ఈ చెరువు నాది!

ABN , First Publish Date - 2022-07-08T04:21:11+05:30 IST

ఆ రైతులకు ఆ చెరువు నీరే దిక్కు. తరతరాలుగా దానిపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ చెరువుపై ఓ రియల్టర్‌ కన్నుపడింది. ‘ఈ చెరువు నాది. నేను కోనుగోలు చేశాను. కప్పుకోవడానికి తహసీల్దార్‌ అనుమతిచ్చారు’ అంటూ ఓ నకిలీ పత్రాన్ని రైతులకు చూపించాడు. తన అనుచరులతో కలిసి ఆ చెరువును చదును చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మా పొట్ట కొట్టొద్దంటూ అన్నదాతలు గురువారం ఆందోళనకు దిగారు.

ఈ చెరువు నాది!
కొత్తకుంకాం అబ్బాయి చెరువు వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

తహసీల్దార్‌ అనుమతితో వచ్చా
ఓ రియల్టర్‌ బరితెగింపు
కొత్తకుంకాం రైతుల ఆందోళన
లావేరు, జూలై 7:
ఆ రైతులకు ఆ చెరువు నీరే దిక్కు. తరతరాలుగా దానిపైనే ఆధారపడి పంటలను సాగు చేస్తున్నారు. ఉన్నట్టుండి ఈ చెరువుపై ఓ రియల్టర్‌ కన్నుపడింది. ‘ఈ చెరువు నాది. నేను కోనుగోలు చేశాను. కప్పుకోవడానికి తహసీల్దార్‌ అనుమతిచ్చారు’ అంటూ ఓ నకిలీ పత్రాన్ని రైతులకు చూపించాడు. తన అనుచరులతో కలిసి ఆ చెరువును చదును చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో మా పొట్ట కొట్టొద్దంటూ అన్నదాతలు గురువారం ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే.. లావేరు మండలం కొత్తకుంకాం గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 121లో 4.40 ఎకరాల విస్తీర్ణంలో అబ్బాయి చెరువు ఉంది. ఈ చెరువు కింద  మచ్చ సత్యనారాయణ, పిడుగు తవుడు, గణేష్‌, ముత్తన ఉగాది, అవాల అచ్యుతరావు, వంకాయల సత్యనారాయణ, బత్తుల అప్పన్నతో పాటు మరో 15 కుటుంబాలకు చెందిన రైతులకు 14 ఎకరాల భూమి ఉంది. తరతరాలుగా అబ్బాయి చెరువు మీద ఆధారపడి ఈ భూమిని సాగు చేస్తున్నారు. అయితే ఎవరో వైసీపీ నాయకులు చెప్పిన మాటలను విని తమపక్క గ్రామమైన అదపాకకు చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బుధవారం వచ్చి అబ్బాయి చెరువును కప్పేందుకు ప్రయత్నించారని రైతులు వాపోతున్నారు. అడిగితే ‘ఈ చెరువును నేను కొన్నాను. మట్టితో కప్పేసి సాగు చేసుకోవడానికి తహసీల్దార్‌  అనుమతి కూడా ఇచ్చారు’ అని చెప్పి ఓ నకిలీ పత్రాన్ని తీసుకువచ్చి చూపించారని బాధిత రైతులు విలేకరుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లుగా ఉపాధి హామీ నిధులు లక్షలాది రూపాయలు వెచ్చించి చెరువులో అభివృద్ధి పనులు కూడా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో చెరువులో మదుములు కూడా నిర్మించామన్నారు. రైతులంతా గురువారం లావేరు తహసీల్దార్‌ దిలీప్‌ చక్రవర్తిని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని ముక్తకంఠంతో కోరారు.  
 
న్యాయం చేయండి
నా వయస్సు 85 సంవత్సరాలు. మా తాతల నుంచి అబ్బాయి చెరువుపైనే ఆధారపడి మా పొలాలను సాగు చేస్తున్నాం. ఇప్పుడేమో ఎవరి పేరునో చెరువు జిరాయితీ భూమిగా ఉందని చెప్పి దాన్ని కప్పేయడానికి పన్నాగం పన్నుతున్నారు. మాకు న్యాయం చేయాలి.
   -మచ్చ సత్యనారాయణ, బాధిత రైతు, కొత్తకుంకాం

చర్యలు తీసుకుంటాం
ఎస్‌ఎల్‌ఆర్‌ రికార్డులో ఈ చెరువు జిరాయితీ భూమిగా ఉంది. ఈ చెరువులో గతంలో ఉపాధిహామీ పథకం, ఇతర ప్రభుత్వ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారా? లేదా? అనేది పరిశీలిస్తాం. రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం.
- దిలీప్‌చక్రవర్తి, తహసీల్దార్‌, లావేరు

 

Updated Date - 2022-07-08T04:21:11+05:30 IST