ఉద్యోగుల్లో వణుకు

ABN , First Publish Date - 2022-01-22T05:24:12+05:30 IST

జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో మళ్లీ కొవిడ్‌ దడ మొదలైంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు.

ఉద్యోగుల్లో వణుకు
ఒంగోలులోని తహసీల్దార్‌ కార్యాలయంలోకి బయటి వ్యక్తులు వెళ్లకుండా కట్టిన తాళ్లు

ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో భారీగా కరోనా కేసులు

హౌసింగ్‌ జేసీ, జడ్పీ సీఈవోతో సహా 

పలువురికి పాజిటివ్‌

ఐదుగురు తహసీల్దార్లు, ఒక డీటీకి కూడా వైరస్‌

కొన్ని కార్యాలయాల్లో సిబ్బంది కూడా అదే పరిస్థితి

పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకూ కొవిడ్‌

కొవిడ్‌ కేసులు జిల్లాను చుట్టేస్తున్నాయి. ప్రధానంగా ప్రజానీకంతో ఎక్కువగా సంబంధాలు ఉండే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో ఇటీవల పాజిటివ్‌లు పెరుగుతున్నాయి. పెద్దసంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మహమ్మారి బారిన పడుతున్నారు. ఇందులో కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగులు అధికంగా కనిపిస్తున్నారు. జిల్లాస్థాయి అధికారులలో హౌసింగ్‌ జేసీ విశ్వనాథ్‌, జడ్పీ సీఈవో జాలిరెడ్డితోపాటు చీమకుర్తి, మార్టూరు, టంగుటూరు, ఎన్‌జీపాడు, కారంచేడు తహసీల్దార్లు కరోనా బారినపడ్డారు. అలాగే మరో డజను మందికిపైగా రెవెన్యూ ఉద్యోగులు, 30మంది వరకు డాక్టర్లు, ఇతర వైద్యారోగ్యశాఖ సిబ్బందికి కొవిడ్‌ సోకింది. ఇక జడ్పీ కార్యాలయంలో ముగ్గురితోపాటు వివిధ మండల పరిషత్‌ కార్యాలయాల్లోని 20మందికిపైగా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. 

ఒంగోలు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఉద్యోగ వర్గాల్లో మళ్లీ కొవిడ్‌ దడ మొదలైంది. ఇప్పటికే పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. పలు ప్రాంతాల్లోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో పనిచేసే వారికి పాజిటివ్‌లు వస్తుండటంతో సహచర సిబ్బంది, పైస్థాయి అధికారులతోపాటు అక్కడికి పనుల కోసం వచ్చే  ప్రజల్లో అలజడి నెలకొంది. ఇప్పటివరకు కరోనా సోకిన ఉద్యోగుల వివరాలు పరిశీలిస్తే రెవెన్యూ, పంచాయతీరాజ్‌, మెడికల్‌శాఖలతోపాటు పాఠశాలల్లో ఉపాధ్యాయులు అధికంగా ఉన్నారు. కొవిడ్‌ మూడో వేవ్‌ తీవ్రత జిల్లాలో వారంరోజుల నుంచి అధికమైంది. ఈనెల 15న 190 పాజిటివ్‌లు రాగా, 16వతేదీన 178, 17న 176, 18న 424, 19న 716, 20వతేదీన 853 కేసులు నమోదయ్యాయి. శుక్రవారం మరో 772 పాజిటివ్‌లు వచ్చాయి.  వాటిలో అత్యధికంగా ఒంగోలు నగరంలో ఉండగా.. ప్రధాన పట్టణాలైన కందుకూరు చీరాల, అద్దంకి, మార్కాపురం, కనిగిరి, చీమకుర్తితోపాటు పలు మండలాల్లోనూ తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది.


పాఠశాలల్లో కరోనా కల్లోలం

జిల్లాలోని వివిధ ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే 54మంది ఉపాధ్యాయులు, 18 మంది విద్యార్థులు, మరో నలుగురు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఇక పలు జిల్లా, మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉద్యోగులకు కరోనా సోకుతుం డటంతో మొత్తం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కార్యాలయాల్లోకి సాధారణ ప్రజలు నేరుగా రాకుండా వివిధ రూపాల్లో కట్టడి చర్యలు చేపడుతున్నారు. ఉపాధ్యాయులకు కరోనా సోకిన చోట విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అయితే ఎక్కువ మందికి లక్షణాలు పెద్దగా లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. కాగా ప్రస్తుత పరిస్థితులు చూస్తే మరింతగా కార్యాలయాలు, పాఠశాలల్లో కేసులు పెరుగుతాయన్న ఆందోళన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. 


బడుల్లో ఒక్కరోజే 71మందికి కొవిడ్‌  

ఒంగోలు విద్య : బడులను కరోనా కమ్మేస్తోంది. జిల్లాలో సంక్రాంతి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. గత ఐదురోజుల్లో 147మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. సోమవారం నుంచి గురువారం వరకు నాలుగు రోజుల్లో 76మందికి కరోనా సోకింది. శుక్రవారం ఒక్కరోజే 71 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత నాలుగు రోజుల్లో 54మంది ఉపాధ్యాయులకు వైరస్‌ సోకగా, శుక్రవారం ఒక్కరోజే 51మంది కరోనా బారిన పడ్డారు. గత నాలుగు రోజుల్లో 18మంది విద్యార్థులకు రాగా, శుక్రవారం ఒక్కరోజే 18మందికి పాజిటివ్‌ నిర్ధారణైంది. అదేవిధంగా పాఠశాలలోని బోధనేతర సిబ్బంది గత నాలుగు రోజుల్లో నలుగురికి నిర్ధారణ కాగా శుక్రవారం ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. జిల్లాలో శుక్రవారం ఒక్కరోజే 772 కేసులు వస్తే వీరిలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, బోధనేతర సిబ్బంది  10 శాతం కావడం గమనార్హం. పాఠశాలల్లో కేసులు పెరుగుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని పలువురు కోరుతున్నారు. తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురవుతున్నారు. 


రెవెన్యూలో  కలకలం

ఒంగోలు (కలెక్టరేట్‌) : జిల్లాలో రెవెన్యూ ఉద్యోగుల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఐదుగురు తహసీల్దార్లు, ఒక డీటీతోపాటు మరికొంతమంది సిబ్బంది కొవిడ్‌ బారిన పడటంతో రెవెన్యూ ఉద్యోగులతోపాటు ఉన్నత స్థాయి అధికారుల్లో కూడా ఆందోళన నెలకొంది. ఆయా తహసీల్దార్లతోపాటు రెవెన్యూ సిబ్బంది నిరంతరం సమీక్షా సమావేశాల్లో పాల్గొంటున్నారు. గడిచిన రెండురోజుల్లోనే జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలో జరిగిన పలు సమీక్షా సమావేశాలకు తహసీల్దార్లు హాజరయ్యారు. ఇంకోవైపు మండల స్థాయి అధికారులు, సిబ్బందితో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లలో కూడా పాల్గొన్నారు. దీంతో ఇతర అధికారులు, సిబ్బంది వణికిపోతున్నారు. కాగా పాజిటివ్‌ వచ్చిన తహసీల్దార్ల కుటుంబ సభ్యులు కూడా కరోనా బారిన పడినట్లు సమాచారం. 


772 కొవిడ్‌ పాజిటివ్‌లు

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 21 : జిల్లాలో శుక్రవారం కొత్తగా 772 కొవిడ్‌ పాజిటివ్‌లు నమోదయ్యాయి. వాటిలో అత్యధికంగా ఒంగోలులో 277 ఉన్నాయి. కందుకూరులో 100, చీరాలలో 44, కనిగిరిలో 42, పామూరులో 28, దర్శిలో 20, పీసీపల్లిలో 18, చీమకుర్తిలో 15, పర్చూరులో 15 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఉలవపాడులో 14, ఎన్‌జీపాడులో 13, పొన్నలూరులో 13, వీవీపాలెంలో 13, కొత్తపట్నంలో 12, వేటపాలెంలో 12, కంభంలో 10  మందికి వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వీటితోపాటు పలు ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు 1,42,647మంది వైరస్‌ బారిన పడ్డారు. వారిలో 1,37,877 మంది కోలుకున్నారు. 1,131 మంది మృతిచెందారు. ప్రస్తుతం 3,639 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 


Updated Date - 2022-01-22T05:24:12+05:30 IST