Coal Scam case: అభిషేక్ బెనర్జీ బంధువు ఈడీ ముందు హాజరు

ABN , First Publish Date - 2022-09-12T20:52:09+05:30 IST

బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంధువు మనేకా గంభీర్ ..

Coal Scam case: అభిషేక్ బెనర్జీ బంధువు ఈడీ ముందు హాజరు

కోల్‌కతా: బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee) బంధువు మనేకా గంభీర్ (Maneka Gambhir) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ED) ముందు సోమవారంనాడు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఈడీ తమ సమన్లలో పేర్కొనగా, మధ్యాహ్నం 12.40 ప్రాంతంలోనే సాల్ట్‌లేక్‌లోని సీజీఓ కాంప్లెక్స్‌లో ఉన్న ఈడీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. ఆమె వెంట న్యాయవాది కూడా ఉన్నారు.


కాగా, గత శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో బ్యాంకాంక్ వెళ్లేందుకు మనేకా గంభీర్ కోల్‌కతా విమానాశ్రయానికి వెళ్లగా ఈడీ అధికారులు అడ్డుకున్నారు. బొగ్గు కుంభకోణానికి సంబంధించిన అక్రమ నగదు లావాదేవీల కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలని అక్కడే ఆమెకు సమన్లు అందించారు. ఈడీ గతంలోనే ఆమెపై లుక్‌ అవుట్ నోటీసులు జారీ చేసింది. దీంతో విమానాశ్రయం వద్ద ఆమెకు ఇమిగ్రేషన్ క్లియరెన్స్ లభించలేదు. సమాచారం తెలుసుకున్న ఈడీ అధికారులు అక్కడకు చేరుకుని ప్రయాణానికి అనుమతి లేదని తెలిపారు. అనంతరం అక్కడికక్కడే నోటీసులు అందించడంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కేసులో మనేకా గంభీర్‌ను సీబీఐ గతంలో ఒకమారు ప్రశ్నించినప్పటికీ, ఈడీ విచారణ జరపడం మాత్రం ఇదే మొదటిసారి.

Updated Date - 2022-09-12T20:52:09+05:30 IST