చెట్టు పేరు చెప్పి.. ‘దండేశారు’

ABN , First Publish Date - 2021-11-27T06:48:49+05:30 IST

కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయం వందేళ్ల నాటిది. దీని అరుదైన కట్టడంగా సంరక్షించాల్సిన అధికారులు పాతదైపోయిందనే సాకుతో కూలగొట్టించేశారు. దీనిస్థానంలో కొత్తది నిర్మించడానికి నిర్ణయించారు.

చెట్టు పేరు చెప్పి.. ‘దండేశారు’
కార్పొరేషన్‌లో చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌ పనులు (ఫైల్‌ ఫొటో)

  • కాకినాడ కార్పొరేషన్‌లో అధికారుల ‘ట్రాన్స్‌లోకేషన్‌’ లీలలు 
  • 30 ఏళ్లు దాటిన భారీ వృక్షాలను వేరేచోట నాటేందుకు రూ.16 లక్షల వ్యయం
  • బాలాజీ నర్సరీకి పనుల అప్పగింత
  • తీరా నాటిన చెట్లన్నీ సంరక్షణ లేక పూర్తిగా మోడుగా మిగిలిన వైనం
  • డబ్బు మిగుల్చుకునేందుకు భారీ వృక్షాల బదులు చిన్న చెట్లు సైతం తరలించిన కాంట్రాక్టర్‌
  • కమీషన్ల కక్కుర్తితో పట్టించుకోని అధికారులు 

అవి కాకినాడ కార్పొరేషన్‌లో 30 ఏళ్ల నాటి భారీ వృక్షాలు.. ఇప్పుడున్న కార్పొరేషన్‌ పాత భవనం పడగొట్టి దాని స్థానంలో కొత్తది నిర్మించాలని అధికారులు నిర్ణయించగా, ఈ మహా వృక్షాలు అడ్డుతగిలాయి. దీంతో తొలుత నరికేయడం తప్పదని భావించారు. అంత పెద్ద భారీ వృక్షాలను నేలమట్టం చేయడం కంటే వాటిని పెకలించి వేరేచోట తీసుకువెళ్లి నాటే ట్రాన్స్‌లొకేషన్‌ విధానాన్ని ఎంచుకున్నారు. అనుకున్నదే తడవుగా 49 వృక్షాలను తొలగించి వేరేచోటకు తరలించే కాంట్రాక్టును బాలాజీ నర్సరీ అనే సంస్థకు అప్పగించారు. తీరా అక్కడ శ్రద్ధగా వీటిని నాటి సంరక్షించాల్సిన కాంట్రాక్టర్‌ అదేదీ పట్టించుకోలేదు. కమీషన్ల కక్కుర్తితో అధికారులు ఆ పనుల పర్యవేక్షణ గాలికొదిలేశారు. దీంతో ఇప్పుడు ఆ చెట్లన్నీ మోడుబారిపోయాయి. 

 (కాకినాడ-ఆంధ్రజ్యోతి)

కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయం వందేళ్ల నాటిది. దీని అరుదైన కట్టడంగా సంరక్షించాల్సిన అధికారులు పాతదైపోయిందనే సాకుతో కూలగొట్టించేశారు. దీనిస్థానంలో కొత్తది నిర్మించడానికి నిర్ణయించారు. ఈ క్రమంలో కార్పొరేషన్‌ ఆవరణలోని 30 ఏళ్లు పైబడ్డ భారీ వృక్షాలు అడ్డుతగులుతున్నాయనే కారణంతో నరికేయాలని నిర్ణయించారు. అయి తే ఇంత పెద్ద వృక్షాలు నేలకూల్చితే విమర్శలు వస్తాయనే ఉద్దేశంతో అధికారులు ట్రాన్స్‌లొకేషన్‌ విధానాన్ని ఆశ్రయించారు. దీని ప్రకారం చెట్లను పెకలించి వేరేచోటకు తరలించి నాటుతారు. ఈ పనులు చేసే కంపెనీని అన్వేషించిన అధికారులు బాలాజీ నర్సరీ అనే సంస్థకు పని కట్టబెట్టారు. పనిచేయడానికి ముందే రూ.8 లక్షల వరకు అడ్వాన్స్‌లు చెల్లించారు. దీంతో 49 భారీ వృక్షాలను కాపాడుతున్నట్టు అధికారులు ప్రచారం చేసుకున్నారు. సదరు బాలాజీ సంస్థ ఈ ఏడాది మే 15న వృక్షాలను పెకలించి వాకలపూడిలోని అక్షర స్కూలుకు వెళ్లే దారిలో ఇరువైపులా తిరిగి నాటారు. నిజానికి వీటిని తిరిగి నాటే సమయంలో అక్కడ మట్టి నాణ్యత పరీక్షించాలి. అదేదీ చేయకుండానే నాటేశారు. ఇలా నాటిన చెట్లను కొన్ని నెలలపాటు సంరక్షించాలని నిబంధన ఉంది. కానీ కాంట్రాక్టర్‌ ఇదేదీ పట్టించుకోలేదు. నాటిన చెట్లను వారం తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశాడు. దీంతో ఇప్పుడవన్నీ మోడుబారిపోయాయి. ఇప్పుడు అటువైపు వెళ్లే వారికి పూర్తిగా ఎండి పోయి దర్శనమిస్తున్నాయి. దీంతో అధికారుల ట్రాన్స్‌లొకేషన్‌ విధానం నవ్వులపాలైంది. వాస్తవానికి ట్రాన్స్‌లొకేషన్‌ తర్వాత ఎప్పటికప్పుడు చెట్ల గురించి పర్యవేక్షించాలి. బతికాయో లేదో చూడాలి. ఒకవేళ ఫలి తం రాకపోతే బిల్లులు చెల్లించకూడదు. కానీ అధికారులు ఇదేదీ చేయలేదు. కాంట్రాక్టర్‌ నుంచి కమీషన్లు ముట్టడంతో వీటి సంగతే మర్చిపోయారు. మరోపక్క భారీ వృక్షాలను ట్రాన్స్‌లొకేషన్‌ చేయడానికి రూ.16 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. కానీ ఆ కాంట్రాక్టర్‌ భారీ వృక్షాల్లో కేవలం కొన్నింటినే ట్రాన్స్‌లొకేషన్‌ చేసి మిగిలినవి చిన్న చెట్లనే తరలించారు. ఇలా భారీగా డబ్బులు మిగుల్చుకున్నారు. తెలియకుండానే పెద్దచెట్లను నరికి తరలించుకుపోయారు. ఇంతజరిగినా అధి కారులు తమకేం తెలియనట్టే వ్యవహరిస్తున్నారు. చెట్లను తరలించే పేరుతో రూ.16 లక్షలు తలా కొంత పంచేసుకున్న తీరు ఇప్పుడు మోడుబారిన చెట్లు సాక్ష్యంగా మిగిలాయి. వాస్తవానికి చెట్లను ట్రాన్స్‌లొకేషన్‌ చేస్తే 90 శాతం బతుకుతాయి. గతంలో తిరుపతి, విశాఖలో ఈ తరహా ప్రయత్నాలు సత్ఫలితాలిచ్చాయి. కానీ కాకినాడలో మాత్రం చెట్లను కాపాడే కంటే ఆ ముసుగులో కాసులు దండుడే కనిపించింది.

Updated Date - 2021-11-27T06:48:49+05:30 IST