అమెరికా వెళ్లాలా? అయితే మీకు ఏ వీసా సరిపోతుందో చెక్ చేసుకోండి

ABN , First Publish Date - 2021-03-03T02:30:13+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని, వీలైతే అక్కడే స్థిరపడాలనేది చాలా మంది కల.

అమెరికా వెళ్లాలా? అయితే మీకు ఏ వీసా సరిపోతుందో చెక్ చేసుకోండి

ఇంట‌ర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికా వెళ్లాలని, వీలైతే అక్కడే స్థిరపడాలనేది చాలా మంది కల. ఇక కొందరు సరదాగా ఒకసారి యూఎస్ చూసొద్దమని వెళ్తే.. మరికొందరు చికిత్స కోసం.. ఇంకొందరు ఉద్యోగం, బిజినెస్, చదువు ఇలా రకరకాల పనుల నిమిత్తం యూఎస్ వెళ్తుంటారు. అయితే, అగ్రరాజ్యంలో అడుగుపెట్టాలంటే.. ఒక్కొ పర్పపస్‌కు ఒక్కొ రకమైన వీసా అవసరం ఉంటుంది. దేనికి ఏ వీసా తీసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

'బీ-2'వీసా: సాధారణ సందర్శన లేదా టూరిజం 

సాధారణంగా అమెరికా సందర్శనకు వచ్చే విదేశీయులకు 'బీ-2'వీసా ఇస్తారు. విదేశీయులు అమెరికాలో ఉన్న తమ కుటుంబ సభ్యులు, స్నేహితులను కలిసేందుకు ఆ దేశానికి వెళ్లాలంటే ఈ వీసా తీసుకోవడం తప్పనిసరి. అలాగే అక్కడ ఉన్న తమ ఫ్యామిలీ శుభకార్యాలు, ఇతర పార్టీలలో పాల్గొనాలన్నా 'బీ-2'వీసాకు దరఖాస్తు చేసుకోవాల్సిందే. 


'హెచ్' వీసాలు: విదేశీ నిపుణులు అమెరికా కంపెనీలలో పని చేసేందుకు

'హెచ్-1బీ' వీసా ద్వారా యూఎస్‌కు చెందిన కంపెనీ యాజమాన్యాలు విదేశీ నిపుణులను తమ సంస్థలలో ఉద్యోగులుగా నియమించుకునేందుకు వీలు కల్పిస్తుంది. 'హెచ్-2ఏ', 'హెచ్-2బీ' వీసాల ద్వారా అమెరికన్ సంస్థలు విదేశీయులను తాత్కాలికంగా వ్యవసాయ, వ్యవసాయేతర జాబ్స్‌లో నియమించుకునే అవకాశం ఉంది. అలాగే 'హెచ్-3' వీసాను ట్రైనీస్‌కు జారీ చేస్తారు. 


'ఎఫ్' వీసా: అమెరికాలో చదువు కోసం

యూఎస్‌లో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు ఇచ్చేదే 'ఎఫ్-1' వీసా. గుర్తింపు పొందిన కళాశాల లేదా విశ్వవిద్యాలయం, సెమినరీ లేదా కన్జర్వేటరీ, అకాడెమిక్ హైస్కూల్ లేదా ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్ధులుగా చేరేందుకు ఈ వీసాను జారీ చేస్తారు. 


'బీ-2' వీసా: చికిత్స కోసం యూఎస్ వెళ్లేందుకు

అమెరికాలో చికిత్స కోసం వెళ్లేవారు తప్పనిసరిగా బీ-2 వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ వీసా పొందాలంటే రోగికి యూఎస్‌లో చికిత్స తప్పనిసరి అని, ఆ చికిత్స తమ దేశంలో అందుబాటులో లేదని నిరూపించాల్సి ఉంటుంది. అలాగే యూఎస్‌లో ఆ చికిత్సకు అయ్యే ఖర్చులను తాము భరించగలమనే ఆధారాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అంతేగాక మీరు ఇంతకుముందు చికిత్స తీసుకున్న వైద్యుడు, యూఎస్ హెల్త్‌కేర్ అధికారుల నుంచి లేఖ తీసుకోవడం తప్పనిసరి. 


'జె' వీసా: విదేశీ వైద్యులు యూఎస్‌లో ప్రాక్టీస్ కోసం తీసుకునేది

సర్వసాధారణంగా ఇంటర్నెషనల్ మెడికల్ విద్యార్థులు యూఎస్ జీఎంఈ కార్యక్రమాల్లో పాల్గొనాలంటే జె-1 వీసా తప్పనిసరి. ఈ వీసాను విదేశీ మెడికల్ రెసిడెంట్స్ ఒకసారి ఒక ఏడాదికి మాత్రమే పొడిగించుకునే వీలు ఉంది. అయితే, మొత్తంగా ఏడేళ్ల వరకు ఈ వీసాను ఎక్స్‌టెండ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే వైద్య నిపుణులు పరిశోధనలు, క్లినికల్ ప్రాక్టీస్‌ల కోసం హెచ్-1బీ వీసాపై కూడా వెళ్లొచ్చు. 


'ఈ' వీసా: -మీరు ఒక వ్యాపారవేత్త అయితే, యూఎస్‌లో వ్యాపారం చేయాలని చూస్తున్నట్లయితే, మీకు 'ఈ'  వీసా అవసరం 

అమెరికాలో పెట్టుబడులు పెట్టి వ్యాపార సంస్థలను నిర్వహించాలనుకునే వ్యాపారవేత్తలకు ఇచ్చేది 'ఈ' వీసా. ఇక అమెరికా సంస్థలలో విదేశీ పెట్టుబడిదారుడు 50 శాతం ఎక్కువ పెట్టుబడులను కలిగి ఉంటే 'ఈ-2' వీసాకు అర్హులవుతారు.  


ఎల్-1వీసా: విదేశీ వ్యాపారవేత్తలు అమెరికాలో వ్యాపారాన్ని నెలకొల్పడానికి పనికొస్తుంది. 


'ఓ' వీసా: మీరు మీ రంగంలో ప్రఖ్యాత నిపుణులా? మీకు ఓ వీసా అవసరం

తమ రంగంలో సాధించిన విజయాలకు జాతీయంగా, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విదేశీ నిపుణులు ఓ వీసాకు అర్హులు. శాస్త్రాలు, విద్య, వ్యాపారం, అథ్లెటిక్స్‌లో అసాధారణ సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారికి ఓ-1ఏ నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా అందుబాటులో ఉంటుంది. నటులు, ఇతర మీడియా నిపుణులకు ఓ-1బీ వీసా కావాలి.

Updated Date - 2021-03-03T02:30:13+05:30 IST