సెలవుపై.. వెళ్లిపోండి

ABN , First Publish Date - 2022-07-20T06:16:01+05:30 IST

తమ ఆమోదం లేకుండా పోస్టింగ్‌పై వచ్చారని.. వారు బదిలీపై వెళ్లేలా కొంతమంది వైసీపీ నాయకులు పంతం పట్టిఉన్నారు.

సెలవుపై.. వెళ్లిపోండి


తహసీల్దార్లపై వైసీపీ నేతల ఒత్తిళ్లు

అనుమతి లేకుండా వచ్చారని పంతం

తమ వెంట పర్యటనలకు రావడం లేదని నెపం

గుంటూరు, జూలై 19 (ఆంధ్రజ్యోతి): తమ ఆమోదం లేకుండా పోస్టింగ్‌పై వచ్చారని.. వారు బదిలీపై వెళ్లేలా కొంతమంది వైసీపీ నాయకులు పంతం పట్టిఉన్నారు.  ఈ క్రమంలో ఒకపక్క ఆయా తహసీల్దార్లను సెలవు పెట్టి వెళ్లిపోవాలని ఒత్తిడి చేస్తూనే వారిపై జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్నారని, తమ వెంట పర్యటనలకు రావడం లేదంటూ ఫిర్యాదుల్లో ప్రస్తావిస్తున్నారు. వారిని బదిలీ చేసి తాము సూచించిన అధికారులను పోస్టింగ్‌ చేయాలని కోరుతున్నారు. తహసీల్దార్ల బదిలీలు జరిగి కనీసం 20 రోజులైనా కాక ముందే ఇలా ఒత్తిడి చేస్తోండటంపై రెవెన్యూవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నాయి. గత నెలాఖరున జిల్లాలో పలువురు తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఆ సందర్భంలో కొంతమంది వైసీపీ నేతలు సూచించిన తహసీల్దార్లను ఆయా మండలాలకు పోస్టింగ్‌లు చేయలేకపోయారు. పరిపాలన సౌలభ్యం కోసం ఎమ్మెల్యేల ఇష్టా, అయిష్టాలతో సంబంధం లేకుండా కొంతమంది తహసీల్దార్ల పోస్టింగ్‌లు జరిగాయి. అలా పోస్టింగ్‌ అయిన వారిని విధుల్లో చేరకుండా అడ్డుకునే ప్రయత్నాలు వైసీపీ నేతలు మొదలుపెట్టారు. అయితే అధికార యంత్రాంగం అండగా ఉండటంతో ఆయా తహసీల్దార్లు విధుల్లో చేరారు. ఇప్పుడు వారిపై సంబంధిత నేతల నుంచి ఒత్తిళ్లు ఎక్కువైపోయాయి. గడప.. గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి అధికారులను హాజరు కావాల్సిందిగా నేతలు ఒత్తిడి చేస్తోన్నారు. దీంతో ఒక పక్క ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలైన పేదలందరికీ ఇళ్ల నిర్మాణం, భూముల రీసర్వే, సచివాలయాలు, ఆర్‌బీకేలు, మల్టీపర్పస్‌ సెంటర్లు, విలేజ్‌ వెల్‌నెస్‌, డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్లు వంటి నిర్మాణ పనులను పర్యవేక్షించలేక మరోవైపు ఎమ్మెల్యేల వెంట వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం తహసీల్దార్ల బదిలీల్లో ఎమ్మెల్యేలకు ఎలాంటి ప్రమేయం లేదు. అయినా వారు అదేదో రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులా భావిస్తూ ఫలాన అధికారిని బదిలీ చేయమని, తాము సూచించిన అధికారిని పోస్టింగ్‌ చేయమని సిఫార్సు లేఖలు ఇవ్వడం పరిపాటిగా మారిపోయింది. ఇటీవల ఫ్యాక్టరీస్‌ డిపార్టుమెంట్‌లో ఓ అధికారిని బదిలీ చేయమని ఎమ్మెల్యే లేఖ ఇచ్చారు. దాంతో ఆయన్ని బదిలీ చేసి వేరొకరిని పోస్టింగ్‌ చేశారు. దీనిపై బదిలీ అయిన అధికారి తనను నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ఫర్‌ చేశారని హైకోర్టుని ఆశ్రయించగా ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టిపారేసింది. ఆ తీర్పుతోనైనా వైసీపీ నేతల వైఖరిలో మార్పు రావడంలేదు. 


Updated Date - 2022-07-20T06:16:01+05:30 IST