వైసీపీకి గిరిజనులు అండగా నిలవాలి

ABN , First Publish Date - 2022-07-02T06:27:05+05:30 IST

గిరిజనులు వైసీపీ అండగా ఉండాలని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి కోరారు.

వైసీపీకి గిరిజనులు అండగా నిలవాలి
ప్లీనరీలో మాట్లాడుతున్న వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ.సుబ్బారెడ్డి, వేదికపై మంత్రి అమర్‌నాథ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర, ఎంపీ మాధవి, ఎమ్మెల్యేలు

పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త వైవీ.సుబ్బారెడ్డి

జనం బయటకు వెళ్లకుండా గేట్లు మూసివేత

సభా ప్రాంగణంలో పోలీసు బందోబస్తు


పాడేరు, జూలై 1 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు వైసీపీ అండగా ఉండాలని ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, టీటీడీ చైర్మన్‌ వైవీ.సుబ్బారెడ్డి కోరారు. స్థానిక ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అధ్యక్షతన శుక్రవారం ఇక్కడ నిర్వహించిన జిల్లా స్థాయి వైసీపీ ప్లీనరీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2014, 2019 ఎన్నికల్లోనూ గిరిజనులు వైసీపీ వెంటే ఉండి ఆదరించారని, 2024లోనూ అండగా ఉండాలని కోరారు.వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీకే అధికారం కట్టబెట్టి, జగన్‌ను సీఎం చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి 175 అసెంబ్లీ సీట్లు వచ్చేందుకు సహకరించాలన్నారు. గిరిజనులు వ్యతిరేకించిన చంద్రబాబునాయుడు బాక్సైట్‌ తవ్వకాలు చేపట్టేందుకు జీవో.97 తీసుకువచ్చారని, వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోను రద్దు చేసిందని చెప్పారు. అలాగే నవరత్నాల పేరిట పేదలకు ఎనలేని సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాఽథ్‌, అరకులోయ ఎంపీ జి.మాధవి, జడ్పీ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి, అరకు పార్లమెంట్‌ నియోజకవర్గ పరిశీలకుడు పరిక్షిత్‌రాజు, ట్రైకార్‌ చైర్మన్‌ ఎస్‌.బుల్లిబాబు, మాజీ మంత్రులు మత్స్యరాస బాలరాజు, పసుపులేటి బాలరాజు, ఎస్టీ కమిషన్‌ రాష్ట్ర సభ్యురాలు జె.లిల్లీసురేశ్‌, పాడేరు, అరకులోయ, రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నాయకులు పాల్గొన్నారు. 


జనం బయటకు వెళ్లకుండా గేట్లు మూసివేత

ఇటీవల వైసీపీ నేతల కార్యక్రమాలకు హాజరవుతున్న జనం సభలు, సమావేశాల మధ్యలోనే అక్కడి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. దీంతో శుక్రవారం స్థానిక మోదకొండమ్మ ఆడిటోరియంలో జరిగిన వైసీపీ ప్లీనరీకి వచ్చిన జనం మధ్యలో బయటకు వెళ్లకుండా ఆడిటోరియం అవుట్‌ గేటును పోలీసులు మూసివేశారు. అలాగే సభా ప్రాంగణంతో పాటు గేటు వద్ద బందోబస్తు నిర్వహించి, ఆడిటోరియం లోపలకు వెళ్లే వారి కోసం మాత్రమే పోలీసులు గేటు తీశారు. తద్వారా కార్యక్రమం పూర్తయ్యేవరకూ జనం లోపలే ఉండేలా చర్యలు చేపట్టారు. 

Updated Date - 2022-07-02T06:27:05+05:30 IST