కుంచెపట్టిన హిజ్రాలు.. ముంబైకి సరికొత్త అందాలు

ABN , First Publish Date - 2022-03-22T00:43:41+05:30 IST

దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ పెద్ద ఫ్లై ఓవర్ పిల్లర్లు ఇప్పుడు అందమైన వర్ణచిత్రాలుగా మారిపోయాయి. వాహనదారులను

కుంచెపట్టిన హిజ్రాలు.. ముంబైకి సరికొత్త అందాలు

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని ఓ పెద్ద ఫ్లై ఓవర్ పిల్లర్లు ఇప్పుడు అందమైన వర్ణచిత్రాలుగా మారిపోయాయి. వాహనదారులను కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తున్నాయి. అంతేకాదు, ట్రాన్స్‌జెండర్లపై సాధారణంగా అందరికీ ఉండే వైఖరిని ఇవి మార్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.


ఇంత అందమైన చిత్రాలను గీస్తున్నది మరెవరో కాదు.. హిజ్రాలు (ట్రాన్స్‌జెండర్లు). వీరు పుట్టినప్పుడు మగవారిగా గుర్తించినా తర్వాత వీరు ‘మూడోలింగం’లో భాగమవుతున్నారు. భారతీయ సమాజంలో వీరు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. వీరికి ఆశీర్వదించే, శపించే శక్తి కూడా ఉందని నమ్ముతారు. అయినప్పటికీ వీరు ఇంకా సమాజంలో పూర్తిగా కలవలేకపోతున్నారు. 


వీరికి కార్యాలయాల్లో ఉద్యోగాలు దొరకవు. కాబట్టి వీరు యాచనను ఆశ్రయిస్తున్నారు. ప్రధాన నగరాల్లో వీరు రైళ్లలో ప్రయాణికుల వద్ద యాచిస్తారు. వివాహాలు, జన్మదిన కార్యక్రమాలు, గృహప్రవేశాల సమయంలో అక్కడికి చేరుకుని ఆశీర్వదించడం ద్వారా డబ్బులు తీసుకుంటారు. అయితే, డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించే వారిని శపిస్తామని కూడా బెదిరిస్తారు. వీరిలో కొందరి వ్యవహార శైలి కారణంగా వీరిపై జనంలో కొంత వ్యతిరేకత కూడా ఉంది. మరికొందరు వ్యభిచారంవైపు మొగ్గు చూపుతున్నారు. 


హిజ్రాల జీవితాల్లో మార్పులు తీసుకురావాలని సంకల్పించిన అరవని ఆర్ట్ ప్రాజెక్ట్.. హిజ్రాలను ఎక్కడైతే చిన్నచూపు చూస్తున్నారో అక్కడే వారిని కళాకారులుగా చూపించాలని తాపత్రయపడుతోంది. ఎక్కడైతే వారు యాచించారో, ఎక్కడైతే వారు ఛీత్కారాలకు గురయ్యారో అక్కడే వారిని గౌరవంగా నిలిపే ప్రయత్నం చేస్తోంది. 


ముంబైలోని అత్యంత రద్దీ జంక్షన్లలో ఒక చోట ఈ ట్రాన్స్‌‌జెండర్ల బృందం స్థానికుల చిత్రాలను ఆకట్టుకునేలా చిత్రించింది.  ఇందులో ఇద్దరు క్లీనర్లు, కూరగాయలు అమ్మే వ్యక్తి, ఓ పోలీసులు ఉన్నారు.


ఈ సందర్భంగా ఓ ట్రాన్స్‌జెండర్ మహిళ దీపా కచరే (26) మాట్లాడుతూ.. తమలోని నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఇదో గొప్ప అవకాశమని అన్నారు. ‘‘మేం యాచన ద్వారా పొట్ట నింపుకుంటాం. పెళ్లి వేడుకలు, బర్త్‌డేలు, దుకాణాలు, రైళ్లలో అడుక్కుంటాం. మాలో కొందరు సెక్స్ వర్కర్లుగా పనిచేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు’’ అన్నారు. భిక్షాటన కోసం తాము ప్రతీ చోటుకి వెళ్తామని, కానీ తాము కష్టపడి డబ్బు సంపాదించేందుకే ఇష్టపడతామని దీప చెప్పారు.


‘‘నేనీ ప్రపంచానికి ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మేం వేధింపులకు గురయ్యాం. ఇతరులు తమ పొట్టలు నింపుకోవడానికి ఉద్యోగాలు చేస్తుంటే మేం భిక్షాటన చేసుకుంటున్నాం. కానీ, ఇప్పుడు మేం దానిని పక్కనపెట్టేశాం. ఇప్పుడు మేం ఆర్టిస్టులం. మీరు కనుక సహకరిస్తే మేం ఇంకా చాలా చేస్తాం’’ అని ట్రాన్స్ జెండర్ ఆర్టిస్ట్  అయేషా కోలి చెప్పారు.


వీరి జీవితాల్లో సమూల మార్పులు తీసుకురావాలని కంకణం కట్టుకున్న అరవని ఆర్ట్ ప్రాజెక్ట్ దేశంలోని పలు నగరాల్లో స్ట్రీట్ ఆర్ట్ ప్రాజెక్ట్ కోసం డజన్ల కొద్దీ ట్రాన్స్‌జెండర్ మహిళలను ఒక చోటికి చేర్చింది. ఆర్టిస్టులుగా మారిన తమను చూసి ప్రజలు తమ దృక్పథాన్ని మార్చుకుంటున్నారని దీప పేర్కొన్నారు. ఇప్పుడు వారు తమను చూడగానే పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. వందలాదిమంది ట్రాన్స్‌జెండర్లను ‘వివాహం’ చేసుకున్న హిందూ దేవుడు అరవన్ నుంచి ఈ పేరును తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో అరవన్ పండుగ ప్రతి ఏడాది ఘనంగా జరుగుతుంది. 


నిజానికి హిజ్రాలు ఇప్పుడే పుట్టుకొచ్చినవారు కాదు. వీరికి సంబంధించి మహాభారతంలోనూ ప్రస్తావన ఉంది. అందులో శిఖండి పాత్ర ఇదే. హిజ్రాలు శతాబ్దాలుగా సమాజంలో విభిన్న పాత్రలు పోషించారు. చరిత్రకారుల ప్రకారం హిజ్రాలు రాజ సేవకులుగా, అంతఃపుర సంరక్షకులగానూ ఉన్నారు.


అరవని ఆర్ట్ ప్రాజెక్ట్ సహ వ్యవస్థాపకురాలు, ఆర్ట్ డైరెక్టర్ సాధనా ప్రసాద్ మాట్లాడుతూ.. వీరిని ఎక్కడైతే చిన్నచూపు చూశారో, ఎక్కడైతే వీరిని ప్రశ్నించారో, ఎక్కడైతే రక్షణ లేదని భావించారో అక్కడే వారికి ఆర్టిస్టులుగా గౌరవం దక్కాలని, అందుకోసమే తమ ప్రయత్నమని అన్నారు.



Updated Date - 2022-03-22T00:43:41+05:30 IST