ఆర్‌డబ్ల్యూఎస్‌లో బదిలీ వార్‌!

ABN , First Publish Date - 2021-02-26T06:57:58+05:30 IST

గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో పదోన్నతుల వ్యవహారం రచ్చకెక్కింది.

ఆర్‌డబ్ల్యూఎస్‌లో బదిలీ వార్‌!

విజయవాడ జోన్లో నలుగురు సీనియర్‌ అసిస్టెంట్లకు పదోన్నతులు

లీవ్‌ వేకెన్సీలో ఉన్న పోస్టులో కొత్తవారికి అవకాశం

లీవ్‌ నుంచి వచ్చిన సూపరింటెండెంట్‌ ఆగ్రహం

20 ఏళ్లుగా ఆమె ఒకేచోట బాధ్యతలు


గ్రామీణ నీటి సరఫరా సంస్థ (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో పదోన్నతుల వ్యవహారం రచ్చకెక్కింది. పదోన్నతుల ప్రక్రియలో భాగంగా లీవ్‌ వేకెన్సీలో ఉన్న ఓ మహిళా సూపరింటెండెంట్‌ మరో చోటకు బదిలీ కావాల్సి వచ్చింది. దీంతో ఆమె తన పైఅధికారిపై ఈఎన్‌సీకు ఫిర్యాదు చే యటం, ఆమె చర్యలకు వ్యతిరేకంగా ఆ శాఖలోని మహిళా ఉద్యోగులు ఏకం కావడం సంచలనంగా మారింది.


విజయవాడ, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి) : ఆర్‌డబ్ల్యూఎస్‌లో సీనియర్‌ అసిస్టెంట్లు నలుగురికి సూపరింటెండెంట్లుగా విజయవాడ జోన్‌ యూనిట్‌ ఆఫీసర్‌ పదోన్నతులు కల్పించారు. జోన్లో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టులను భర్తీ చేయటానికి ఈ పదోన్నతులు కల్పించారు. సీనియర్‌ అసిస్టెంట్లు ఎం.బేగ్‌ను విజయవాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ సర్కిల్‌కు, కె.మౌనికాకుమారిని ఏలూరు సర్కిల్‌కు, ఆర్‌.వి.బి.టి.సుందరిని కొవ్వూరు డివిజనల్‌ కార్యాలయానికి, కె.రామకృష్ణను విజయవాడ డివిజినల్‌ ఆఫీసుకు సూపరింటెండెంట్లుగా బదిలీ చేశారు. 

ఇదే సమయంలో విజయవాడ ఆర్‌డబ్ల్యూఎస్‌ డివిజనల్‌ ఆఫీస్‌లో పనిచేస్తున్న మహిళా సూపరింటెండెంట్‌ కూడా బదిలీ కావాల్సి వచ్చింది. ఆమె ఆరు నెలలు సెలవు పెట్టి, అమెరికా వెళ్లారు. ఆమెకు లీవ్‌ మంజూరు చేసిన తర్వాత ఆ స్థానంలో ఎవరికీ ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగించలేదు. ఇదే సమయంలో విజయవాడ జోన్‌ పరిధిలో ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్న సూపరింటెండెంట్‌ పోస్టుల భర్తీతో పదోన్నతులకు అవకాశం వచ్చింది. విజయవాడ డివిజనల్‌ ఆఫీసులోని పోస్టు కూడా లీవ్‌ వేకెన్సీలో ఉండటంతో కొత్తవారికి అవకాశం వచ్చింది. ఇక్కడ పనిచేస్తూ సెలవు పెట్టిన మహిళా సూపరింటెంటెండెంట్‌ను కాకినాడ సర్కిల్‌ ఆఫీసుకు బదిలీ చేశారు.  


సూపరింటెండెంట్‌ రాకతో వివాదం  

ఆరు నెలల సెలవు అనంతరం తిరిగి వచ్చిన మహిళా సూపరింటెండెంట్‌ కాకినాడలో బాధ్యతలు స్వీకరించకుండా, తన పై అధికారిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఈఎన్‌సీకి లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె పేర్కొన్న అంశాలను ఖండిస్తూ ఇతర మహిళా ఉద్యోగులు ఎదురు ఫిర్యాదు చేశారు. 


20 ఏళ్లుగా ఇక్కడే 

తనను అన్యాయంగా బదిలీ చేశారని వాపోతున్న మహిళా సూపరింటెండెంట్‌ నిబంధనలకు విరుద్ధంగా విజయవాడలోనే 20 సంవత్సరాలుగా ఒకే పోస్టులో ఉన్నారని, అందువల్లనే ఆమెను బదిలీ చేయాల్సి వచ్చిందని ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్గాలంటున్నాయి. పైగా ఆమె విధుల్లో చేరకుండా అప్‌స్కాండ్‌ అయ్యారని, కనీసం సెలవు కూడా పెట్టలేదని అంటున్నారు. 


వివాదంలోకి ఈఎన్‌సీ కార్యాలయం 

ఈఎన్‌సీ కార్యాలయం నుంచే తిరిగి యథాస్థానంలో పోస్టింగ్‌ తెచ్చుకుంటానని మహిళా సూపరింటెండెంట్‌ శపథం చేసినట్టు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో విజయవాడ లో పనిచేసే ఓ మహిళా అధికారి కూడా ఇదే తరహాలో శపథం చేసి, బదిలీ అయిన చోటకు వెళ్లకుండా, పోస్టింగ్‌ తెచ్చుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై విమర్శలు వచ్చాయి. ఈ మహిళా సూపరింటెండెంట్‌ కూడా అదే తీరుగా వ్యవహరిస్తుండడంతో ఈఎన్‌సీ కార్యాలయం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా ఉంది.

Updated Date - 2021-02-26T06:57:58+05:30 IST