బదిలీలపై.. అసంతృప్తి!

ABN , First Publish Date - 2022-07-04T05:10:54+05:30 IST

బదిలీల ప్రక్రియ అయితే అధికారికంగా ముగిసిపోయినా రెండు, మూడు రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకొంటోన్నాయి.

బదిలీలపై.. అసంతృప్తి!

విధుల్లో చేరతారా... సెలవులో వెళతారా..?

కీలక శాఖల్లో కొంతమందికి పనిష్‌మెంట్‌ బదిలీలు

కొందరిని బదిలీ చేసి డబ్ల్యూఏ పేరుతో పాత కొలువుల్లోనే కొనసాగింపు

మనం చెప్పినవి చేయలేదని వైసీపీ నేతల్లో అంతర్మథనం


గుంటూరు, జూలై 3(ఆంధ్రజ్యోతి): బదిలీల ప్రక్రియ అయితే అధికారికంగా ముగిసిపోయినా రెండు, మూడు రోజులుగా అనేక పరిణామాలు చోటు చేసుకొంటోన్నాయి. ఇప్పటివరకు ఫోకల్‌ పాయింట్లలో విధులు నిర్వహిస్తున్న కొంతమంది ఉద్యోగులను అనూహ్యంగా మారుమూల ప్రాంతాలకు బదిలీ చేశారు. అవి ఒక విధంగా పనిష్‌మెంట్‌ బదిలీలేనన్న చర్చ ఆయా శాఖల్లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయిన ఉద్యోగులు విధుల్లో చేరతారో, లేదోనన్న సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ట్రాన్స్‌ఫర్‌ ఆర్డర్స్‌పై అసంతృప్తిగా ఉన్న కొందరు దీర్ఘకాలిక సెలవులోకి వెళ్లే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలిసింది. ఇదే సమయంలో పరిపాలన సౌలభ్యం కోసం అధికారులు కొన్ని బదిలీలు సొంతగా చేశారు. వాటిపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. 

మూడు జిల్లాల్లో తమ నియోజకవర్గ పరిధిలో చేసే బదిలీలన్ని సమ్మతంతోనే జరగాలన్న ధోరణితో గత కొద్దిరోజుల నుంచి వైసీపీ నేతలున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో అదే పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు జోక్యం చేసుకొని వారికి ఇష్టమొచ్చిన వారిని పోస్టింగ్‌ చేయించుకొన్నారు. మూడు జిల్లాల్లో కలిపి రెండు, మూడు మండలాలకు ఉద్యోగులు బదిలీలు కోరుకోలేదు. అయినప్పటికీ కొందరిని ఆయా మండలాలకు పోస్టింగ్‌లు చేశారు. ఇందుకు కారణం గతంలో వారు పని చేస్తున్న ప్రదేశాల్లో వారిపై ఆరోపణలు రావడమేనన్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో తమకు ఇష్టం లేని మండలాలకు పోస్టింగ్‌ అయిన అధికారులు విధుల్లో చేరకపోవచ్చన్న చర్చ ఆయా శాఖల్లో జరుగుతోంది. 

ఇదిలావుంటే పరిపాలన సౌలభ్యం కోసం కొంతమంది ఉద్యోగులను పేరుకే వేరే ప్రాంతానికి బదిలీ చేసిన అధికారులు విధి నిర్వహణలు మాత్రం వారి కార్యాలయాల్లోనే చూయించుకొన్నారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమౌతున్నాయి. అలాంటప్పుడు వారి పేర్లను బదిలీల్లో చూపించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. బదిలీల మార్గదర్శకాల ప్రకారం ఐదేళ్లుగా ఒకే చోట కొనసాగుతోన్న వారిని తప్పక బదిలీ చేయాల్సిందే. ఒకవేళ వారు గుర్తింపు పొందిన సంఘంలో ఆఫీస్‌ బేర్‌గా ఉంటే మినహాయింపు ఉంటుంది. అయితే ఎలాంటి ఆఫీస్‌ బేరర్‌ పదవులు లేకపోయినా ఐదేళ్లకు పైగా ఒకే స్టేషన్‌లో కొనసాగుతున్న వారిని కొనసాగించడంపై ఉద్యోగవర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాగా బదిలీ అయిన అధికారులు, ఉద్యోగులను సత్వరమే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు. వారంతా సోమవారం జరిగే స్పందన కార్యక్రమానికి హాజరు కావాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఎంతమంది చేరతారోనన్న సస్పెన్స్‌ కీలకమైన రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖల్లో నెలకొంది. 


Updated Date - 2022-07-04T05:10:54+05:30 IST