గిరిజనుల ఆశాదీపం

ABN , First Publish Date - 2022-05-22T05:20:13+05:30 IST

కూసింత సాయం చేసి పదింతలుగా ప్రచారం చేసుకునే నేటి రోజుల్లో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దశాబ్దాలుగా సేవలందిస్తూ గిరిజనుల పెన్నిధిగా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) సంస్థ నిలిచింది. కంప్యూటర్‌ యుగంలో నాగరికతకు అత్యంత దూరంగా అటవీ ప్రాంతంలో నివసిస్తూ అక్షరం విలువ తెలియని ఆదివాసీలను చైతన్యపరిచింది.

గిరిజనుల ఆశాదీపం
గూడేల్లో నిర్మించిన పక్కాగృహాలు గిరిజన మహిళలకు అవగాహన కల్పిస్తున్న సిబ్బంది

సేవే ఆర్‌డీటీ సంస్థ లక్ష్యం

వందల సంఖ్యల్లో గృహనిర్మాణాలు

జీవనోపాధుల పెంపునకు ఆర్థిక తోడ్పాటు

ఉచిత విద్య, వైద్యం 

పెద్ద దోర్నాల, మే 21: కూసింత సాయం చేసి పదింతలుగా ప్రచారం చేసుకునే నేటి రోజుల్లో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా దశాబ్దాలుగా సేవలందిస్తూ గిరిజనుల పెన్నిధిగా రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌(ఆర్‌డీటీ) సంస్థ నిలిచింది. కంప్యూటర్‌ యుగంలో నాగరికతకు అత్యంత దూరంగా అటవీ ప్రాంతంలో నివసిస్తూ అక్షరం విలువ తెలియని ఆదివాసీలను చైతన్యపరిచింది. ఏటా కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తూ వారిని సమాజానికి చేరువ చేసేందుకు అలుపెరుగని కృషి చేస్తూ అండదండలందిస్తోంది. ప్రధానంగా నిరుపేదలైన చెంచుల పాలిట కల్పతరువులా నిలిచి ఆర్థికాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ పలువురికి స్ఫూర్తినిస్తోంది.


 సేవే లక్ష్యం 

నలబై సంవత్సరాల క్రితం భారతదేశంలో జీవన విధానాలు పరిశీలించేందుకు అనంతపురం వచ్చిన ఫాదర్‌ పెర్రర్‌ పేదల స్థితిగతులు చూసి చలించి సమాజసేవే లక్ష్యంగా ఆర్‌డీటీ సంస్థనుఏర్పాటు చేశారు. ప్రధానంగా తాగునీటిని జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు సరఫరా చేసి అందరి దాహం తీర్చాడు. అనంతరం సేవామార్గంలోనే పేదల అభివృద్ధి కోసం ఇతర దేశాల్లో ఏటా నిధులు సేకరించడం ఇక్కడ పేదలకు వినియోగించేవాడు. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో సేవలు విస్తృత పరిచి తదనంతరం ప్రకాశం జిల్లాకు వచ్చారు. అత్యధికంగా చెంచులపై సర్వే నిర్వహించి సేవలు ఆరంభించారు. 

 

ప్రకాశం జిల్లాలో...

దోర్నాల మండలకేంద్రంగా చిన్నదోర్నాలలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారికి పక్కన కార్యాలయం ఏర్పాటు చేశారు. పెర్రర్‌ ఆశయాలకనుగుణంగా ఆయన కుమారుడు మాంచో పెర్రర్‌ అనంతపురం తర్వాత కర్నూలు, నంద్యాల, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు ఆర్‌డీటీ సేవలు విస్తరించారు. చెంచులు, ఇతర గిరిజనులు ముఖ్యంగా నివశించేందుకు సరైన ఇళ్లు కూడా లేవు. అక్షరాస్యత ఇరవై శాతానికి మించి లేదు. ఆరోగ్యం అంతంతమాత్రమే. తొంభై శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. జీవనోపాధులు మృగ్యమయ్యాయి. వ్యవసాయ భూములున్నా ఫలితం లేదు. ఎంతచేసినా తక్కువనిపించేలా గిరిజనుల స్థితిగతులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా పక్కాగృహాలపై దృష్టిసారించారు. పదేళ్లుగా లబ్ధిదారులను గుర్తించి రూపాయి ఖర్చులేకుండా ఇంటి పట్టా నుంచి గృహం నిర్మించి వారికందిస్తున్నారు. ప్రభుత్వం చేయలేని సహాయాన్ని సంస్థ అందిస్తోంది.ఒక్కో గృహ నిర్మాణానికి రూ.4లక్షలకుపైగా వెచ్చించారు ఇప్పటికి ప్రకాశం జిల్లాలో 1,299, నంద్యాలలో 850, గుంటూరు జిల్లాలో 291 గృహాలను నిర్మించింది. 


చేతివృత్తులపై శిక్షణ

ఇళ్లను నిర్మిస్తూనే ప్రతి గూడెంలో మహిళలకు కుట్టుమిషను నేర్పించడం, విస్తరాకులు, వెదురుతో వస్తువులు తయారీ తదితర అంశాల్లో శిక్షణ నిచ్చి ఆర్థిక సహాయం చేస్తోంది. క్రమం తప్పకుండా క్షయ వ్యాధిగ్రస్థులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందజేస్తున్నారు. ఎద్దులు, గేదెలు, మేకలు, గొర్రెలు, వ్యవసాయ పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఇంటి ఆవరణలో పెంపకం చేపట్టేందుకు కూరగాయ మొక్కలు, పండ్లమొక్కలు అందిస్తోంది. అంతేగాక దివ్యాంగులను గుర్తించి గ్రూపులుగా చేసి జీవనోపాధుల పెంపుదలకు సహాయం చేస్తోంది. ట్రైసైకిళ్లను పంపిణీ చేశారు. బాగా చదివే విద్యార్థులను సంస్థ ప్రోత్సహిస్తోంది. ఉన్నత విద్యకు అయ్యే ఖర్చు భరిస్తోంది కార్పొరేట్‌ వైద్యం అందిస్తోంది. దోర్నాలలోనే నూతనంగా వైద్యశాలను నిర్మిస్తున్నారు. గ్రామాలలో చైతన్యసదస్సులు ఏర్పాటు చేసి సారా వంటి దురలవాట్లను దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచింది. మున్ముందు మరిన్ని సేవలు అందించనున్నట్లు ఏటీఎల్‌ నాగరాజు తెలిపారు.

 

Updated Date - 2022-05-22T05:20:13+05:30 IST