నృత్యం చేస్తున్న చిన్నారులు
రికార్డు నృత్య ప్రదర్శన
అబ్బురపరిచిన చిన్నారుల ప్రతిభ
మార్కాపురం, మే 22: పట్టణంలోని స్నేహ సంగీత, నాట్య అకాడమీ విద్యార్థుల నృత్య ప్రదర్శనను హర్యాణాకు చెందిన వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డు సంస్థ గుర్తించింది. స్థానిక టీడీపీ కళ్యాణ మండపంలో ఆదివారం స్నేహ సంగీత నాట్య అకాడమీ ఆధ్వర్యంలో మార్కాపురం, కనిగిరి, దర్శి, గిద్దలూరు, వినుకొండ ప్రాంతాలకు చెందిన 300 మంది విద్యార్ధులు భరతనాట్యం ప్రదర్శించారు. 50 మంది చిన్నారులతో జానపదం, 30 మంది చిన్నారులతో గాత్రం నిర్వహించారు. అనంతరం నాట్య కళాకారులకు బహుమతులు అందజేశారు. వీరితోపాటు జర్మనీ, అమెరికాల్లోను ఆకాడమీ విద్యార్ధులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనను జూమ్ యాప్ ద్వారా తిలకించిన సంస్థ ప్రతినిధులు వారిని వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డుగా గుర్తించారు. కళాకారులకు పట్టణ, పురపాలక శాఖ మంత్రి ప్రశంసాపత్రాలు అందజేశారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ మార్కాపురం కళాకారులకు నిలయమన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంతమైన మార్కాపురంలో విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను, ప్రతిభా పాటవాలను వెలికి తీయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రాంతంలో నాట్య కళాకారులకు ఏమాత్రం కొదవలేదన్నారు. భరతనాట్యంతోపాటు జనపద గేయాలు, కర్రసాము, కరాటే ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జగదీశ్వరి, మున్సిపల్ చైర్మన్ బాలమురళీకృష్ణ, సంగీత నాట్య అకాడమీ ప్రిన్సిపల్ ప్రతిమసునీల్, వైసీపీ రాష్ట్ర సహాయకార్యదర్శి షంషీర్అలీబేగ్, శ్రీశైలం దేవస్థాన సభ్యురాలు డా. కనకదుర్గ, కిట్స్ విద్యా సంస్థల కార్యదర్శి అన్నా కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.