దేవదాయశాఖలో బది‘లీలలు’!

ABN , First Publish Date - 2022-06-23T08:25:33+05:30 IST

దేవదాయశాఖలో బది‘లీలలు’!

దేవదాయశాఖలో బది‘లీలలు’!

ఇప్పటికే 2వేల సిఫారసు లేఖలు

అయినా ‘మమ్మల్ని కలవాల్సిందే’

కమిషనరేట్‌ నుంచి ఉద్యోగులకు ఫోన్లు

కాసులు కురిపిస్తున్న బదిలీలు!


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

దేవదాయశాఖలో జరుగుతున్న సాధారణ బదిలీల ప్రక్రియ కాస్తా ‘సిఫారసుల, కాసుల బదిలీలు’గా మారాయి. శాఖలో సుదీర్ఘకాలంగా బదిలీలు లేకపోవడంతో సిఫారసుల లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఈవోలు, ఆలయ ఉద్యోగుల బదిలీల కోసం ఇప్పటివరకూ సుమారు 2వేలకు పైగా సిఫారసు లేఖలు కమిషనరేట్‌కు అందినట్లు తెలిసింది. ఒక్కో ఉద్యోగి ఏకంగా నాలుగైదు సిఫారసు లేఖలు జత చేస్తున్నారు. ఇందులో మంత్రులు, ఎమ్మెల్యేలవే అత్యధికంగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే సిఫారసు లేఖల తెచ్చినా బదిలీల్లో మంచి స్థానాలు కోరే వారు తమను కలవాల్సిందేనంటూ కమిషనరేట్‌లోని కొందరు అధికారులు ఒత్తిడి చేయడం విమర్శలకు దారితీస్తోంది.


పాతుకుపోయారు.. 

రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆలయాల్లో తప్ప మిగిలిన అన్ని ఆలయాల్లో ఈవోలు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ఇక ఆలయ ఉద్యోగులకైతే గతంలో బదిలీలు ఎప్పుడు జరిగాయో కూడా తెలియదు. ఎక్కడివారు అక్కడే ఉండాలనే నిబంధన గతంలో ఉండటంతో ఉద్యోగంలో చేరిన నాటి నుంచి నేటి వరకూ 90శాతానికిపైగా అక్కడే ఉండిపోయారు. దీనివల్ల ఆలయాల్లో నియంతృత్వం పోకడలు, అవినీతి పెరిగిపోయాయని, వారందరినీ బదిలీ చేసి ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సంకల్పించారు. దీంతో 500కుపైగా ఈవోలు, వేల మంది ఉద్యోగులు బదిలీ అయ్యే పరిస్థితి తలెత్తింది. 


సిఫారసు సరే... మాకేంటి?

నిబంధనల ప్రకారం 6సి ఆలయాల ఈవోల వివరాలను అసిస్టెంట్‌ కమిషనర్‌, 6బి ఆలయాల ఈవోల వివరాలను డిప్యూటీ కమిషనర్‌, 6ఎ ఆలయాల వివరాలను పైస్థాయి అధికారులు కమిషనరేట్‌కు సమర్పిస్తారు. ఐదేళ్లు దాటినవారు, వారిపై ఉన్న విచారణల వివరాలు, పనితీరుపై వివరాలు ఇస్తారు. వాటి ఆధారంగా కమిషనర్‌ తుది నిర్ణయంతో బదిలీలు జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఎవరూ కమిషనరేట్‌కు రావాల్సిన అవసరం లేదు. కానీ కమిషనరేట్‌కు వచ్చి తమను కలవాలని ఈవోల వ్యవహారాల చూసి విభాగం నుంచి ఈవోలకు ఫోన్లు వెళ్తున్నాయి. కమిషనరేట్‌కు రాకుండానే బదిలీలు కావాలా? అంటూ కొందరు ఫోన్‌లో అడుగుతున్నారని జిల్లాల్లో ఈవోల మధ్య చర్చ సాగుతోంది. తమను కలవని వారికి సరైన స్థానాలు దక్కవని పరోక్షంగా చెబుతున్నారని, దీంతో కొందరు వచ్చి వారిని ప్రసన్నం చేసుకుంటున్నారని ఉద్యోగులు అంటున్నారు. ఇక ఆలయ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. నిబంధనల ప్రకారం పెద్ద ఆలయాల ఉద్యోగులను పెద్ద ఆలయాలకు, చిన్న ఆలయాల వారిని చిన్న ఆలయాలకే బదిలీ చేయాలి. కానీ కొందరు చిన్న ఆలయాల ఉద్యోగులను జేసీ కేడర్‌, డీసీ కేడర్‌కు పంపుతామని హామీలు ఇస్తున్నారు. దీంతో వేల మంది ఆలయ ఉద్యోగుల బదిలీలు మరో వివాదంగా మారుతుందని దేవదాయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2022-06-23T08:25:33+05:30 IST