హోటళ్లలో వైద్యం.. ప్రాణాలతో చెలగాటం!

ABN , First Publish Date - 2020-08-10T09:43:36+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో హోటల్‌ క్వారంటైన్‌ ప్రతిపాదన

హోటళ్లలో వైద్యం.. ప్రాణాలతో చెలగాటం!

  • హోటల్‌ వైద్యం పేరిట భారీగా దోపిడీ
  • రోజుకు 35 వేల నుంచి 50 వేల ప్యాకేజీ
  • హోటల్స్‌లో ప్రమాదం జరిగితే తప్పించుకునే మార్గం ఉండదు
  • స్వర్ణప్యాలెస్‌ ప్రమాదానికి అదే కారణం
  • అగ్నికి ఆజ్యం పోసిన శానిటైజర్‌..?


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు ప్రమాదకర స్థాయిలో పెరుగుతుండడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో బెడ్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో హోటల్‌ క్వారంటైన్‌ ప్రతిపాదన తెరపైకొచ్చింది. అదుపు తప్పుతున్న పరిస్థితిని దృష్టిలోపెట్టుకుని ప్రభుత్వం కూడా వాటికి పచ్చజెండా ఊపింది. అనుమతులైతే ఇచ్చింది కానీ.. పర్యవేక్షణ మరిచింది. దీని ఫలితమే విజయవాడలోని హోటల్‌ స్వర్ణ ప్యాలె్‌సలో జరిగిన అగ్నిప్రమాదం. ఈ హోటల్‌లో 31 మంది కరోనా రోగులు చికిత్స తీసుకుంటుండగా.. ఆదివారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో 10 ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రం ఉలిక్కి పడింది. ఈ నేపథ్యంలో హోటల్‌ క్వారంటైన్‌ సురక్షితమేనా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొవిడ్‌ రోగుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. హోటళ్లలో వైద్యం సురక్షితం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్షణ  వ్యవస్థ సరిగా లేని ఇలాంటి చోట ఏదైనా ప్రమాదం జరిగితే రోగులు తప్పించుకునే మార్గం ఉండదని అంటున్నారు. ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సౌకర్యాలు కూడా ఉండవని.. ఇది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనని పేర్కొంటున్నారు.


లిఫ్టులు కూడా లేవు

హోటల్స్‌లో రోగులకు వైద్యం చేయడం వల్ల ఆగ్నిప్రమాదాలు, ఇతర ప్రమాదాల నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉండదు. ఆదివారం విజయవాడలోని స్వర్ణ హోటల్‌లో అదే జరిగింది. ఆగ్నిప్రమాదం జరిగిన తర్వాత బయటపడడానికి రోగులకు సరైన మార్గం లేక 10 మంది మృత్యువాత పడ్డారు. మరికొంత మంది రెండో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు నిలబెట్టుకున్నారు. ఈ విషయంలో తప్పు ఎవరిదన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. హోటల్స్‌లో వైద్యానికి అనుమతిచ్చిన ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్న డిమాండ్లు మాత్రం వినిపిస్తున్నాయి. ప్రయివేటు హాస్పిటల్స్‌ యాజమాన్యం అద్దెకు తీసుకున్న చాలా హోటల్స్‌లో సరైన లిఫ్ట్‌లు కూడా అందుబాటులో లేవు. ముఖ్యంగా హోటల్స్‌లో రోగులకు అత్యవసరంగా తరలించడానికి అనువుగా ర్యాంప్‌లు, శ్వాస సంబంధింత సమస్యలు వస్తే ఆక్సిజన్‌ అందించే సౌకర్యాలు, అత్యవసరం అనుకుంటే వెంటిలేటర్లు లాంటి సౌకర్యాలు ఏమీ ఉండవు. ఆస్పత్రిలో అయితే అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఫైర్‌ ఎక్యూట్‌మెంట్‌ అందుబాటులో ఉంటుంది. కాబట్టి వెంటనే మంటలు ఆర్పే అవకాశం ఉంటుంది. హోటల్స్‌లో అలాంటి అవకాశం ఉండదు. విజయవాడలో జరిగిన సంఘటనకు ఇదే ప్రధాన కారణం. దీంతో పాటు కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న హోటల్స్‌లో అత్యధికంగా శానిటైజర్లు ఉంటాయి. స్వర్ణ ప్యాలె్‌సలో భారీగా మంటలు ఎగసి పడడానికి కూడా శానిటైజర్లు కారణమని నిపుణులు చెబుతున్నారు.


మూతపడిన హోటళ్లను ఇలా..

ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మూతపడిన సుమారు 50 పైన హోటల్స్‌ను హాస్పిటల్స్‌గా మార్చేశారు. ఈ సంస్కృతి తొలుత విజయవాడ, గుంటూరు నుంచే ప్రారంభమైంది. నిబంధనల ప్రకారం రోగులకు చికిత్స అందించే కేంద్రాలకు.. జిల్లా వైద్యాధికారి అనుమతి దగ్గరి నుంచి అంబులెన్స్‌ సౌకర్యాలు, బిల్డింగ్‌లో రక్షణ వ్యవస్థ అన్నీ సక్రమంగా ఉండాలి. కానీ అనేకచోట్ల డబ్బులకు ఆశపడి నిబంధనలకు అనుగుణంగా లేని హోటళ్లను కూడా ఆస్పత్రులుగా మార్చేశారు. చాలా మంది ప్రభుత్వ పెద్దలు, పార్టీల నాయకులు, ఉన్నతాధికారులు కూడా హోటళ్లలోనే వైద్యం తీసుకున్నారు. హోటళ్లలో వైద్యం అంత సురక్షితం కాదని తెలిసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. పైగా జిల్లా కలెక్టర్లు అనుమతులిచ్చే వరకూ కొందరు నాయకులు ఒత్తిళ్లు కూడా తీసుకొచ్చారు. కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్లు దొరకాలంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు వంటి నగరాల్లో సాధారణ రోగులకు కూడా బెడ్లు దొరకడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యం ఇదే అదునుగా హోటళ్లపై కన్నేశాయి.


అడ్డూ అదుపూ లేకుండా...

కరోనా సోకిన వారికి ప్రభుత్వమే ఉచితంగా వైద్యం చేస్తుంది. బాధితుల జేబులో నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చాం. బాధితులు తమకు నచ్చిన హాస్పిటల్స్‌లో చికిత్స పొందవచ్చని స్వయంగా సీఎం జగన్‌ ప్రకటించారు. కానీ ఒక్కటి కూడా అమలుకు నోచుకోలేదు. రాష్ట్రంలో ఒక్క ప్రయివేటు హాస్పిటల్‌ కూడా కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం లేదు. ఈ విషయం ఆరోగ్యశాఖలోని ఉన్నతాధికారులకు తెలిసినా కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా బాదేస్తున్నాయి. హోటళ్లలో చికిత్సకు రోజుకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకూ వసూళ్లు చేస్తున్నారు. సుమారు 10 నుంచి 12 రోజుల పాటు హోటల్‌లో ఉండాల్సి ఉంటుంది. అంటే 12 రోజులకు రూ.6 లక్షల వరకూ వసూళ్లు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలోనూ హోటళ్లును అద్దెకు తీసుకొని అక్కడ రోగులను ఉంచుతున్నాయి. కృష్ణా జిల్లా వ్యాప్తంగా 24 ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. విశాఖలో కార్పొరేట్‌ ఆస్పత్రుల నిర్వాహకులు నగరంలోని కొన్ని హోటళ్లను అద్దెకు తీసుకుని కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా వినియోగిస్తున్నారు. ఆయా ఆస్పత్రుల్లో అల్పాహారం, భోజనం, మందులు, గది అద్దె కలిపి రోజుకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకూ వసూలు చేస్తున్నారు.

Updated Date - 2020-08-10T09:43:36+05:30 IST