రోశయ్య మృతి తీరని లోటు

ABN , First Publish Date - 2021-12-05T05:52:25+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు.

రోశయ్య మృతి తీరని లోటు
తాడేపల్లిగూడెంలో ఆర్యవైశ్య నాయకుల నివాళులు

ఘనంగా నివాళులు

తాడేపల్లిగూడెంలో దుకాణాల  మూసివేత 

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల పలువురు విచారం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్‌గా ఆయన అందించిన సేవలను కీర్తించారు. వివాద రహితుడిగా పేరు తెచ్చుకున్నారని నివాళులర్పించారు. తాడేపల్లిగూడెంలో ఆయన మృతికి సంతాపం తెలుపుతూ పలు దుకాణాలను మూసివేశారు. ఆర్యవైశ్య సంఘ నాయకులు  కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. 

తాడేపల్లిగూడెం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి రాష్ర్టానికి తీరని లోటని తాడేపల్లిగూడెం ఆర్యవైశ్య ప్రముఖు లు అన్నారు. రోశయ్య ఆకస్మిక మరణానికి సంతాపం తెలిపారు. కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. పట్టణంలో బట్టల షాపులు, కిరాణా, నగల దుకాణాలను మూసి వేశారు. ర్యాలీలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు ఏకాంబ రేశ్వరరావు, నున్నా ఆనంద్‌, కొనకళ్ల హరినాథ్‌, మానేపల్లి సుబ్రహ్మణ్యం, పులపర్తి రాంపండు, పెనుగొండ శ్రీనివాస్‌, మండవల్లి నాగేంద్ర, నున్న సుందరం తదితరులు  పాల్గొన్నారు. 

ఉండ్రాజవరం: మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ఉండ్రాజవరం మండల ఆర్య వైశ్య సేవా సంఘం శనివారం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా  ఉండ్రాజవరంలో సంఘ నాయకులు శాంతి ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

గణపవరం: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఆర్థికవేత్తగా, గవర్నర్‌గా సమర్థవంతంగా పని చేశారని ఆయన మృతి ఉభయ తెలుగు రాష్ర్టాలకు తీరని లోటని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాతపాటి హరికుమార్‌ రాజు పేర్కొన్నారు. శనివారం పిప్పరలోని పార్టీ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తాను యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన నాటి నుంచి ఆయనతో తనకున్న అనుబంధాన్ని తెలిపారు.  

భీమడోలు: రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, మాజీ ముఖ్యమంత్రిగా కొణిజేటి రోశయ్య అందించిన సేవలు మరువలేనివని ఏలూరు పార్లమెంటు నియోజ కవర్గ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు.  తన క్యాం పు కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించా రు. భీమడోలులోని వాసవీ ఆర్యవైశ్య సేవా సంఘం, వాసవీ క్లబ్‌ భీమడోలు సర్కిల్‌ ఆధ్వర్యంలో రోశయ్య చిత్రపటానికి స్థానిక గాంధీబొమ్మ  సెంటర్‌ వద్ద నివాళులర్పించారు. సంఘ సభ్యులు పోకూరి రామకృష్ణ, శంకర్‌, పున్నం గోపి, తెలుగొండ శ్రీను, పెరుమాళ్ళ గంగాధరరావు, ఉద్దగిరి సుబ్బారావు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

 ఉంగుటూరు:  రోశయ్య మృతికి పలువురు కాంగ్రెస్‌ నాయకులు సంతాపం తెలిపారు. శనివారం సీనియర్‌ నాయకులు కొండ్రెడ్డి సర్వేశ్వరరావు, జిల్లా కళాకారుల సంఘం అధ్యక్షుడు బొడ్డేపల్లి అప్పారావు, చల్లా సూర్యారావు, దొంతంశెట్టి సత్యనారాయణ, భీమడోలు షుగర్స్‌ మాజీ చైర్మన్‌ సుంకవల్లి వెంకట దుర్గా ప్రసాదరావు, రాచూరు మాజీ సర్పంచ్‌ రామిరెడ్డి వెంకటరెడ్డి, జిల్లా ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు కోనా శ్రీనివాసరావు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో తమ సానుభూతి వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-05T05:52:25+05:30 IST