రూ.వెయ్యి వసూలు

ABN , First Publish Date - 2022-08-05T05:19:09+05:30 IST

ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయ్యింది.. ఈ నెల నుంచి జీతం రెట్టింపు అవుతుంది..

రూ.వెయ్యి వసూలు

కొత్త జీతం కోసం కమీషన్‌ ఇవ్వాల్సిందే

సచివాలయ ఉద్యోగులపై ట్రెజరీ ఒత్తిడి

పే స్కేల్‌ ఆమోదించినందుకని డిమాండ్‌

కలెక్టరేట్‌కు ఫిర్యాదులు చేస్తోన్న ఉద్యోగులు

గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి):  ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయ్యింది.. ఈ నెల నుంచి జీతం రెట్టింపు అవుతుంది.. సంతోషంగా  ఉన్నారు.. ఆ సంతోషంలోనే మాకో రూ.వెయ్యి ఇవ్వండి.. అని సచివాలయ ఉద్యోగులకు ట్రెజరీ ఉద్యోగుల డిమాండ్‌ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొత్త జీతం కావాలంటే కమీషన్‌ ఇవ్వాల్సి వస్తుందని.. లేదంటే బిల్లులను ఆపేస్తున్నారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త పే స్కేల్‌ని ప్రభుత్వం మంజూరు చేసిన నేపథ్యంలో దానిని ఆమోదించేందుకు ట్రెజరీ సిబ్బంది చేతులు చాస్తున్నారు. ఒక్కో ఉద్యోగి నుంచి రూ.750 నుంచి రూ.వెయ్యి వరకు వసూలు చాస్తున్నారు. సత్వరమే తాము అడిగినంత నగదు పంపించాలని సబ్‌ ట్రెజరీ కార్యాలయాల సిబ్బంది సచివాలయ ఉద్యోగులపై ఒత్తిడి చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాతో పాటు చీరాల డివిజన్‌లో కలిపి 14,200 మందికి గత నెలలో ప్రొబేషన్‌ను ప్రభుత్వం ఖరారు చేసింది. వీరిలో గుంటూరు జిల్లాకు సంబంధించి 8,439 మంది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఉన్నారు. ప్రొబేషన్‌పై ఎంతోకాలంగా ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు. ఎట్టకేలకు వారి కల నెరవేరగా పేస్కేల్‌పై మూడు వారాలు గందరగోళం నెలకొంది. చివరకు పేస్కేలు ఖరారై జూలై నెలకు సంబంధించి ఆగస్టులో వేతనాలు ఉద్యోగుల ఖాతాల్లో పడ్డాయి. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రస్తుతం వారికి ట్రెజరీల నుంచి కొత్త సమస్య వచ్చి పడింది. కొత్త పేస్కేల్‌ ఈ నెల నుంచే అమలు కానున్నది. ఇందుకు సంబంధించి డీడీవోలు ఇప్పటికే బిల్లులను సబ్‌ ట్రెజరీలకు పంపించారు. ఒక్కో ఉద్యోగికి కొత్త పేస్కేల్‌ ప్రకారం రూ.28 వేల వరకు జీతభత్యాలు అందుతాయి. అయితే నూతన పేస్కేల్‌ని తొలుత సబ్‌ ట్రెజరీ కార్యాలయాలు ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అందుకోసం కొంతమంది సిబ్బంది రూ.వెయ్యి పంపాలని సచివాలయ ఉద్యోగులను ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అడిగినంత మొత్తం పంపకపోతే బిల్లులు పెండింగ్‌లో పడిపోతాయని చెబుతున్నారని తెలిసింది. ఈ నగదు విషయం బహిరంగంగా మాట్లాడితే భవిష్యత్తులో ఇబ్బందులకు గురి చేస్తారేమోనన్న సచివాలయ ఉద్యోగులు పలువురు భయంతో మిన్నకుండిపోతున్నారు. కొంతమంది మాత్రం ధైర్యం చేసి కొత్త పేస్కేల్‌ ఇవ్వడం ట్రెజరీ ఉద్యోగుల డ్యూటీ.. దానికి ఎందుకు కమీషన్‌ చెల్లించాలని అసోసియేషన్‌ నాయకులకు నివేదించారు. వారి ద్వారా తాజాగా కలెక్టరేట్‌కు ఫిర్యాదులు పంపించారు. ఇప్పటికే పలువురు ఉద్యోగులు నోడల్‌ ఆఫీసర్‌, కలెక్టరేట్‌కి వాట్సాప్‌ల ద్వారా ఫిర్యాదులు పంపించారు. ఈ ఫిర్యాదులు తాజాగా కలెక్టరేట్‌కు చేరడంతో దీనిపై ఉన్నతాధికారులు ఏ చర్య తీసుకొంటారోనన్న ఉత్కంఠ నెలకొన్నది.

ఫిర్యాదులపై విచారణ జరిగేనా...

సాధారణంగా ట్రెజరీ ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు వారిపై విచారణ జరిపే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు. ఇందుకు కారణం వారి శాలరీ బిల్లులు కూడా ట్రెజరీ ఉద్యోగులే ఆమోదించాల్సి ఉంటుంది. ఇటీవల ఓ అధికారి తనకు అందిన ఫిర్యాదులను ట్రెజరీ దృష్టికి తీసుకెళ్లగా అసలు ఆ అధికారి ఏ డిపార్టుమెంట్‌, ఎక్కడ జీతం తీసుకొంటున్నారు.. వేరే చోట ఎందుకు విధులు నిర్వహిస్తున్నారని కొర్రీలు వేశారు. ఈ నేపథ్యంలో సచివాలయాల ఉద్యోగులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరుగుతుందో, లేదోనన్న సందేహాలు వస్తున్నాయి.  


Updated Date - 2022-08-05T05:19:09+05:30 IST