నన్‌పై అత్యాచారం కేసులో కేరళ బిషప్ ములక్కల్‌కు బెయిలు మంజూరు

ABN , First Publish Date - 2020-08-08T00:13:30+05:30 IST

కేరళ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు ట్రయల్ కోర్టు

నన్‌పై అత్యాచారం కేసులో కేరళ బిషప్ ములక్కల్‌కు బెయిలు మంజూరు

కొట్టాయం : కేరళ నన్‌పై అత్యాచారం కేసులో నిందితుడు బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. విచారణ తేదీల్లో కోర్టుకు హాజరుకావాలని షరతు విధించింది. పూచీకత్తులను, జామీనులను కొత్తగా సమర్పించాలని ఆదేశించింది. 


బిషప్ ములక్కల్‌కు గతంలో మంజూరైన బెయిలును జూలై 13న రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయన విచారణకు హాజరుకాకపోవడంతో అడిషినల్ సెషన్స్ కోర్టు ఆయన బెయిలు రద్దు చేసి, నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ములక్కల్ శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. 


ఆగస్టు 13న ఆరోపణలను చదివి వినిపించే వరకు రాష్ట్రం విడిచి వెళ్ళరాదని ములక్కల్‌ను కోర్టు ఆదేశించింది. కేసు విచారణ తేదీల్లో కోర్టుకు హాజరు కావాలని తెలిపింది. పూచీకత్తులను, జామీనులను కొత్తగా సమర్పించాలని ఆదేశించింది. 


ములక్కల్ కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణాలను ఆయన తరపు న్యాయవాది జూలై 13న కోర్టుకు తెలిపారు. కోవిడ్-19 వ్యాధిగ్రస్థుడితో కలిసి తన క్లయింటు సంచరించారని, అందువల్ల సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్నారని చెప్పారు. ఆ మర్నాడే ములక్కల్‌కు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయింది. 


ఇదిలావుండగా, తనను ఈ కేసు నుంచి విముక్తి చేయాలని ములక్కల్ చేసిన వినతిని సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొనాలని స్పష్టం చేసింది. 


బాధితురాలు 2018 జూన్‌లో ములక్కల్‌పై ఫిర్యాదు చేశారు. తనపై ములక్కల్ 2014 నుంచి 2016 మధ్యలో లైంగిక దాడి చేశారని ఆరోపించారు. కొట్టాయం పోలీసులు ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. 


ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు జరిపింది. నేరపూరిత బెదిరింపులు, అక్రమ నిర్బంధం, అత్యాచారం, అసహజ లైంగిక చర్యలకు ములక్కల్ పాల్పడినట్లు అభియోగ పత్రం దాఖలు చేసింది.


Updated Date - 2020-08-08T00:13:30+05:30 IST