వణికిస్తున్న వ్యాధులు

ABN , First Publish Date - 2022-08-09T05:42:25+05:30 IST

జిల్లావాసులను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా జ్వరాలు విజృంభిస్తున్నాయి.

వణికిస్తున్న వ్యాధులు
జిల్లా కేంద్రాసుపత్రిలో మలేరియా, వైరల్‌ జ్వరాలకు చికిత్స పొందుతున్న రోగులు

  పల్లెల్లో పారిశుధ్య లోపం

  అంతటా జ్వరపీడితులు 

  రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు

  ఆసుపత్రులు కిటకిట

(కొమరాడ)

జిల్లావాసులను సీజనల్‌ వ్యాధులు వణికిస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అంతటా జ్వరాలు విజృంభిస్తున్నాయి. గత రెండేళ్లలో కంటే ప్రస్తుత సీజన్‌లో  రోగుల సంఖ్య అధికంగానే ఉంది. అయితే ఆరోగ్యశాఖ లెక్కలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి.  ఆ శాఖ లెక్కల కంటే రెండింతలు గ్రామాల్లో జ్వర పీడితులు ఉన్నారు. ప్రస్తుతం వానలు జోరందకున్నాయి. వాటితో పాటే దోమలు ఉధృతి పెరిగింది. దీంతో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్‌, వైరల్‌ జ్వరాలతో పాటు అక్కడక్కడ డయేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. 

 జిల్లాలో 37 పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు 5, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రులు తొమ్మిది, వైద్యులు 62 మంది, సచివాలయాల ఏఎన్‌ఎంలు 350 మంది ఉన్నారు. ఎంఎల్‌హెచ్‌పీలు 256 మంది, ఆశాలు 1566 మంది ఉన్నారు. కాగా జిల్లాలో రోజూ 600 నుంచి 800 వరకూ ప్రభుత్వ ఆసుపత్రులకు జ్వర పీడితులు వెళ్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాకేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి కూడా  రోజుకు 500 పైబడి జ్వరబాధితులు వస్తున్నారు. అయితే ఇందులో వైరల్‌ జ్వరాలతో బాధపడేవారు ఎక్కువగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. అధికారులు చూపుతున్న మలేరియా, డెంగ్యూ కేసులకు మూడింతల మంది ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.  అయితే కొండశిఖర గ్రామాలకు మాత్రం వైద్యసేవలు అందడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు ఆర్‌ఎంపీ, పీఎంపీల దగ్గరే చికిత్స చేయించుకుంటున్నారు. మొత్తంగా గిరిజన, మైదాన ప్రాంతవాసులు వ్యాధులతో సతమతవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. 

పారిశుధ్య లోపమే కారణమా..?

పంచాయతీలకు నిధుల కొరత వేధిస్తుండడంతో గ్రామ సర్పంచ్‌లు పారిశుధ్య పనులు చేపట్టడానికి వెనుకాడుతున్నారు. దీంతో జిల్లాలోని అత్యధిక పల్లెల్లో పారిశుధ్యం లోపించింది.  మురుగు పోయేందుకు సరైన కాలువలు లేకపోవడం, ఖాళీ స్థలాల్లో చెత్తా చెదారం పేరుకుపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కారణంగానే జ్వరాలు అధికంగా నమోదవుతున్నట్లు గ్రామస్థులు వాపోతున్నారు.  ఇప్పటికైనా పారిశుధ్య పనులకు ప్రత్యేక నిధులు కేటాయించి, వైద్య ఆరోగ్యశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్‌ సమన్వయంతో పనిచేసి వ్యాధులు వ్యాప్తి చెందకుండా చూడాలని జిల్లావాసులు కోరుతున్నారు.  

 సిబ్బందిని అప్రమత్తం చేశాం

 సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే పీహెచ్‌సీల వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశాం. గ్రామాల్లో ఇంటింటి సర్వే కూడా చేపడుతున్నాం. అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయి.

  • - డాక్టర్‌ బి.జగన్నాథరావు, డీఎంహెచ్‌వో

 

Updated Date - 2022-08-09T05:42:25+05:30 IST