Abn logo
Mar 4 2021 @ 00:17AM

ట్రైకార్‌ తీరు బేకార్‌

ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 1,264యూనిట్లకు రూ.11.66కోట్లు మంజూరు
ఏ మండలానికి ఎన్ని యూనిట్లో స్పష్టం చేయని అధికారులు
ఏ ఏ యూనిట్టకు దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పించని ఐటీడీఏ
దరఖాస్తులకు ఈ నెల 15తో ముగియనున్న గడువు


ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి
గిరిజనులకు స్వయం ఉపాధి కల్పించేందుకు అందిస్తున్న రుణాల్లో స్పష్టత కరువైంది. తెలంగాణ షెడ్యూల్‌ ట్రైబల్‌ కో ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ (ట్రైకార్‌) ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజనులకు రుణాలు అందించేందుకు ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ నెల 15 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. అయితే జిల్లాల వారీగా యూనిట్లు, నిధులు అధికారులు కేటాయించారు. కానీ, మండలాల వారీగా యూనిట్లు ప్రకటించకపోవటంతో పాటు ఏయే యూనిట్లకు దరఖాస్తు చేసుకోవాలో కూడా అవగాహన కల్పించకపోవటంతో గిరిజనులు బేజార్‌ అవుతున్నారు.  

రూ.11.66కోట్ల రుణాలు
ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు భారీగా ట్రైకార్‌ రుణాలను గిరిజన సంక్షేమశాఖ మంజూరి చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని గిరిజన జనాభా ప్రతిపాదికన యూనిట్లు, నిధులను ఆయా జిల్లాలకు కేటాయించారు. ములుగు జిల్లాకు 120 యూనిట్ల కోసం రూ.1,63,11,000 కేటాయించారు. అలాగే భూపాలపల్లి జిల్లాకు 48యూనిట్లకు రూ.70,27,000 కేటాయించారు. మహబూబాబాద్‌ జిల్లాకు 690యూనిట్లు నెలకొల్పేందుకు రూ.5,53,00,000, వరంగల్‌ రూరల్‌ జిల్లాకు  181 యూనిట్ల కోసం రూ.1,98,90,000 కేటాయించారు. అలాగే వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 81యూనిట్ల కోసం రూ.62,88,000, జనగామ జిల్లాలో 144 యూనిట్ల కోసం రూ.1,18,21,000 కేటాయించారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని ఆరు జిల్లాలకు 1,264 యూనిట్లను ఏర్పాటు చేసేందుకు రూ.11,66,37,000 గిరిజన సంక్షేమశాఖ కేటాయించింది.

గందరగోళం
జిల్లాల పునర్విభజన తరువాత ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో రుణాలు, అభివృద్ధిపై అస్పష్టత నెలకొంది. ప్రస్తుతం ములుగు జిల్లా పరిధిలో ఉన్న ఏటూరునాగారం ఐటీడీఏ ద్వారా ట్రైకార్‌ రుణాలు మంజూరి చేస్తుంది. ఐటీడీఏ అధికారులు జిల్లాల వారీగా నిధులు కేటాయించారు. అయితే జిల్లాకు వచ్చిన నిధులను మండలాల వారిగా గిరిజన జనాభా అధారంగా యూనిట్లు కేటాయించాల్సిన బాధ్యత ఆయా జిల్లా కలెక్టర్లదే. గతంలో వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ పరిధిలోనే ఐటీడీఏ ఉండటంతో ఐటీడీఏ పీవో కలిసి యూనిట్లతో పాటు మండలాల వారిగా యూనిట్లను ప్రకటించేవారు. ప్రస్తుతం ఆరు జిల్లాల పరిధి కావటంతో ఆయా జిల్లా కలెక్టర్లు మండలాల వారీగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతుంది.

కాగా, జిల్లా గిరిజనాభివృద్ధి శాఖ అధికారుల ప్రతిపాదనలు చేసి, కలెక్టర్‌లకు నివేదిక ఇవ్వాల్సి ఉంది. చాల జిల్లాలో కలెక్టర్లు ట్రైకార్‌ రుణాలను ఆయా మండలాలకు కేటాయించటం లేదు. దరఖాస్తులకు గడువు దగ్గర పడుతుండటంతో ఏ మండలానికి ఎన్ని యూనిట్లో తెలియక గిరిజనులు ఆగమవుతున్నారు. అంతేకాకుండా తమ మండలానికి మంజూరి అయినా యూనిట్లలో తమకు అనుకూలమైనవి ఉన్నాయో లేవో స్పష్టత లేకపోవటంతో ఆందోళన చెందుతున్నారు. తాము దరఖాస్తు చేసుకున్న యూనిట్‌ తమ మండలానికి తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ముందుగానే మండలానికి ఎన్ని యూనిట్లు.. అందుబాటులో ఉన్న ఉపాధి పథకాలు ఏమిటో ప్రకటిస్తే బాగుండేదని గిరిజనులు అభిప్రాయ పడుతున్నారు. మండలాల వారిగా కేటాయించే యూనిట్లపై త్వరగా కలెక్టర్లు నిర్ణయం తీసుకోని ప్రకటించాలని కోరుతున్నారు.

అవగాహన కరువు
ఐటీడీఏ ద్వారా అందుతున్న ట్రైకార్‌ రుణాలపై గిరిజనులకు అవగాహన కరువైంది. గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో ట్రైకార్‌ రుణాలపై అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. రుణాలపై ఓ ప్రకటన జారీ గిరిజన శాఖ చేతులు దులుపుకుందనే విమర్శలు ఉన్నాయి. రుణాలపై అవగాహన లేకపోవటంతో మధ్య దళారులను ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. మరోవైపు దరఖాస్తులు కూడా ఆన్‌లైన్‌లో చేసుకోవాల్సి రావటంతో మీసేవా కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. ఆన్‌లైన్‌లో కూడా వ్యవయసాయ, వ్యవసాయేతర, హర్టీకల్చర్‌ తదితర రంగాల్లో వివధ యూనిట్లను చూపుతుంది. అయితే చాలా మంది ఆటో రిక్షాలు, ఎడ్ల బండ్లు, కిరాణం షాపులు, టెంట్‌ హౌస్‌ల కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఈ రుణాలకు గిరిజన శాఖ నుంచి భారీగా సబ్సిడీ అందుతుంది. లక్ష లోపు రుణం తీసుకుంటే 80శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. రెండు లక్షల లోపు రుణాలకు 60శాతం, ఐదు లక్షల లోపు రుణాలకు 40శాతం సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుంది. వీటిపై గిరిజన శాఖ గిరిజనులకు అవగాహన కల్పించలేదనే విమర్శలు ఉన్నాయి.

15 వరకు గడువు
ట్రైకార్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గత ఫిబ్రవరి 28 ఆదివారం చివరి గడువుగా ఐటీడీఏ ప్రకటించింది. అందరూ ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని కోరింది. అయితే చాల మంది గిరిజన యువతకు ట్రైకార్‌ రుణాలపై అవగాహన లేకపోవటంతో గిరిజనుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈనెల 15వ తేదీ వరకు గడువు పొడిగించింది. దీంతో వందల సంఖ్యలో దరఖాస్తులు ఆన్‌లైన్‌ నమోదు అవుతున్నాయి.


Advertisement
Advertisement