తిరుపతి గుడిపై త్రివర్ణ పతాకం.. ఓ సాహసి గాథ

ABN , First Publish Date - 2022-08-07T20:29:49+05:30 IST

ఒళ్లు పిడికిలయ్యే ఘట్టాలు అవి. స్వేచ్ఛకోసం తపించిన రోజులు అవి.తెల్లదొరల పాలనపై దేశమంతా తిరగబడిన కాలం అది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో..

తిరుపతి గుడిపై త్రివర్ణ పతాకం.. ఓ సాహసి గాథ

గోవిందరాజస్వామి గోపురంపై జెండా ఎగరేసిన సాహసి గాథ...


ఒళ్లు పిడికిలయ్యే ఘట్టాలు అవి. స్వేచ్ఛకోసం తపించిన రోజులు అవి.తెల్లదొరల పాలనపై దేశమంతా తిరగబడిన కాలం అది.ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నమోదైన పోరాట జాడలను ప్రతిరోజూ ప్రత్యేకంగా అందిస్తున్నాం.


దేశమంతా కెరటంలా ఎగసిన భారత స్వతంత్ర పోరాటం తిరుపతి నగరాన్నీ తాకిన రోజులు అవి.. సభలు, నిరసనలు అన్ని చోట్లా జరుగుతున్నాయి. దేశం నలుమూలల నుంచీ భక్తులు వచ్చిపోయే తిరుపతిలో అందరి దృష్టినీ ఆకర్షించేలా ఏదో చేయాలనే ఆలోచన ఆ పదునాలుగేండ్ల పిల్లవాడికి కలిగింది. తిరుపతి ప్రాశ్చ కళాశాల విద్యార్ధి అతను. మిత్రుడితో కలిసి ఒక పథకం రచించాడు. విందరాజస్వామి ఆలయంలో దీపాలు వెలిగించే ఉద్యోగితో స్నేహం చేశాడు. 12 అంతస్థుల భారీ రాజగోపురం మీద ప్రతి రాత్రీ అతను దీపాలు వెలిగించేవాడు. ఒకరోజు తాము కూడా గోపురం  మీదకు ఎక్కుతామని మిత్రులిద్దరూ అడిగారు. అంతపైకి ఎక్కడం ప్రమాదకరం. అదే చెప్పాడతను. అయినా పట్టుబట్టారు. చివరికి  స్నేహితులే కదా అని సరే అన్నాడు. మిత్రులిద్దరూ కలిసి చీకటి వాలుతున్న ఆ సాయంత్రం గోపురం మీదకు చేరుకున్నారు. ఆరో అంతస్థుకు చేరుకున్నాక తాము ఇంక ఎక్కలేమని చెప్పారు. దీపాల ఉద్యోగి పైకి ఎక్కి వెళ్లిపోయాడు. తిరిగి కిందికి వచ్చి ఇద్దరితో కలిసి దిగేశాడు. మరుసటి ఉదయం గోవిందరాజస్వామి రాజగోపురం మీద మూడురంగుల జెండా రెపరెపలాడుతూ కనిపించింది. తిరుపతి నగరమంతా నివ్వెరపోయి చూసింది. పోలీసులు పరుగులు తీశారు. జెండాలు తొలగించడానికి నానా తంటాలు పడ్డారు. 


తిరుపతి నగరంలో పోలీసు నిర్బంధం తీవ్రంగా ఉన్న ఆ రోజుల్లో ఏకంగా గోవిందరాజస్వామి మహారాజగోపురం మీదే త్రివర్ణపతాకం ఎగరేసిన ఆ గడుగ్గాయి పేరు తిరుమల రామచంద్ర. స్నేహితుడి పేరు కలచవీడు శ్రీనివాసాచార్యులు. హంపీ నుంచి హరప్పాదాకా అనే అద్భుత గ్రంథ రచయితగా తిరుమల రామచంద్ర ప్రసిద్ధులు.ఆయన తిరుపతిలో చదువుకునే రోజుల్లో చేసిన ఈ సాహసం అప్పటి చిత్తూరు జిల్లానే పులకింపజేసింది. స్వాతంత్య్ర ఉద్యమాన్ని జిల్లాలో ఉర్రూతలూగించింది. 


తిరుమల రామచంద్ర గాంధీ భక్తుడు. తిరుపతి ప్రాశ్చ కళాశాలలో చదువుకుంటున్నపుడే స్వతంత్ర సమరంపై ఆసక్తిపెంచుకుని, విద్యార్థి మిత్రులతో కలిసి సేవారంగంలో అడుగుపెట్టినవాడు ఆయన.  గాంధీ మార్గంలో కల్లు-సారా మానండంటూ పల్లెపట్టుల్లో తిరిగి ప్రచారం చేశారు. అప్పటి కాంగ్రెస్‌ పిలుపుమేరకు ఖద్దరు కట్టడం అలవాటు చేసుకున్నారు. భరతమాత దాస్య శృంఖలాలు విడివడడం కోసం నిరంతరం తపించారు అందుకోసం మిత్రులతో కలిసి కరపత్రాలు తయారు చేశారు. వాటిని పట్టణంలో రహస్యంగా పంచిపెట్టేవారు. 1923లో మౌలానా మహ్మద్‌ ఆలీ అధ్యక్షతన కాకినాడలో జరిగిన అఖిలభారత కాంగ్రెస్‌ సభలకు తన చిన్నాన్నతో పాటు హాజరయ్యారు రామచంద్ర.చాలా చిన్న వయసులో 14 యేళ్లకే తిరుపతి పట్టణ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అప్పటి పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కన్నయ్య నాయుడికి కంటిలో నలుసులాగా మారారు. జైల్లో వేస్తే విద్యార్ధి జీవితం నాశనమైపోతుందనే జాలితో తొలి తప్పుగా భావించి రామచంద్రను హెచ్చరించి వదిలేశారు అప్పటికి. అయితే రామచంద్రలోని స్వాతంత్య్ర కాంక్షను ఆ హెచ్చరిక తగ్గించలేకపోయింది. మళ్లీ 30 జనవరి 1932నాడు గోవిందరాజ స్వామి ఉత్తర మాడవీధిలోని నమ్మాళ్వారు గుడి గోపురంపై 20 అడుగుల వెదురుబొంగుకు జెండా కట్టి ఎగురవేశాడు. ఈ నిప్పు ఆరక ముందే 3 ఫిబ్రవరి 1932న బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా ఐదువందలకు పైగా కరపత్రాలు రూపొందించి పంచిపెట్టాడు రామచంద్ర. దీంతో అగ్గిమీద గుగ్గిలమైన ఎస్‌ఐ బలమైన కేసు నమోదు చేశాడు. కాలేజీలో విద్యార్ధుల సాక్ష్యం సంపాదించి తిరుమల రామచంద్ర ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నట్లు గట్టిగానే కేసు పెట్టడంతో 6 ఫిబ్రవరి 1932న చంద్రగిరి కోర్టులో జరిగిన విచారణలో న్యాయమూర్తి రామచంద్రకు ఏడాది కారాగార శిక్ష విధించాడు. ఇదే రామచంద్ర జీవితాన్ని పెద్ద మలుపు తిప్పింది. ఆయనను తొలుత వేలూరు జైలుకు, తరువాత తిరుచిరాపల్లి జైలుకు తరలించారు. అక్కడ అప్పటికే పేరుపొందిన పెద్ద నాయకులతో కలసి రామచంద్ర జైలుజీవితం అనుభవించాడు. సత్ప్రవర్తన కారణంగా ఏడాది జైలు తొమ్మిది మాసాలకే ముగిసింది. డిసెంబరు 1932లో తిరుచిరాపల్లి జైలునుంచి విడుదలైన రామచంద్ర తిరుపతి చేరుకున్నాడు. అప్పటికే ఆయనను కళాశాల నుంచి తొలగించారు.


- తిరుపతి (కల్చరల్‌)

తిరుమల రామచంద్ర

Updated Date - 2022-08-07T20:29:49+05:30 IST