ఏపీసీపై బదిలీ వేటు

ABN , First Publish Date - 2022-07-03T06:20:29+05:30 IST

సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ) డాక్టర్‌ బి.శ్రీనివాసరావుపై బదిలీ వేటుపడింది.

ఏపీసీపై బదిలీ వేటు
శ్రీనివాసరావు

అవినీతి ఆరోపణల ఫలితమే

సమగ్ర విచారణకు  ప్రభుత్వ ఆదేశం

ఒంగోలు(విద్య), జూలై 2 : సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్‌ (ఏపీసీ) డాక్టర్‌ బి.శ్రీనివాసరావుపై బదిలీ వేటుపడింది. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, అక్రమాల నేపథ్యంలో మాతృశాఖకు పంపేందుకు ప్రభుత్వం అనుమతించింది. విచారణకు సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌(ఎస్‌పీడీ)ని ఆదేశించింది. ఏపీసీని తన మాతృస్థానమైన కడప జిల్లా వేంపల్లి వైఎస్సార్‌ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్‌ లెక్చరర్‌గా వెనక్కు పంపిస్తూ ఎస్‌పీడీ కె.వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీచేశారు. ‘ఏపీసీ అవినీతిపై విచారణ’ శీర్షికతో ఆంధ్రజ్యోతిలో జూన్‌ 4న కథనం ప్రచురితమైంది. గతేడాది డిసెంబరు 1న ఏపీసీగా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాసరావు ఏడు నెలలకే అవినీతి ఆరోపణలతో తిరిగి మాతృశాఖకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏపీసీగా డీఈవో విజయభాస్కర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. 


అవినీతి ఆరోపణలివే..

జిల్లాలోని 37 కేజీబీవీల్లో చదువుతున్న 9వేల మంది విద్యార్థుల వద్ద ఐడీకార్డు, బ్యాడ్జి, బెల్ట్‌ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.300 వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. డైరీల పేరుతో ఫ్యాకల్టీల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.100, కేజీబీవీల్లో సెప్టిక్‌ ట్యాంకు క్లీనింగ్‌ పేరుతో ఒక్కొక్కదాని నుంచి రూ.40వేల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులందాయి. దీర్ఘకాలంగా విధులకు గైర్హాజరైన వారి నుంచి భారీమొత్తంలో వసూలు చేసి కనీసం ఉన్నతాధికారులకు తెలియకుండా నిబంధనలకు విరుద్ధంగా విధుల్లో చేర్చుకోవడం. కార్యాలయంలో అనధికారిక వసూళ్లకు ఇద్దరు వ్యక్తులను నియమించడం వంటి వాటిపై పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి.


ఆర్డీవో విచారణ

ఏపీసీపై వచ్చిన ఆరోపణలపై కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ విచారణకు ఒంగోలు ఆర్డీవో విశ్వేశ్వరరావును నియమించారు. ఆయన సెక్టోరల్‌ అధికారులు, కేజీబీవీ స్పెషల్‌ ఆఫీసర్లు తదితరులను పిలిచి విచారించారు. వారందరితో రాతపూర్వకంగా వివరణ తీసుకున్నారు. విచారణలో కొన్ని ప్రాథమిక ఆధారాలు దొరికినట్లు సమాచారం. ఆర్డీవో కలెక్టర్‌కు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏపీసీపై బదిలీ వేటుపడినట్లు సమాచారం. 

Updated Date - 2022-07-03T06:20:29+05:30 IST