు ఇతర విభాగాలు ఇక్కడే నెలకొల్పాలనే డిమాండ్‌ ఉంది. అది సాకారమైతే స్థానిక యువతకు ఉపాధి అవకావాలు మెరుగుపడే అవకాశాలు లేకపోలేదు. ఆ దిశగా సీఎం జగన్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.


ఈఈఈ కోర్సు పెట్టాలి

సీఎ్‌సఈ, ఈసీఈ, ఎంఎంఈ, కెమికల్‌, సివిల్‌.. ఈ ఐదు కోర్సులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఎక్కవమంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్న ట్రీపుల్‌ఈ (ఈఈఈ) కోర్సును కూడా పెట్టాలనే డిమాండ్‌ ఉన్నా ఏ ప్రభుత్వం ఇప్పటిదాకా శ్రద్ధ చూపలేదు. ఆ కోర్పును ఏర్పాటు చేస్తే మరో 200 మంది విద్యార్థులకు ఏటా సాంకేతిక ఉన్నత విద్య అభ్యసించే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరంగ్‌ విద్యార్థులకే ఎక్కువ శాతం క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు వస్తున్నాయి. సివిల్‌, మెకానికల్‌ వంటి కోర్‌గ్రూపు విద్యార్థులకు కూడా ప్రసిద్ధి చెందిన కంపెనీల్లో ఉద్యోగాలు లభించేలా క్యాంపస్‌ సెలక్షన్స్‌పై ప్రభుత్వమే ప్రత్యేక చొరవతీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 


రూ.139 కోట్లతో నిర్మించిన డిపార్ట్‌మెంట్‌ ప్రారంభం

ట్రీపుల్‌ ఐటీ కళాశాలలో రూ.139 కోట్లతో నిర్మించిన సెవెన్‌ డిపార్ట్‌మెంట్‌ భవనాలు, రూ.12 కోట్లతో నెలకొల్పిన 3 మెగావాట్స్‌ సోలార్‌ ప్లాంట్‌ను బుధవారం సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అలాగే.. 2,500 మంది ఏకకాలంలో కూర్చోవడానికి వీలుగా రూ.40 కోట్లతో నిర్మించనున్న ఆడిటోరియం నిర్మాణానికి శంకస్థాన చేస్తారు. క్యాంపస్‌ మధ్యలో నెలకొల్పిన దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కోవిడ్‌-19 టెస్ట్‌ చేసుకొని నెగిటివ్‌ రిపోర్టు వచ్చిన ప్రజాప్రతినిధులను మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు.

Updated Date - 2020-07-08T11:01:48+05:30 IST