వణికిస్తున్న వ్యాధులు

ABN , First Publish Date - 2022-08-09T06:00:42+05:30 IST

జిల్లాను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడి అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అవుతుండటంతో చికిత్స పొందుతున్నారు. ఇవే కాకుండా కరోనా కేసులు కూడా సీజనల్‌ వ్యాధులతో పాటే పెరుగు తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలో కూడా కేసులు బయట పడుతున్నాయి. జిల్లాలో వర్షాలు బాగా ఉండటంతో ఎక్కుమంది సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. చలి జ్వరం, టైఫాయిడ్‌, వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు.

వణికిస్తున్న వ్యాధులు

జిల్లాపై చలిజ్వరం, టైఫాయిడ్‌, డెంగ్యూ పంజా

జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రుల్లో పెరుగుతున్న ఓపీలు

రోజు రోజుకూ విజృంభిస్తున్న కరోనా

కొవిడ్‌ నిబంధనలు పాటించాలంటున్న అధికారులు

నిజామాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు జ్వరాల బారిన పడి అనేక మంది ప్రభుత్వ, ప్రైవేటు అసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్‌, రక్త పరీక్షల్లో వ్యాధులు నిర్ధారణ అవుతుండటంతో చికిత్స పొందుతున్నారు. ఇవే కాకుండా కరోనా కేసులు కూడా సీజనల్‌ వ్యాధులతో పాటే పెరుగు తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలో కూడా కేసులు బయట పడుతున్నాయి. జిల్లాలో వర్షాలు బాగా ఉండటంతో ఎక్కుమంది సీజనల్‌ వ్యాధుల బారిన పడుతున్నారు. చలి జ్వరం, టైఫాయిడ్‌, వైరల్‌ ఫీవర్లు ఎక్కువగా వస్తుండటంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పది వేలకు పైగా రక్త పరీక్షలు నిర్వహించగా రెండు వేల మందికి పైగా జ్వర లక్షణాలతో బాధపడుతున్నారని గుర్తించారు. ఈ పరీక్షల్లో డెంగ్యూ కేసులు 40 వరకు నిర్ధారణ అయ్యాయి.

ప్రైవేటు అసుపత్రుల్లో..

జ్వరాలతో ఇబ్బందులు పడుతున్న కొందరు ప్రైవేటు అసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే వివిధ పరీక్షల నిమిత్తం ఆస్పత్రుల యజమానులు వీరికి వేలకు వేలకు బిల్లులు వేస్తున్నారు. ప్రభుత్వ అసుపత్రుల్లో అన్ని రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నా స్థానిక గ్రామీణ వైద్యుల సూచనల మేరకు ప్రైవేటులో చేరుతున్నారు. అయితే సాధారణ జ్వరాలకు కూడా డెంగ్యూ, ఇతర వ్యాధుల పేరు చెప్పి అందినకాడికి దండుకుంటున్నారు. వేల రూపాయల్లో బిల్లులు వసూలు చేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో పాటు కరోనా కేసుల సంఖ్య కూడా పెరుగుతున్నాయి. జిల్లాలో వైద్య అరోగ్యశాఖ నిర్వహిస్తున్న జ్వర సర్వేలో కేసులు బయట పడుతున్నాయి. ప్రతి రోజూ జిల్లాలో 30 నుంచి 40 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అయితే కొవిడ్‌ నిబంధనలు పాటించకపోవడం వల్ల కేసులు పెరుగుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ జనరల్‌ అసుపత్రిలో కరోనా పాజిటివ్‌ వచ్చి సీరియస్‌గా ఉన్న 15 మంది  చికిత్స పొందుతున్నారు.

చికిత్సకు ఏర్పాట్లు..

 జిల్లాలో సీజనల్‌ వ్యాధులు బాగా పెరిగాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుదర్శనం తెలిపారు. అన్ని పీహెచ్‌సీల పరిధిలలో చికిత్స కోసం ఏర్పాట్లు చేశామన్నారు. ఇంటింటి జ్వర సర్వేలో లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వారికి తగిన చికిత్స అందిస్తున్నామన్నారు. వారికి అవసరమైన మందులను కూడా ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో కరోనా నిబంధనలు పాటించక పోవడం వల్ల కేసులు పెరుగుతున్నాయన్నారు.

పెరిగిన ఓపీ కేసుల సంఖ్య..

జిల్లా ప్రభుత్వ జనరల్‌ అసుపత్రికి వచ్చే ఓపీ కేసుల సంఖ్య పెరిగిందని సూపరింటెండెంట్‌ డాక్టరు ప్రతిమరాజ్‌ తెలిపారు. సీజనల్‌ వ్యాధులు పెరగడం వల్ల ఎక్కువ మంది రోగులు వస్తున్నారని వారందరికీ చికిత్స అందిస్తున్నామన్నారు. సీరియస్‌గా ఉన్న వారిని అసుపత్రిలో చేర్చుకుని వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

Updated Date - 2022-08-09T06:00:42+05:30 IST