కోలుకున్న రోగుల ప్లాస్మాతో చికిత్స?

ABN , First Publish Date - 2020-03-27T06:13:45+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మళ్లీ పురాతన చికిత్స విధానాల వైపే మొగ్గు చూపనున్నారా? గతంలో...

కోలుకున్న రోగుల ప్లాస్మాతో చికిత్స?

  • చైనా వైద్యుల యత్నం
  • ఎఫ్‌డీఏ అనుమతుల కోసం అమెరికా ఆస్పత్రుల ఎదురుచూపులు!

వాషింగ్టన్‌, మార్చి 26: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మళ్లీ పురాతన చికిత్స విధానాల వైపే మొగ్గు చూపనున్నారా? గతంలో ఫ్లూ, తట్టు వ్యాధులు విజృంభించిన సమయంలో వ్యాక్సిన్‌ కంటే ముందుగానే చికిత్స కనుగొన్నట్లుగా.. ఇటీవల సార్స్‌, ఎబోలాకు కూడా అలాగే చికిత్స చేసినట్లుగా.. ఇప్పుడు కొవిడ్‌-19కూ చేయనున్నారా? అంటే పరిశోధకులు అవుననే అంటున్నారు. కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారి రక్తాన్ని ఉపయోగించి చికిత్స చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘కాన్వలెసెంట్‌ సెరం’గా పేర్కొనే విధానం ద్వారా చైనా వైద్యులు కొవిడ్‌-19కు చికిత్స అందించే ప్రయత్నం చేశారు. 


కరోనా వైరస్‌ బారిన పడి కోలుకున్న వారు దానం చేసిన రక్తంలోని ప్లాస్మా(జీవద్రవ్యం) ద్వారా చికిత్స చేయడం అన్నమాట. ఈ విధానంపై భారీ స్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం అక్కడి ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే కరోనా బారిన పడినవారికి చికిత్స అందిచేందుకు, అత్యంత ముప్పు పొంచి ఉన్నవారికి టీకా లాంటి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు ఈ పద్ధతి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అయితే ఇది పనిచేస్తుందనడానికి భరోసా ఏమీ లేదు. 


‘ఇది చేసే వరకు మాకేమీ తెలియదు. కానీ, చారిత్రక ఆధారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి’ అని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ అర్టురో కేసడ్‌వాల్‌ తెలిపారు. వ్యాధి నయమైన వారి రక్తాన్ని ఉపయోగించే పద్ధతికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన డాక్టర్‌ జెఫ్రీ హెండర్సన్‌ పేర్కొన్నారు. ప్రత్యేక రోగ క్రిముల బారిన పడిన వ్యక్తి శరీరం.. వాటిపై పోరాడేందుకు ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాంటీబాడీలుగా పిలిచే ప్రొటీన్లను తయారు చేయడం ప్రారంభిస్తుంది. ఆ వ్యక్తి కోలుకున్న తర్వాత ఆ యాంటీబాడీలు అతని రక్తంలో ప్రవహిస్తూనే ఉంటాయి.


ముఖ్యంగా ప్లాస్మాలో కొన్ని నెలలు, సంవత్సరాల పాటు వరకు అలాగే ఉంటాయి. యాంటీబాడీలతో కూడిన ఈ ప్లాస్మాను కొత్తగా కరోనా బారిన పడిన రోగుల శరీరంలోకి ఎక్కిస్తే వైర్‌సను ఎదుర్కొనేందుకు అవసరమైన శక్తిని ఇస్తాయని వైద్యులు భావిస్తున్నారు. ఇది పనిచేస్తే.. రోగులు బతికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయా లేక శ్వాస యంత్రాల అవసరాన్ని తగ్గించగలుగుతాయా అన్న అంశాలను పరిశోధకులు నిర్ధారిస్తారు. అయితే ప్లాస్మాను ఎక్కించే విధానంలో అత్యంత అరుదుగా ఊపిరితిత్తులకు నష్టం కలిగే అవకాశం కూడా ఉండడం గమనార్హం.

Updated Date - 2020-03-27T06:13:45+05:30 IST