Abn logo
May 2 2021 @ 12:40PM

మమత పార్టీకి 200కు పైగా సీట్లు.. ఫలితాలపై బీజేపీ తాజా కామెంట్స్ ఇవీ..!

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమత బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పూర్తి ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం మొత్తం 292 స్థానాలకు గాను టీఎంసీ 200కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 147 మేజిక్ ఫిగర్‌ను టీఎంసీ అలవోకగా దాటేసి భారీ మెజారిటీగా దిశగా దూసుకెళ్తోంది. డబుల్ సెంచరీ మార్క్‌ను కూడా అందుకుంది. భారీ మెజారిటీతో గెలిచి దీదీ వరుసగా మూడోసారి బెంగాల్ సీఎం కావడం దాదాపు ఖాయమైంది. ఇదిలాఉంటే.. ఈ ఆధిక్యం ఫలితాలపై బీజేపీ ఎంపీ దీలిప్ ఘోష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లీడింగ్ స్థానాలను బట్టి విజయాన్ని నిర్ణయించలేమన్నారు. ఇప్పటికీ బీజేపీ పోటీలోనే ఉందన్నారు. పూర్తి ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందేనని తెలిపారు. తాము అంత సులువుగా టీఎంసీకి లోంగబోమని దీలిప్ తేల్చి చెప్పారు. ఆశ వదులుకోబోమని చివరకు పుంజుకుని టీఎంసీని వెనక్కి నెట్టి బీజేపీ విజయం సాధించడం ఖాయం అన్నారు. అయితే, ఒకవైపు టీఎంసీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి విజయం దిశగా దూసుకెళ్తుంటే.. మరోవైపు దీదీ మాత్రం తాను పోటీ చేసిన నందిగ్రామ్ నియోజకవర్గంలో వెనుకంజలో ఉండడంలో గమనార్హం. ఇక్కడ ప్రస్తుతం మమత కంటే ఆమె ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి 3,775 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు.   

Advertisement