వలంటీర్లుగా ఆదివాసీల అవస్థలు

ABN , First Publish Date - 2021-11-27T07:55:02+05:30 IST

రాష్ట్రంలో వైస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆదివాసీ యువతలో చాలా ఆశలను రేకెత్తించింది. ఈ వ్యవస్థలో భాగమైతే, పెద్దగా చదువుకోకపోయినా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ...

వలంటీర్లుగా ఆదివాసీల అవస్థలు

రాష్ట్రంలో వైస్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఆదివాసీ యువతలో చాలా ఆశలను రేకెత్తించింది. ఈ వ్యవస్థలో భాగమైతే, పెద్దగా చదువుకోకపోయినా గ్రామంలో వ్యవసాయం చేసుకుంటూ పార్ట్ టైంగా ఈ ఉద్యోగం చేసుకోవచ్చని వారు ఆశపడ్డారు. తోటి గ్రామస్తులకు సేవ చేసే అవకాశం, అలాగే ప్రభుత్వ యంత్రాంగంలో భాగమయ్యే గౌరవం లభిస్తుందని భావించారు. కానీ, గ్రామ వలంటీరు వ్యవస్థ రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము చేసిన పరిశీలనలో వారందరూ పూర్తి నిరాశలో ఉన్నట్లు తేలంది.


రాష్ట్రవ్యాప్తంగా 29 గిరిజన మండలాల్లో గత జూలై నాటికి గ్రామ వలంటీర్ల సంఖ్య 6804గా ఉండేది. అది ఈ నవంబర్ నాటికి 6654కు తగ్గింది. అంటే ఐదు నెలల్లో సుమారు 150 మంది విధులకు రాజీనామా చేశారు. గ్రామ వలంటీరుగా పని చేయలేకపోతున్నామని, ఏ ఇతర అవకాశం ఉన్నా మానేస్తామని ఇప్పటికీ పని చేస్తున్నవారు మాతో చెప్పుకున్నారు. ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతాలలోని గ్రామ వలంటీర్ల సమస్యలేమిటో చూద్దాం.


నవరత్నాల ద్వారా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ప్రజాసేవల పంపిణీ వ్యవస్థల్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని, అందుకోసమే గ్రామ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెడుతున్నామని వైస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ప్రకటించారు. కులం, మతం, జాతి, లింగం, రాజకీయ పార్టీల వంటి అంశాలతో సంబంధం లేకుండా ప్రజల గడప దగ్గరకు ప్రభుత్వ సేవలు అందించడం వలంటీరు వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యమని జీవో 104 పేర్కొంది. అలాగే ఈ వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలలో అవినీతికి ఆస్కారముండదని అన్నారు. ఈ ఉద్యోగానికి మైదాన ప్రాంతాల వారికి ఇంటర్మీడియట్‌ను, గిరిజన ప్రాంతాల వారికి పదవ తరగతిని అర్హతగా నిర్ణయించారు. వలంటీర్లకు నెలకు రూ.5వేలు గౌరవ వేతనంగా ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. ప్రతి 50 కుటుంబాలకు ఒక వలంటీరును నియమిస్తున్నామని, వారి శిక్షణ నిమిత్తం నిధులు విడుదల చేస్తున్నామని జీవోలో పేర్కొన్నారు. 


ఒక్క పాడేరు ఐటిడిఎ లోనే 1800 పైగా గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. ఆ సదుపాయం ఉన్న గ్రామాల్లో సైతం రవాణా సౌకర్యం లేదు. 501 గ్రామ సచివాలయాలలో 278 గ్రామ సచివాలయాలకు నెట్‌వర్క్ కవరేజీ లేదు. వీటితో పాటు ఎన్నో భౌగోళిక సవాళ్లు ఉన్నాయి. ఈ కారణంగా ఒక్కో వలంటీరుకు 50 కుటుంబాలను అప్పజెప్పాలన్న నిబంధనను సవరించాలని, ప్రతి గిరిజన గ్రామానికి కనీసం ఒక వలంటీరును నియమించాలని ప్రజాసంఘాలు పలుమార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. ఈ విషయాల పట్ల అవగాహన ఉందని, గిరిజన ప్రాంతాలలో ఒక్క వలంటీరుకు 30 కుటుంబాలను అప్పజెబుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశామని గిరిజన సంక్షేమ శాఖ అధికారులు చెబుతున్నారు. కానీ ఆ ఉత్తర్వుల జాడ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. 


నిజానికి గిరిజన ప్రాంతాల్లో వలంటీర్ల ఎంపిక ప్రక్రియ మొదటి నుంచి లోపభూయిష్టంగానే నడిచింది. రాష్ట్రంలో ఐటిడిఎ ప్రాజెక్టు అధికార కార్యాలయాలు తమకు కావాల్సిన వలంటీర్ల సంఖ్యను సరైన క్షేత్రస్థాయి పరిశీలన లేకుండా కేవలం రెండు వారాల్లోనే – 2019 ఆగష్టు నెలలో ఖరారు చేశారు. దానితో మొదటి నుంచే గిరిజన గ్రామాల్లో వలంటీరు వ్యవస్థ గాడి తప్పింది. ఇప్పుడు రాష్ట్రంలోని గిరిజనేతర మండలాల్లో సగటున ఒక్కొక్క వలంటీరు 50 కుటుంబాలకు సేవలు అందిస్తుంటే, 29 గిరిజన మండలాలలో మాత్రం ఒక్కో గ్రామ వలంటీరు సగటున 63 కుటుంబాలకు బాధ్యత వహిస్తున్నారు. 


గిరిజన గ్రామాల్లో సగటు కుటుంబాల సంఖ్య బాగా తక్కువ కావడంతో చాలామంది వలంటీర్లు, ఒక్కొక్కరూ 2–3 గ్రామాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ గ్రామాలను చేరుకోవడానికి కొండలు, గెడ్డలు దాటాల్సి వస్తుంది. ఉదాహరణకు విశాఖ జిల్లా గంగరాజు మాడుగుల మండలం, అడ్డతీగల గ్రామానికి చెందిన వలంటీరు రోడ్డు మార్గాన 10 కిలోమీటర్ల ఎడంగా ఉన్న 3 గ్రామాలను పర్యవేక్షిస్తున్నారు. ఆయన పరిధిలో ఉన్న ఒక గ్రామాన్ని చేరుకోవడానికి రోడ్డు ప్రయాణంతో పాటు కొండ ఎక్కాల్సి ఉంటుంది. దీనివల్ల వారికి పని భారం తీవ్రంగా పెరుగుతోంది. ఉదాహరణకు మూడు గ్రామాల కుటుంబాల బాధ్యతలను మోస్తున్న గ్రామ వలంటీరు వారంలో కనీసం ఒకసారి ఐనా ఆ మూడు గ్రామాలకు వెళ్ళాలి. సగటున వారానికి మూడుసార్లు గ్రామ సచివాలయానికి, నెలకు రెండుసార్లు మండల కేంద్రానికి వెళ్ళాలి. దానికోసం వారికి నెలకు దాదాపు రూ.2 వేలు ఖర్చవుతాయి. ఎంత తిరిగినా ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనంతో సరి పెట్టుకోవాల్సిందే తప్ప, ప్రయాణ ఖర్చులు పొందే అవకాశం లేదు. అలాగే గ్రామ సచివాలయ సిబ్బంది గ్రామాల్లో తాము చేయాల్సిన పనులన్నింటినీ ఈ వలంటీర్లుకు అప్పగిస్తున్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఇలా ఒకరేమిటి అందరూ వారితో అడ్డమైన చాకిరీ చేయించుకుంటున్నారు.


పని ప్రారంభించిన మొదటి నెలలో వలంటీర్లకు తమ ముందున్నది బాట ముళ్లబాట అని అర్థమైంది. గంగరాజు మాడుగుల మండలానికి చెందిన వలంటీరు మండల అధికారికి వ్యతిరేకంగా జాయింట్ కలెక్టరుకు ఫిర్యాదు చేశాడు. దాంతో అధికారులందరూ ఏకమయ్యారు. అధికార పరమపద సోపానంలో వలంటీర్ల స్థానమేమిటో దేవభాషలో విడమర్చి చెప్పారు. ఇక వాలంటీర్లందరూ దారికి రాక తప్పింది కాదు. 


అలాగే వలంటీర్ల నియామకంలో అధికార పార్టీ నాయకుల ఒత్తిడి కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఉదాహరణకు గంగరాజు మాడుగుల మండలం, ములక్కాయపుట్టు గ్రామంలో 45 కుటుంబాలు ఉంటే ఆ గ్రామంలో అర్హత కలిగిన వారిని పక్కనపెట్టి అక్కడికి 5 కి.మీ., దూరంలో ఉన్న గొందిమొలక గ్రామానికి చెందిన వ్యక్తిని వలంటీరుగా నియమించారు. అదే గొందిమొలక గ్రామ వలంటీరుగా 8 కి.మీ., దూరంలో ఉన్న వంజరి గ్రామానికి చెందిన వ్యక్తిని నియమించారు. వీటికితోడు తమకు రేషన్ కార్డు ఇప్పించలేకపోయారనో, రైతు భరోసా డబ్బులు రాలేదనో గ్రామస్తులు వారిపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం తమ పరిధిలో ఉండదని వలంటీర్లు చెప్పినా గ్రామస్తులు వినిపించుకోవడం లేదు. ఈ ఒత్తిడి తట్టుకోలేక మానేయాలనుకుంటున్నామని పలువురు వలంటీర్లు మా బృందం దగ్గర గోడు వెళ్ళబోసుకున్నారు. ఇవన్నీ చాలవన్నట్లు మావోయిస్టుల భయంతో కొయ్యూరు మండలానికి చెందిన 32 మంది వలంటీర్లు మూకుమ్మడి రాజీనామా చేయాల్సి వచ్చింది. వారికి ఏదో సర్ది చెప్పి రాజీనామాలు వాపసు తీసుకునేటట్లు చేశారు. 


రాష్ట్రంలో గిరిజనేతర ప్రాంతాల వారితో పోలిస్తే గిరిజన వలంటీర్లు సగటున ఎక్కువ పని చేయాల్సి వస్తున్నా, అందరికీ అందుతున్న గౌరవవేతనం ఒకటే. గిరిజన ప్రాంతాల్లోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా మైదాన ప్రాంతాల మాదిరి ఫలితాలను సాధించాలంటే ఇక్కడ సాపేక్షంగా ఎక్కువ పెట్టుబడులు పెట్టాలని గిరిజన ఉపప్రణాళిక రాష్ట్రాలను నిర్దేశిస్తోంది. కానీ వలంటీరు వ్యవస్థలో అది అమలు కావడం లేదు. గిరిజన ప్రాంతాలలో పని చేసే అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక భత్యం చెల్లిస్తుంది. కానీ గ్రామ వలంటీర్లు దానికి నోచుకోవడం లేదు. వారికి వేతనం పెంచాల్సిన అవసరంపై సాక్షాత్తు గిరిజన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ప్రాజెక్ట్ అధికారులు పలుమార్లు గిరిజన సంక్షేమశాఖ కమిషనర్, కార్యదర్శి దృష్టికి తీసుకువెళ్లినా ప్రయోజనం లేకపోయింది. దాదాపు రెండు సంవత్సరాల తాత్సారం తరువాత, గిరిజన సంక్షేమ కార్యదర్శి ఈ విషయంపై గ్రామ సచివాలయ కార్యదర్శికి గత నెలలో లేఖ రాశారు.


క్లుప్తంగా చెప్పాలంటే హేతుబద్ధత లేని నియామకాలు, పని భారం, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, సంక్షేమ పథకాలు అందని వారి సమస్యలను పరిష్కరించటంలో గిరిజన సంక్షేమ శాఖ ఉదాసీనత... ఇవన్నీ కలిసి అక్కడి వలంటీర్ల వ్యవస్థను అచేతన స్థితిలోకి నెడుతున్నాయి. ఈ పరిస్థితులలో వలంటీరు వ్యవస్థను హేతుబద్ధీకరించడం, ప్రతి గ్రామానికీ కనీసం ఒక్క వలంటీరు ప్రత్యేకంగా ఉండేటట్లు చూడడం, ఒక్కో వలంటీరుకు 30 కుటుంబాలు మించకుండా ఉండేలా చూడడం, గౌరవ వేతనం 10 వేలకు పెంచడం రాష్ట్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.

చక్రధర్ బుద్ధ

వంతల భాస్కర్

వెంకట కృష్ణ కగ్గా


Updated Date - 2021-11-27T07:55:02+05:30 IST