వణికిస్తున్న జ్వరాలు!

ABN , First Publish Date - 2022-07-03T06:30:45+05:30 IST

ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

వణికిస్తున్న జ్వరాలు!
కోటవురట్ల సీహెచ్‌సీలో రోగులతో నిండిన మంచాలు

వర్షాలు కురుస్తుండడంతో పీడిస్తున్న అనారోగ్య సమస్యలు

పలు గ్రామస్థులు జ్వరం, వాంతులు, విరేచనాలతో ఆస్పత్రులకు పరుగు

కోటవురట్ల సీహెచ్‌సీకి పెరుగుతున్న రోగుల తాకిడి


కోటవురట్ల, జూలై 2 : ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఆస్పత్రులకు రోగుల తాకిడి పెరుగుతోంది. కోటవురట్లలోని వైద్య విధానపరిషత్‌ ఆస్పత్రికి ఔట్‌ పేషెంట్లు రోజుకి వందల సంఖ్యలో వస్తుండడమే ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇన్‌పేషెంట్లు స్త్రీ, పురుష వార్డుల్లో రోజుకి 30 నుంచి 50 వరకు ఉంటున్నారు. బుధవారం ఔట్‌ పేషెంట్లు 267 మంది, గురువారం 271 మంది, శుక్రవారం 276 మంది వచ్చారంటే అనారోగ్య సమస్యలు ఏవిధంగా పీడిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.మండలంలోని రామచంద్రపురం, రాజుపేట, లింగాపురం గ్రామాలనుంచి జ్వరం, వాంతులు, విరేచనాలతో చాలామంది వస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు కొత్తనీరు చేరుతుండడంతో జ్వరాలు విజృంభిస్తున్నాయని అంటున్నారు. గతనాలుగు రోజులనుంచి ఆస్పత్రికి వీరి తాకిడే అధికంగా ఉంటోంది. ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మంచాలు లేకపోవడంతో సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రోగులు గత్యంతరం లేక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆ స్థోమత లేనివారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇచ్చిన మందులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇదిలావుంటే, ఒకేసారి రోగుల తాకిడి పెరగడంతో వైద్య సిబ్బంది కూడా సేవలు అందించేందుకు అవస్థలు పడుతున్నారు.  

Updated Date - 2022-07-03T06:30:45+05:30 IST