దేవ..ఆదాయం

ABN , First Publish Date - 2022-07-02T06:10:29+05:30 IST

దేవ..ఆదాయం

దేవ..ఆదాయం

రెండు జిల్లాల బదిలీల్లో రూ.కోట్లలో ముడుపులు

అయినవారిని అందలమెక్కించిన అధికారులు

ఈవో నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వరకూ అన్నీ అక్రమాలే..

రెండు జిల్లాల పరిధిలో సుమారు రూ.10 కోట్ల చేతివాటం

జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీల్లోనూ అంతే..


దేవదాయ శాఖ బదిలీల్లో పారదర్శకత లోపించింది. జూనియర్‌ అసిస్టెంట్లు మొదలు ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్ల (ఈవో) వరకూ జరిగిన బదిలీల్లో రాజకీయ పైరవీలు రాజ్యమేలగా, కాసులు వర్షం భారీగానే కురిసింది. విజిలెన్స్‌ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అందలమెక్కించి, ఆదాయం బాగున్న ఆలయాలకు పోస్టింగ్‌ ఇవ్వగా, రెండేళ్లు కూడా నిండని ఉద్యోగులను ఆదాయం లేని ఆలయాలకు ఊస్టింగ్‌ ఇచ్చారు. ఈ మొత్తం తంతులో కమిషనర్‌ కార్యాలయం నుంచి డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వరకూ ముడుపులు అందాయన్నది ఉద్యోగ సంఘాల ఆరోపణ. ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోనే సుమారు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లు చేతులు మారాయని తెలుస్తోంది.

- (విజయవాడ-ఆంధ్రజ్యోతి)


బదిలీల్లో అక్రమాల తీరిది..

- మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న లీలాకుమార్‌ను మచిలీపట్నంలోని ఏజే విద్యాపరిషత్‌కు బదిలీ చేశారు. జగ్గయ్యపేట మండలం ముక్త్యాల కోటిలింగాల మహాక్షేత్రం ఈవోగా పనిచేస్తున్న చక్రధరరావును మోపిదేవికి పంపారు. మోపిదేవి ఆలయం ఏసీ క్యాడర్‌కు చెందింది. అక్కడ ఏసీ క్యాడర్‌లో ఉన్న లీలాకుమార్‌ను తొలగించి గ్రేడ్‌-1 కేడర్‌లో ఉన్న చక్రధరరావును నియమించారు. పైగా ఆయనకు మరో ప్రధాన ఆలయమైన మచిలీపట్నంలోని బచ్చుపేట వెంకటేశ్వరస్వామి ఆలయ బాధ్యతలను అప్పగించారు. దీనిని రెగ్యులర్‌ చార్జిగా చూపిస్తూ మోపిదేవి ఆలయానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంత అవసరమేమిటో అధికారులకే తెలియాలి. మోపిదేవిలో పనిచేస్తున్న లీలాకుమార్‌ అక్కడికి వచ్చి మూడేళ్లు కూడా కాలేదు. ఐదేళ్లు పూర్తయిన వారినే బదిలీ చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించలేదు. ఈ వ్యవహారంలో పెద్ద ఎత్తున పైరవీలు, పైసలు పనిచేశాయని తెలుస్తోంది. ఈ పోస్టు ఖరీదు సుమారు రూ.25 లక్షల పైచిలుకేనంటున్నారు. 


- వన్‌టౌన్‌లోని పాత శివాలయంలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్న ఈవో హేమలతను ఇబ్రహీంపట్నం గ్రూప్‌ టెంపుల్స్‌కు మార్చారు. ఆమె స్థానంలో కొత్తపేట సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ఈవోగా పనిచేస్తున్న ఘంటసాల శ్రీనివాస్‌ను నియమించారు. శ్రీనివాస్‌ కృష్ణానది చెంతనే శనైశ్చరస్వామి ఆలయ ఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తు న్నారు. ఆ బాధ్యతలు అలాగే ఉంచారు. వాస్తవానికి ఐదేళ్లలోపు వారిని బదిలీ చేయకూడదన్న నిబంధన ఉన్నా పాటించలేదు. 


- వన్‌టౌన్‌లోని బావాజీమఠం ఈవోగా అదనపు విధులు నిర్వహిస్తున్న సాంబశివరావును అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఉయ్యూరు గ్రూప్‌ టెంపుల్స్‌లో పనిచేస్తున్న సుబ్బారావును నియమించారు. కొత్తపేట సుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఈవోగా రెగ్యులర్‌ బాధ్యతలు అదనంగా ఇచ్చి, బావాజీమఠాన్ని అప్పగించారు. 


- జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్ల బదిలీల్లో పెద్ద ఎత్తున కాసులు చేతులు మారాయనే ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్‌ కేసులు ఉన్నవారికి సైతం మంచి స్థానాల్లో పోస్టింగులు కల్పించడమే దీనికి నిదర్శనం. గుడివాడ వినాయక ఆలయంలో పనిచేస్తున్న పీవీ మురళీని ఉయ్యూరు గ్రూపు ఆలయాలకు బదిలీ చేసిన అధికారులు అక్కడ పనిచేస్తున్న సీహెచ్‌ శ్రీనివాసరావును గుడివాడ వినాయక ఆలయానికి బదిలీ చేశారు. వీరిపై విజిలెన్స్‌ కేసులు ఉన్నాయి. అడ్డగోలు బదిలీలకు ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తక్షణమే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బదిలీల్లో తమకు న్యాయం చేయాలని దేవదాయ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. 



ఎండోమెంట్‌ అధికారుల బదిలీల్లోనూ..

కృష్ణాజిల్లా ఎండోమెంట్‌ అధికారిజి.హరిగోపీనాథ్‌ను బదిలీ చేసి ఆయన స్థానంలో కాకినాడ ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ ఈవోగా ఉన్న డి.సాయిబాబును నియమించారు. హరిగోపీ బాధ్యతలు స్వీకరించి రెండేళ్లు కూడా కాలేదు. కానీ, ఆయన్ను బదిలీ చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎండోమెంట్‌ అధికారిగా పనిచేస్తున్న వి.సత్యనారాయణను బదిలీ చేశారు. ఆయన స్థానంలో విశాఖపట్నంలో పనిచేస్తున్న కె.శాంతిని నియమించారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎండోమెంట్‌ ఆఫీసర్‌ బాధ్యతలతో పాటు నెమలి వేణుగోపాలస్వామి ఆలయ ఈవోగానూ ఆమెను నియమించారు. విశాఖలో పనిచేసే సమయంలో వివాదాస్పదమైన అధికారిణిగా శాంతి పేరొందారు.

Updated Date - 2022-07-02T06:10:29+05:30 IST