వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు!

ABN , First Publish Date - 2022-01-29T03:43:43+05:30 IST

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ప్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి.. అదే నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు!
శ్రీకాకుళంలో వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం

- జిల్లాలో 250 మందికి స్థానచలనం 

- ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తే కదలిక తప్పదు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈమేరకు హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ప్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిబ్రవరి 2 నుంచి బదిలీల ప్రక్రియ ప్రారంభించి.. అదే నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఐదేళ్ల పాటు ఒకే చోట పని చేసిన వారికి బదిలీలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు బదిలీలకు అర్హత కలిగిన రెగ్యులర్‌ ఉద్యోగుల జాబితాలను సిద్ధం చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఏటా మే నెలలో సాధారణంగా వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీలు ఉంటాయి. కొవిడ్‌ వ్యాప్తి కారణంగా 2019  నుంచి ఇప్పటి వరకు బదిలీలు నిలిపేశారు. దీంతో బదిలీల కోసం కొంతమంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో వైద్యాధికారులు, ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌ఓలు, ఇతరత్రా విభాగాల్లో దాదాపు 348 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో 250 మంది వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ఐదేళ్ల సర్వీసు ఒకేచోట పూర్తయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. వివిధ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెచ్‌ఓడీలకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీ వైద్యవిధాన పరిషత్‌, ఆయుష్‌, డ్రగ్‌ కంట్రోల్‌, ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులంతా ఫిబ్రవరి 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఐదేళ్లు ఒకేచోట సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులు ఆన్‌లైన్‌లో బదిలీ ఆప్షన్‌లు పెట్టుకోకపోయినా బదిలీ చేయనున్నారు. ఫిబ్రవరి 28వ తేదీలోగా పదవీ విరమణ కానున్న ఉద్యోగులకు మినహాయింపునిచ్చారు. మైదాన ప్రాంతాల్లో మూడేళ్లు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లు పనిచేసిన ఉద్యోగులకు ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసినట్లు పరిగణించి బదిలీలకు అవకాశం కల్పించారు. 

 కాంట్రాక్టు ఉద్యోగులకు అన్యాయం...

వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో అదేశాఖలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల బదిలీల ప్రస్తావన లేకపోవడంపై కొంతమంది ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెగ్యులర్‌ ఉద్యోగులను బదిలీ చేస్తున్న ప్రభుత్వం.. వారితో సమానంగా అదే శాఖలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను విస్మరించడం సరికాదని పేర్కొంటున్నారు. జీఓ నెంబరు 27ను రద్దు చేసి అర్హత కలిగిన పారామెడికల్‌ ఉద్యోగులను క్రమబద్దీకరించాలని ఏపీజీసీఎఫ్‌ కో ఛైర్మన్‌ రట్టి శ్యామ్‌సుందర్‌ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-01-29T03:43:43+05:30 IST