త్రివర్ణ సంబురం

ABN , First Publish Date - 2022-08-14T05:22:06+05:30 IST

75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డిలో 750 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీని నిర్వహించారు.

త్రివర్ణ సంబురం
750 మీటర్ల జాతీయ పతాకంతో నిర్వహిస్తున్న భారీ ర్యాలీ

సంగారెడ్డి పట్టణంలో భారీ ర్యాలీ.. 750 మీటర్ల జెండా ప్రదర్శన


సంగారెడ్డి టౌన్‌, ఆగస్టు 13 : 75వ స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం సంగారెడ్డిలో 750 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీని నిర్వహించారు. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ హాజరయ్యారు. చేనేత కార్మికులతో ప్రత్యేకంగా తయారు చేయించిన 750 మీటర్ల జాతీయ పతాకంతో పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి మంజీరా నగర్‌లోని గోకుల్‌ ఆస్పత్రి వరకు భారీ ర్యాలీ కొనసాగింది. గోకుల్‌ ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద మంత్రి, ఎంపీలు శాంతికపోతాలను వదిలిపెట్టి, భారీ బెలూన్లను ఎగురవేశారు. పట్టణంలోని అన్ని విద్యాసంస్థల నుంచి వేలాది మంది విద్యార్థులు, యువతీయువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా తరలివచ్చి దేశభక్తిని చాటుకున్నారు. దారి పొడవునా దేశభక్తి నినాదాలతో జిల్లా కేంద్రం హోరెత్తింది. కళాకారులు, గీతకార్మికులు, మాత్స్యకారులు ప్రదర్శన, మహిళలు బోనాలతో ఊరేగింపు నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 75 ఫీట్ల త్రివర్ణ పతాకాన్ని మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించి, ఎగురవేశారు. కలెక్టర్‌ చొరవతో అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డిల పర్యవేక్షణలో ఆర్‌ అండ్‌బీ, పంచాయతీరాజ్‌ అధికారులు రెండు రోజుల్లోనే వేదికతో పాటు 75 ఫీట్ల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం పట్ల మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బొంగుల విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు మాణిక్‌రావు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శివకుమార్‌, డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ పట్నం మాణిక్యం, అదనపు కలెక్టర్లు రాజర్షిషా, వీరారెడ్డి, ఎస్పీ రమణకుమార్‌, ఆర్‌డీవో మెంచు నగేష్‌, డీఆర్‌డీవో శ్రీనివా్‌సరావు, వ్యవసాయ అధికారి నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-08-14T05:22:06+05:30 IST