Abn logo
Aug 4 2021 @ 00:16AM

సివిల్‌ సప్లయ్స్‌ గోదాములో రవాణా దోపిడీ

లారీలకు లోడ్‌ చేస్తున్న కూలీలు

కాంట్రాక్టర్‌ కాసుల కక్కుర్తి... కార్డుదారులకు శాపం


మదనపల్లె, ఆగస్టు 3: మదనపల్లె పౌర సరఫరాల శాఖ గోదాములో అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్‌ కక్కుర్తి ఫలితంగా అటు రేషన్‌ డీలర్లు, ఇటు కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. సకాలంలో రేషన్‌ సరుకులు చౌకదుకాణాలకు చేరకపోవడంతో  కార్డుదారులు చివరకు నిత్యావసర వస్తువులకు దూరమవుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే వ్యవస్థలో పాతుకుపోయిన కాంట్రాక్టర్‌ సరుకులను చౌక దుకాణాలకు ఎప్పుడు సరఫరా చేసినా అధికారులు ప్రశ్నించడం లేదు. సగం దుకాణాలకు పంపిణీ గడువు ముగిసే రెండుమూడు రోజుల ముందు బియ్యం, చెక్కర, కందిపప్పు తదితరాలు సరఫరా చేస్తున్నారు. ఆ గడువులోనే పూర్తిస్థాయిలో కార్డుదారులకు ఇవ్వకపోవడంతో పంపిణీలో జిల్లాలో మదనపల్లె చివరిస్థానంలో ఉంటోంది. 

సాధారణంగా నిత్యావసర వస్తువులు లారీల్లో స్టేజ్‌-1(ఐరాల) నుంచి స్టేజ్‌-2 (గోదాము) చేరాలి. అక్కడున్న హమాలీలు వాటిని దించి బాంబేనెట్‌ వేయాలి. తర్వాత చౌకదుకాణానికి కేటాయింపుల ప్రకారం అక్కడే ఉన్న కాటాలో తూకం వేసి సరఫరా చేయాలి. కానీ ఇక్కడంతా విరుద్ధంగా జరుగుతోంది. స్టేజ్‌-1 నుంచి వచ్చిన బియ్యాన్ని గోదాములో దింపకుండా కొన్ని లారీలను వెలుపలి నుంచే చౌకదుకాణాలకు పంపేస్తున్నారు. మరికొన్నింటిని గోదాము ఆవరణలో చౌకదుకాణాలకు వెళ్లే కాంట్రాక్టర్‌ వాహనాలకు నింపి, తూకం వేయకుండా పంపేస్తున్నారు. దీంతో తూకాల్లో రేషన్‌ డీలర్లకు కోత పడుతోంది. మరోవైపు ఐరాల నుంచి వచ్చిన లారీలను బయట నుంచే చౌకదుకాణాలకు పంపించేస్తుండడంతో గోదాము కాంట్రాక్టర్‌కు చౌకదుకాణాలకు నిత్యావసరాలను తోలే భారం తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం క్వింటాలుకు రూ.13.50, తన వాహనాలకు వాడే డీజిల్‌, హమాలీలకు ఇచ్చే కూలీలూ మిగిలితోంది. స్టేజ్‌-1 నుంచి నిత్యావసర లారీలను దారి మళ్లిస్తున్నారనే అభియోగంపై ప్రభుత్వం వాటికి జీపీఎస్‌ను అమర్చింది. కానీ కాంట్రాక్టర్‌ జీపీఎస్‌ కళ్లు కప్పి, దారి మళ్లిస్తున్నారు. ఇదంతా అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదు. 

మదనపల్లె సివిల్‌ సప్లయ్స్‌ గోదాము నుంచి కాంట్రాక్టర్‌ మదనపల్లె మున్సిపాలిటీ, మదనపల్లె, నిమ్మనపల్లె, కురబలకోట మండలంలోని 160 చౌకదుకాణాలకు నిత్యావసర వస్తువులు చేర్చాల్సి ఉంది. ఇందుకోసం నాలుగు లారీలు, ఒక ట్రాక్టర్‌ ఉన్నాయి. వీటికి గోదాములో సరుకులు లోడ్‌ చేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హమాలీలున్నారు. ఇదే సరుకులను తన వాహనం ద్వారా చౌకదుకాణంలో దింపడానికి కాంట్రాక్టర్‌ కూలీలను ఏర్పాటు చేసుకుంటే, దిగుమతి కూలీ రేషన్‌ డీలర్లు చెల్లిస్తున్నారు. అయితే, ఐదు వాహనాలు, అందుకు సరిపడా డ్రైవర్లు, కూలీలు తనవద్ద ఉన్నట్లు టెండర్‌ నిబంధనలో కాంట్రాక్టర్‌ చూపించారు. కానీ క్షేత్రస్థాయిలో లేకపోవడమే నిత్యావసర వస్తువుల సరఫరాలో తీవ్ర జాప్యానికి కారణం. డ్రైవర్లు, కూలీలు లేకపోవడంతో రెండుమూడు వాహనాలే పనిచేస్తున్నాయి. ఒక చోట సరుకులు దింపి వచ్చిన కూలీలు, డ్రైవరే మరోచోటికి వెళ్లాల్సి వస్తోంది. దీంతో సకాలంలో సరుకులు చౌకదుకాణానికి చేరకపోవడం, అప్పటికే పంపిణీ గడువు ముగిసిపోవడంతో డీలర్ల వద్ద రేషన్‌ సరుకులు మిగిలిపోతున్నాయి. ఫలితంగా పంపిణీ శాతం  ప్రతినెలా భారీగా తగ్గిపోతోంది. దీనిపై అనుమానం వచ్చిన జిల్లా అధికారులు ఇటీవల గోదాముకు వచ్చి విచారణ జరిపితే అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై అధికారులు, కాంట్రాక్టర్‌కు హెచ్చరికలు జారీ చేసినా... పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. కాలం చెల్లిన వాహనాలతో ఒకరిద్దరు డ్రైవర్లు, ఆరుగురు కూలీలతో కాలం వెళ్లదీస్తున్నారు. కానీ ఇక్కడి గోదాము అలాట్‌మెంట్‌ను బట్టి కోటాకు రూ.2.50 లక్షలకుపైగా ప్రభుత్వం నుంచి బిల్లు రూపంలో పొందుతున్నారు. ప్రస్తుతం నెలకు రెండుకోటాలు కావడంతో రూ.5లక్షలకుపైగా తీసుకుంటున్నారు. గోదాము నుంచి రేషన్‌ డీలర్లే వాహనాలు ఏర్పాటు చేసుకుని సరుకులు తీసుకెళ్లినా, స్టేజ్‌-1 నుంచి వచ్చే లారీలను అట్లే రేషన్‌ షాపులకు మళ్లించినా... కాంట్రాక్టర్‌కు బిల్లు రూపంలో కలిసిరావడమే ఇక్కడి విశేషం.