సిఫార్సు మస్ట్‌..!

ABN , First Publish Date - 2022-06-29T05:51:00+05:30 IST

జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీల్లో పూర్తిగా రాజకీయ పెత్తనం కొనసాగుతోంది.

సిఫార్సు మస్ట్‌..!

రెవెన్యూ బదిలీల్లో రాజకీయ పెత్తనం

కోరిన స్థానం కావాలంటే ప్రజాప్రతినిధి 

అనుగ్రహం తప్పనిసరి

వారి చుట్టూ అధికారుల ప్రదక్షిణ

పైసలిస్తేనే సిఫార్సు లేఖ

పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

జిల్లాలో రెవెన్యూ అధికారుల బదిలీల్లో పూర్తిగా రాజకీయ పెత్తనం కొనసాగుతోంది. సిఫార్సు లేఖ ఇస్తేనే కోరిన చోటుకు బదిలీ చేస్తున్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తికాకున్నా పంపిస్తున్నారు. సిఫార్సు లేకుంటే పనికాదు. ఆ సిఫార్సు పొందేందుకు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. చెప్పిన మాట వింటాననీ, అడిగిన పని చేసి పెడతానంటూ సవినయంగా విన్నవించుకుంటున్నారు. అంత వేడుకున్నా.. పైసలిస్తేనే సిఫార్సు లేఖలు ఇస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


భారీ డిమాండ్‌

జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో బదిలీలకు నెలాఖారు వరకు గడువు పొడిగించడంతో పైరవీలు మొదలయ్యాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో ఎక్కడికైనా బదిలీపై వేళ్లే వెసులుబాటు కల్పించడంతో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కోరిన చోటుకు వెళ్లడానికి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. నిబంధనల ప్రకారం ఐదేళ్లు ఒకే కార్యాలయంలో సర్వీసు పూర్తి చేసుకున్న వారు తప్పనిసరిగా బదిలీపై వెళ్లాలి. కొందరు ఉద్యోగులు వివిధ కారణాలతో ఇక్కడే ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ఆధారంగా వారిని ఇక్కడే ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ నేపత్యంలో ప్రజాప్రతినిధుల సిఫార్సులకు డిమాండ్‌ పెరిగింది. రెవెన్యూ శాఖ బదిలీల్లో పైరవీలకే పెద్దపీట వేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్ల బదిలీల్లో ఎమ్మెల్యే ప్రతిపాదించిన వారికే చోటు కల్పిస్తున్నారని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఎమ్మెల్యేల చుట్టూ అధికారులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే సిఫార్సులతో నచ్చిన వారికే పోస్టింగ్‌ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో జిల్లా కలెక్టరేట్‌కు సిఫార్సు లేఖలు కుప్పలతెప్పలుగా వస్తున్నాయి. వాటితోపాటు ప్రజాప్రతినిధులు స్వయంగా ఫోన ద్వారా రికమెండేషన చేస్తునట్లు తెలుస్తోంది. వాటికి ఉన్నతాధికారులు తలొగ్గక తప్పదేమోననిపిస్తోంది.


ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ

తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌, వీఆర్వోల బదిలీల్లో మంత్రులు, ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకే ప్రాధాన్యమిస్తున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్లకు ఉమ్మడి జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో పోస్టింగ్‌ పొందాలంటే కచ్చింతగా అధికారపార్టీ ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖ ఉండాలన్న చందంగా పరిస్థితి తయారైంది. జిల్లాలో ఐదేళ్లు ఒకేచోట పనిచేసినవారు లేరు. అయినా బదిలీలు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఒత్తిళ్లకు తట్టుకోలేక కొందరు తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇనస్పెక్టర్లు బదిలీలు కోరుకుంటున్నా.. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులు ఇక్కడే ఉండాలని పట్టుబడుతున్నారు. మరి కొందరిని బదిలీ పెట్టుకోవాలని హుకుం జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ రెవెన్యూ అధికారు (వీఆర్వో)లు.. ద్వితీయశ్రేణి నాయకులను ఆశ్రయిస్తున్నారు. ఐదేళ్లు ఒకే కార్యాలయంలో సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీపై వెళ్లాలి. కొందరు ఉద్యోగులు వివిధ కారణాలతో ఉన్నచోటే కొనసాగేలా అధికార పార్టీ నాయకులతోపాటు ఉన్నతాధికారులను కాకా పడుతున్నారు.


పైసలిస్తేనే సిఫార్సు

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో బదిలీ కోరుకునే కొందరు తహసీల్దార్లు.. సిఫార్సు లేఖలతో దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. మడకశిర ప్రాంతంలోని తహసీల్దార్‌, డీటీలు బదిలీ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడికి వెళ్లేందుకు పెనుకొండ నియోజకవర్గంలోని ఓ తహసీల్దార్‌ మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. మిగిలిన వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. పదిమంది దాకా ఉమ్మడి జిల్లా అనంతతోపాటు కర్నూలు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో కోరుకున్న చోట పోస్టింగ్‌ కావాలంటే అంతో.. ఇంతో.. చెల్లించుకోవాలని ఇప్పటికే ఆ స్థానానికి పోటీ ఉందని నమ్మబలుకుతూ కొందరు ప్రజాప్రతినిధులు బేరాలు పెడుతున్నట్లు తెలుస్తోంది. తహసీల్దార్‌, ఉప తహసీల్దార్‌, వీఆర్వో బదిలీల్లో నిర్ధేశిత అంతో.. ఇంతో.. ఇచ్చుకోవాల్సిందేనని కొందరు ప్రజాప్రతినిఽధులు, వారి అనుచరులు వసూళ్ల దందాకు తెరలేపారు. ఈ వ్యవహరంలో ప్రజాప్రతినిధుల వద్ద వ్యక్తిగత సహాయకులు, మండలస్థాయి నాయకులే అన్నీతామై వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అక్రమార్కులుగా ముద్రపడిన అధికారులు కోరిన స్థానాల కోసం అడ్డదారులు తొక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలను పక్కన పెట్టేస్తున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.


పెద్దఎత్తున దరఖాస్తులు

వినతులు, పరిపాలనాపరమైన కారణాలతో ఎవరైనా బదిలీ కోరుకునే అవకాశం ఉండటంతో నచ్చినచోట పని చేసేందుకు కొందరు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలకు పాతరేసి, ఇష్టానుషారం పోస్టింగ్‌ ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ మేరకు యంత్రాంగం జాబితా తయారు చేసినట్లు సమాచారం. ఇప్పటిదాకా జిల్లాలో 13 మంది తహసీల్దార్లు, 31 మంది డిప్యూటీ తహసీల్ధార్లు, 20 మంది రెవెన్యూ ఇనస్పెక్టర్లు, 8 మంది సీనియర్‌ అసిసెంట్లు, 15 మంది జూనియన అసిసెంట్లు, 125 మంది దాకా వీఆర్వోలు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.


Updated Date - 2022-06-29T05:51:00+05:30 IST