గంజాయి నిర్మూలనకు సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-28T06:19:02+05:30 IST

మన్యంలో గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా సహకరించాలని ఏఎస్పీ పి.జగదీశ్‌ కోరారు.

గంజాయి నిర్మూలనకు సహకరించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పీ జగదీశ్‌


స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఏఎస్పీ పి.జగదీశ్‌ వినతి


పాడేరురూరల్‌, అక్టోబరు 27: మన్యంలో గంజాయి సాగు, రవాణా నిర్మూలనకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా సహకరించాలని ఏఎస్పీ పి.జగదీశ్‌ కోరారు. బుధవారం పాడేరు, హుకుంపేట మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో ఇక్కడ నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొంతమంది వ్యక్తులు గంజాయి సాగు చేయడం వల్ల  ఏజెన్సీ మొత్తానికి చెడ్డ పేరు వస్తున్నదని అన్నారు. స్వార్థపరులు తెరవెనుక వుండి అమాయకులైన గిరిజనులతో గంజాయి సాగు, యువతతో రవాణా చేయిస్తున్నారని, దీంతో పోలీసుల దాడుల్లో గిరిజనులు పట్టుబడి శిక్ష అనుభవించాల్సి వస్తున్నదని చెప్పారు. అందువల్ల గంజాయి సాగు, రవాణాకు ఆదివాసీలు దూరంగా ఉండాలన్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు మీ పరిధిలో ఎక్కడా గంజాయి సాగు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమావేశంలో ఎస్‌ఈబీ సీఐ ఈ.కేశవరావు, పోలీసు స్టేషన్‌ సీఐ బి.సుధాకర్‌, ఎస్‌ఐ జి.లక్ష్మణరావు, హుకుంపేట ఎస్‌ఐ పాపినాయుడు, పాడేరు, హుకుంపేట మండలాల వైఎస్‌ ఎంపీపీలు గంగపూజారి శివకుమార్‌, ఎస్‌.కొండలరావు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


గంజాయి దుష్ఫలితాలపై అవగాహన కల్పించాలి:సీఐ 

గూడెంకొత్తవీధి, అక్టోబరు 27: గంజాయి సాగు, రవాణా చేస్తే పోలీసులు కేసుల్లో ఇరుక్కుంటారని, దీనివల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని సీఐ అశోక్‌ కుమార్‌ అన్నారు. బుధవారం మహిళా సంరక్షణ కార్యదర్శి, గ్రామ వలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గంజాయి వల్ల కలిగే దుష్ఫలితాలపై ఆదివాసీలకు అవగాహన కల్పించాలని అన్నారు. మండలంలో గంజాయి మొక్క అనేది కనపించకుండా ఐక్యంగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.  


Updated Date - 2021-10-28T06:19:02+05:30 IST