వ్యూహాలతో బీజేపీ చుట్టుముట్టినా.. పశ్చిమ బెంగాల్‌నే చుట్టేసిన మమత

ABN , First Publish Date - 2021-05-02T19:27:20+05:30 IST

ఒకవైపు నుంచి కాదు... రెండు వైపుల నుంచీ కాదు... అన్ని వైపుల నుంచీ బీజేపీ అధిష్ఠానం సీఎం మమతా బెనర్జీని

వ్యూహాలతో బీజేపీ చుట్టుముట్టినా.. పశ్చిమ బెంగాల్‌నే చుట్టేసిన మమత

కోల్‌కతా : ఒకవైపు నుంచి కాదు... రెండు వైపుల నుంచీ కాదు... అన్ని వైపుల నుంచీ బీజేపీ అధిష్ఠానం సీఎం మమతా బెనర్జీని చుట్టుముట్టేసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే బెంగాల్‌ ‘దండయాత్ర’ను చేసింది బీజేపీ. అయినా సరే సీఎం మమతా బెనర్జీ ఎక్కడా తొణకలేదు. ఎన్నికల ఫలితాల్లో 201 సీట్లలో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఇక ప్రత్యర్థి బీజేపీ 78 సీట్లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. తృణమూల్ నుంచి సీఎం మమతా బెనర్జీ ఒక్కరే రాజకీయ యవనికపై కనిపిస్తూ ప్రచారం చేశారు. తెర వెనుక వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఉన్నప్పటికీ తెర ముందు మాత్రం మమతా బెనర్జీయే. అదే బీజేపీ శిబిరంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అంతేకాకుండా కేంద్ర మంత్రులకు, ఎంపీలకు నియోజకవర్గాలను కేటాయించారు. వారం రోజుల పాటు వారందరూ వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే మకాం వేయాలని కూడా అధిష్ఠానం ఆదేశించింది. అంతేకాకుండా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి షా.. ఇలా... అగ్రనేతలందరూ నెలకు నాలుగైదు రోజులు బెంగాల్‌లో పర్యటించారు.


ఇవన్నీ ఒకెత్తు... ఎనిమిది దశల్లో ఎన్నికలను నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తన షెడ్యూల్‌‌లో ప్రకటించింది. ఇలా ఎనిమిది దశల్లో ఎన్నికలను నిర్వహించడమేంటని షెడ్యూల్ ప్రకటించగానే సీఎం మమత ఈసీని ప్రశ్నించారు కూడా. అంతేకాకుండా కేంద్ర భద్రతా బలగాలపై కూడా ఆమె విమర్శలు చేశారు. ఎనిమిది దశల్లో ఎన్నికలు, కేంద్ర భద్రతా బలగాల వల్ల తనకు రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని తృణమూల్ శిబిరం భావించింది. ఈ రెండింటి వల్లా తృణమూల్ ఎంత భయపడ్డా... అంత సునాయాసంగా విజయ తీరాలవైపు దూసుకెళ్తోంది. సరిగ్గా ఎన్నికల సమయం నాటికి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ కాలికి గాయమైంది. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వీల్‌చైర్‌లో ప్రచారం నిర్వహించారు. అధినేత్రి గాయాల పాలుకావడంతో పార్టీకి ఘోర పరాభవం తప్పదని కేడర్ తీవ్రంగా భయపడింది. అయినా.. అధినేత్రి మాటలు, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహంతో పార్టీ భారీ ఆధిక్యంవైపు దూసుకెళ్తోంది.

Updated Date - 2021-05-02T19:27:20+05:30 IST