మూల వాసి

ABN , First Publish Date - 2020-08-09T10:04:06+05:30 IST

పర్యావరణంలో అడవులు కీలకం. అడవిలో ఆదివాసులు భాగం. అటవీ సంరక్షణలో వారిదే కీలక పాత్రం.

మూల వాసి

  • వైవిధ్యం.. గిరిజన జీవితం
  • నల్లమల చెంచులపై నిర్లక్ష్యం
  • కనుమరుగు అవుతున్న సంస్కృతి
  • నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం


ఆత్మకూరు, ఆగస్టు 8: పర్యావరణంలో అడవులు కీలకం. అడవిలో ఆదివాసులు భాగం. అటవీ సంరక్షణలో వారిదే కీలక పాత్రం. ఆధునిక ప్రపంచం విశృంఖలత్వం కారణంగా అడవి, ఆదిమజాతి ముప్పును ఎదుర్కొంటోంది. చాలా జాతులు ఇప్పటికే అంతరించిపోయాయి. మిగిలిన వారినైనా కాపాడుకోవాలని ఐక్యరాజ్య సమితి పిలుపునిచ్చింది. దీనిపై చైతన్యం కోసం ఏటా ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని 1994లో తీర్మానించింది. గిరిజనులకు ప్రత్యేక చట్టాలు, హక్కులను ప్రసాదించేందుకు ప్రపంచ దేశాల ప్రతినిధులతో 1997లో తీర్మానానికి ఆహ్వానించింది. 143 సభ్యుదేశాలు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. 125 దేశాలు అమోదించాయి. 14 దేశాలు తటస్థ వైఖరి తెలిపాయి. నాలుగు దేశాలు వ్యతిరేకించాయి. ఆదివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. ఈ సందర్భంగా నల్లమల గిరిజనులపై కథనం.


నల్లమలలో ఆదివాసీ చెంచు గిరిజన తెగ మూలాలు ఇంకా మిగిలే ఉండటం హర్షించదగ్గ పరిణామం. వారు ప్రకృతితో మమేకమై వైవిధ్యమైన జీవనాన్ని గడపుతున్నారు. నల్లమలలో పలు చెంచు గూడేలు ఉన్నాయి. ఉపాధి కోసం విల్లంబులు చేతబట్టినా.. వన్యప్రాణులకు హాని చేయరు వీరు. 


భిన్న సంప్రదాయాలు

  1. పెచ్చెర్వుకు చెంచుల రాజధానిగా పేరు. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడ పాటిస్తున్నారు. అభయారణ్య గర్భంలో ఉండే మరికొన్ని గూడేల్లో కూడా ఇది కొనసాగుతోంది. 
  2. నల్లమల చెంచులు వన్యప్రాణులను ఆరాధిస్తారు. అడవి జంతులను తమ కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటారు.
  3. నల్లమల చెంచులు వృక్షాలను వన దేవతలుగా భావిస్తారు. తమ ఆరాధ్య దైవాలను రాతి విగ్రహాల రూపంలో కొలుస్తారు. శుభకార్యాల సమయంలో పలు వృక్షాలకు పూజలు చేస్తారు. తేనె పట్టు తీసే సమయంలో ఆ వృక్షానికి పూజలు చేస్తారు.


తగ్గుతున్న విద్యా ప్రమాణాలు

ఆత్మకూరు ప్రాంతం పరిధిలోని బైర్లూటి, శివపురం, కొట్టాలచెరువు, పాలెంచెరువు తదితర ప్రాంతాల్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు ఉన్నాయి. కానీ వాటి నిర్వహణ అథమ స్థాయిలో ఉంది. రూ.కోట్లు కేటాయిస్తున్నా ఫలాలు గిరిజన విద్యార్థులకు అందడం లేదు. ప్రభుత్వం పర్యవేక్షణను గాలికి వదిలేయడమే ఇందుకు కారణం. దీంతో పర్యవేక్షాణాధికారులు నిధులను దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 2008 నుంచి 2014 వరకు 848 మంది గిరిజన బాలలు డ్రాపౌట్స్‌గా మిగిలిపోయారు. వీరిని తిరిగి బడికి రప్పించే ప్రయత్నం జరగలేదు. ఐటీడీఏ గణాంకాల్లో మాత్రం విద్యా ప్రమాణాలు మెరుగ్గా ఉన్నాయి. ఇది ఎలా సాధ్యమో అధికారులే చెప్పాలి.


ఆరోగ్య సమస్యలు

చెంచుగూడేల్లో గిరిజనులను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. రక్తహీనత, టీబీ, కుష్ఠు, మలేరియా, సీజనల్‌ జ్వరాలు, చర్మవ్యాధులతో బాధపడుతున్నారు. పోషకాహార లోపం కారణంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో రక్తహీనత ఎక్కువగా ఉంది. తద్వారా మాతాశిశు మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విషయం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆసుపత్రులను ఏర్పాటు చేసినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. 


నల్లమలలో..

చెంచు గూడేలు : 42

జనాభా   : 8200

కుటుంబాలు  : 2160

గిరిజన ఆశ్రమ పాఠశాలలు : 20

గిరిజన జూనియర్‌ కళాశాలలు : 03

Updated Date - 2020-08-09T10:04:06+05:30 IST