మీరెప్పటికీ.. మా గుండెల్లోనే!

ABN , First Publish Date - 2020-09-26T09:17:36+05:30 IST

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మృదుమధుర గాత్రంతో విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది మది దోచారు. వారి మనసుల్లో సుస్థిర

మీరెప్పటికీ.. మా గుండెల్లోనే!

ఎస్పీ బాలుకు క్రీడాలోకం నివాళి

న్యూఢిల్లీ: గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన మృదుమధుర గాత్రంతో విశ్వవ్యాప్తంగా కోట్లాదిమంది మది దోచారు. వారి మనసుల్లో సుస్థిర స్థానం పొందారు. దిగ్గజ ఆటగాళ్లెందరో బాలు అభిమానులు. ఇప్పుడు ఎస్పీబీ మరణంతో క్రీడాలోకం దిగ్ర్భాంతి చెందింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపింది.

ఇలాంటి సన్మానం ఎప్పుడూ పొందలేదు..

సంగీతం, పాటలు తర్వాత బాలసుబ్రహ్మణ్యానికి అత్యంత ఇష్టమైన ఆట క్రికెట్‌. ఆ తర్వాత టెన్నిస్‌, హాకీని ఆయన అభిమానిస్తారు. చెన్నైలో అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగినప్పుడు సమయం దొరికితే బాలు వాటికి తప్పకుండా హాజరయ్యేవారు. గత ఏడాది మనుమరాళ్లతో కలిసి యూఎస్‌ ఓపెన్‌లో కొన్ని మ్యాచ్‌లు తిలకించారు. అంతేకాదు.. అనారోగ్యంతో ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నప్పుడు  ట్యాబ్‌లో క్రికెట్‌, టెన్నిస్‌ మ్యాచ్‌లు చూస్తూ సాంత్వన పొందారని ఆయన కుమారుడు చరణ్‌ చెప్పాడు.  ఇక..కొలంబోకు చెందిన ‘కంబన్‌ కజగమ్‌’ అనే సాహిత్య సంస్థ బాలసుబ్రహ్మణ్యంతోపాటు శ్రీలంక దిగ్గజ క్రికెటర్‌ కుమార సంగక్కరకు 2020 సంవత్సరానికి ‘కంబన్‌ పుగజ్‌’ పురస్కారాలు ప్రకటించింది. దీనిని గత ఫిబ్రవరిలో వారికి ప్రదానం చేశారు. ఈ  సందర్భంగా బాలు మాట్లాడుతూ.. ‘ఇలాంటి సన్మానాన్ని నెనెప్పుడూ అందుకోలేదు. క్రీడల్లో దిగ్గజమైన సంగక్కరతో వేదికను పంచుకోవడం తనకు మహదానందాన్ని కల్గించింది’ అని అన్నారు.


ఆనంద్‌ తొలి స్పాన్సర్‌ బాలూనే

‘అది 1983వ సంవత్సరం. అప్పుడు నాకు 13 ఏళ్లు. అప్పట్లో బొంబాయిలో జరిగిన నేషనల్‌ టీమ్‌ చాంపియన్‌షి్‌పలో మద్రాస్‌ కోల్ట్స్‌ పాల్గొనాల్సి ఉంది. అయితే ఆర్థిక ఇబ్బందులతో మా జట్టు చాంపియన్‌షిప్‌ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రఖ్యాత గీత రచయిత ఆరుద్ర... బాలూగారి ద్వారా ఆర్థిక సాయం అందించారు. ఆ టోర్నీలో మేం టీం చాంపియన్‌షిప్‌ నెగ్గాం. నేను టాప్‌ బోర్డ్‌ ప్రైజ్‌ అందుకున్నా. ఒక విధంగా ఆ టోర్నమెంట్‌ నా కెరీర్‌కు మైలురాయి. అలా..నా తొలి స్పాన్సర్‌ బాలూగారే. ఆయన పాటలు, సంగీతం మాకు ఎంతో ఆహ్లాదం కలిగించేవి. అంత గొప్ప వ్యక్తి మృతి విచారకరం’  -విశ్వనాథన్‌ ఆనంద్‌


అన్నికాలాలకూ ఆయన గొప్ప గాయకుడు. బాలసుబ్రహ్మణ్యం సర్‌... మీరెప్పుడూ మా గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు.  -క్రిష్‌ శ్రీకాంత్‌

దిగ్గజ గాయకుడి మరణం ఎంతో విచారకరం. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి.                         -గౌతమ్‌ గంభీర్‌

ఎస్పీబీ సర్‌ మరణవార్తతో గుండె పగిలింది. ఆయన పాటలు అజరామరం. క్రికెట్‌ అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. చెన్నైలో ఆయనతో నా సమావేశాలు ఎప్పుడూ గుర్తుంటాయి. -అనిల్‌ కుంబ్లే

బాలూగారి మృతి విచారకరం. తన పాటలతో ఆయన మన గుండెల్లో ఎప్పుడూ నిలిచే ఉంటారు.            -వీవీఎస్‌ లక్ష్మణ్‌

దేవుడా..ఈ ఏడాది దారుణంగా ఉంది. రోజుకో దుర్వార్త వినాల్సి వస్తోంది.        -రవిచంద్రన్‌ అశ్విన్‌

సంగీతం ఆయనను, ఆయన్ను సంగీతం ప్రేమించాయి.  -రవిశాస్త్రి

శంకరా నాద శరీరాపరా.. అన్న గొప్ప పాటతో ఎస్పీబీ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటారు.               -హర్షా భోగ్లే, క్రికెట్‌ వ్యాఖ్యాత

ఆయన లేని లోటు తీర్చలేనిది.      -పీటీ ఉష


Updated Date - 2020-09-26T09:17:36+05:30 IST