గిరిజన రైతులకు మేలిమి వంగడాలు అందాలి

ABN , First Publish Date - 2022-05-19T06:17:34+05:30 IST

గిరిజన రైతులకు నూతన యాజమాన్య పద్ధతులు, మేలిజాతి విత్తనం అందించేందుకు హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానిక వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు ఝాన్సీ లక్ష్మి సూచించారు.

గిరిజన రైతులకు మేలిమి వంగడాలు అందాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏడీఏ ఝాన్సీ లక్ష్మి

వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు ఝాన్సీ లక్ష్మి


చింతపల్లి, మే 18: గిరిజన రైతులకు నూతన యాజమాన్య పద్ధతులు, మేలిజాతి విత్తనం అందించేందుకు హార్టికల్చర్‌, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ తీసుకోవాలని స్థానిక వ్యవసాయశాఖ సహాయక సంచాలకులు ఝాన్సీ లక్ష్మి సూచించారు. బుధవారం సబ్‌ డివిజన్‌ కేంద్రంలో చింతపల్లి, కొయ్యూరు, జీకేవీధి మండలాల ఆర్‌బీకే ఉద్యోగులతో ఏడీఏ ఖరీఫ్‌ సాగుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ఈ ఏడాది తొలకరి వర్షాలు గిరిజన ప్రాంతంలో విస్తారంగా కురిశాయన్నారు. రైతులు వేసవి దుక్కులు చేసుకుని, ఖరీఫ్‌ నాట్లుకు సిద్ధం కావాలన్నారు. ప్రధానంగా గిరిజన రైతులు వరి నారుమడులు, మొక్కజొన్న నాట్లు తొలివిడతగా వేసుకుంటారన్నారు. అలాగే వచ్చే నెలలో రాగి, సామ, కొర్ర, వేరుశనగ పంటల నాట్లు వేసుకోవాల్సి వుంటుందన్నారు. ఆర్‌బీకే ఉద్యోగులు రైతుల వద్దకు వెళ్లి నారుమడులు వేసుకునే సమయంలో పొలాలను సిద్ధం చేసుకోవడం, నాట్లు వేసుకునే పద్ధతులపై పూర్తి స్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం రాయితీ ద్వారా అందజేస్తున్న రాయితీ వరి విత్తనాలు ప్రతి రైతుకి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతు భరోసా కేంద్రంలో అందుబాటులోనున్న విత్తనాలు, పురుగు మందులు, ఎరువుల సమాచారం రైతులకు తెలియజేయాలన్నారు. ఉద్యాన పరిశోధన స్థానం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్‌ శివకుమార్‌ మాట్లాడుతూ ఉద్యాన పంటల్లో కలిగే చీడపీడలపై రైతులు సలహాలు, సూచనలు పొందవచ్చునన్నారు. వేసవిలో కాఫీ, మిరియాల పంటల్లో చేట్టాల్సిన సస్యరక్షణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. అనాసలోనూ చీడపీడల నివారణకు ఉద్యానశాఖ అధికారి సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో మూడు మండలాల వ్యవసాయ అధికారులు నవీన్‌ జ్ఞానామణి, కన్నబాబు, కృష్ణవేణి, పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారి ధనలక్ష్మి, లోతుగెడ్డ పశువైద్యాధికారి ధమయంతి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-19T06:17:34+05:30 IST