వృక్ష విలాపం

ABN , First Publish Date - 2022-08-17T06:42:32+05:30 IST

పచ్చని లోగిలిలా వుండే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది.

వృక్ష విలాపం
ఏయూలో భారీ వృక్షాలు తొలగించిన దృశ్యం

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పచ్చదనంపై వేటు

ఆవరణలో దశాబ్దాలుగా ఉన్న చెట్ల నరికివేత


ఏయూ క్యాంపస్‌, ఆగస్టు 13:

పచ్చని లోగిలిలా వుండే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆవరణలో చెట్ల నరికివేత యథేచ్ఛగా కొనసాగుతోంది. భారీచెట్లను కూడా తొలగిస్తున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన ఈ కార్యక్రమం తాజాగా ఆర్ట్స్‌ కళాశాల, వీఎస్‌ కృష్ణా లైబ్రరీ, మేథమెటిక్స్‌ విభాగాల వరకు విస్తరించింది. నాలుగు రోజుల నుంచి చెట్ల నరికివేత అధికారుల పర్యవేక్షణలోనే సాగుతోంది. దాదాపు పది నుంచి పదిహేనేళ్ల వయసు చెట్లను కూడా తొలగిస్తున్నారు. చెట్ల తొలగింపునకు ఎటువంటి అనుమతులు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే త్వరలో వర్సిటీ ఆవరణలో పచ్చదనం కనుమరుగవ్వడం ఖాయమని పర్యావరణ ప్రియులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలలో చెట్ల విధ్వంసంపై రాష్ట్ర గవర్నర్‌ స్పందించి వర్సిటీ అధికారులను నివేదిక కోరినా ఫలితం శూన్యం. చెట్లు, తుప్పల కారణంగా పరిసరాల్లోని భవనాల్లోకి పాములు, విషకీటకాలు వస్తున్నాయంటూ నరికివేతను అధికారులు సమర్థించుకుంటున్నారు. నిజంగా అటువంటి పరిస్థితి వుంటే కొమ్మలను ట్రిమ్మింగ్‌ చేస్తే సరిపోతుంది కదా అని పర్యావరణ హితులు సూచిస్తున్నారు. ఈ విషయమై వర్సిటీ శానిటరీ, బ్యూటిఫికేషన్‌ డీన్‌ ప్రొఫెసర్‌ పాల్‌ మాట్లాడుతూ క్యాంపస్‌లోని లైబ్రరీ నుంచి మేథమేటిక్స్‌ విభాగం వరకు వున్న చెట్లను మాత్రమే తొలగించామని చెప్పారు. ఆ ప్రాంతాల్లోని భవనాల్లోకి పాములు వస్తున్నాయని, చెట్ల కింద పుట్టలు పెరిగిపోయి విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని, అందుకే తొలగిస్తున్నామని వివరణ ఇచ్చారు. 


ఇప్పుడే ఎందుకు సమస్య..?

ఏళ్ల తరబడి వున్న చెట్లను ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నారన్న ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. వర్సిటీలో ఒక ప్రణాళిక ప్రకారం చెట్ల తొలగింపు ప్రక్రియ సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పచ్చదనంతో కళకళలాడే విశ్వవిద్యాలయాన్ని ఏం చేయాలని భావిస్తున్నారో తెలియడం లేదంటూ పలువురు అధ్యాపకులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. దీనిపై వర్సిటీ ఉన్నతాధికారులు పునరాలోచన చేయాలని పలువురు విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు.  


కలపను ఏం చేస్తున్నారు..?

ఇకపోతే, నరికివేస్తున్న చెట్లకు సంబంధించిన కలపను వర్సిటీకి చెందిన అధికారి విక్రయించుకుంటున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకోసం ఓ కలప వ్యాపారితో ఒప్పందం చేసుకున్నట్టు చెబుతున్నారు. తొలగించిన చెట్ల కలపను రహస్యంగా వ్యాపారులకు విక్రయించి భారీగానే ఆదాయాన్ని సముపార్జిస్తున్నట్టు చెబుతున్నారు.  

Updated Date - 2022-08-17T06:42:32+05:30 IST