30 మంది బదిలీ..!

ABN , First Publish Date - 2022-08-11T05:50:57+05:30 IST

పొరుగు జిల్లాకు కొందరు పోలీసు సిబ్బందిని బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది.

30 మంది బదిలీ..!

పొరుగు జిల్లాకు పోలీసు సిబ్బంది

జాబితా తయారీలో నిబంధనలు తూచ

ఉత్తర్వులు ఇవ్వకనే.. ఆ జిల్లా నుంచి వేతనం

లబోదిబోమంటున్న హెచసీలు, కానిస్టేబుళ్లు

అనంతపురం క్రైం, ఆగస్టు 10: పొరుగు జిల్లాకు కొందరు పోలీసు సిబ్బందిని బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా పునర్విభజన నేపథ్యంలో జిల్లాలో పోలీసులు ఎక్కువగా ఉన్నారని చూపించి, శ్రీసత్యసాయి జిల్లాకు బదిలీ చేశారు. కానీ బదిలీ ఉత్తర్వులు ఇవ్వలేదు. 24 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లతో జాబితా సిద్ధం చేశారు. టెరిటోరియల్‌ పోస్టుల విభాగంలో వారిని కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. జాబితాలో ఉన్న సిబ్బంది శ్రీసత్యసాయి జిల్లా లోకల్‌(స్థానికత) కాదు. జాబితాను ఏ ప్రాతిపదికన తయారు చేశారో పోలీస్‌ శాఖ అధికారులకు స్పష్టత లేదు. డీపీఓలో జాబితా సిద్ధం చేసిన సిబ్బంది ఈ విషయంలో కీలకపాత్ర పోషించారని సమాచారం. మరో జిల్లాకు సిబ్బందిని పంపాలంటే నిబంధనలు పాటించాలి. సీనియార్టీ, లేదా రివర్స్‌ సీనియార్టీ విధానంలోనో జాబితాను సిద్ధం చేయాలి. కానీ ఇక్కడ ఆ విధానం పాటించలేదు. ఇష్టారాజ్యంగా సిబ్బందిని ఎంపిక చేసి చేతులు దులిపేసుకుంటున్నారని సమాచారం.


పొమ్మనలేక పొగ..

జిల్లాల పునర్విభజన తరువాత అనంతపురం జిల్లా నుంచి పోలీస్‌ శాఖలో విభాగాల వారిగా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బందిని విభజించి, కేటాయించారు. ఇప్పుడు మరో 30 మందిని కేటాయించడం చర్చనీయాంశమైంది. అనంతపురం జిల్లాలో ఎంతమంది ఎక్కువ ఉన్నారని రాష్ట్రస్థాయి అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. దీంతో 24 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, ఆరుగురు కానిస్టేబుళ్లు ఎక్కువగా ఉన్నారని ఇక్కడి అధికారులు చెప్పినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో హడావుడిగా నెలరోజుల క్రితం ఓ జాబితాను సిద్ధం చేసి పంపినట్లు తెలిసింది. కానీ జాబితా తయారీలో తమ అభిప్రాయం కూడా అడగలేదని బాధిత సిబ్బంది వాపోతున్నారు. ‘పొరుగు జిల్లాకు కేటాయించాం.. వెళ్లండి..’ అని ఉత్తర్వులు కూడా రాలేదని అంటున్నారు. కానీ ఇప్పటికే శ్రీసత్యసాయి జిల్లా నుంచి వేతనాలు తీసుకుంటున్నట్లు చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎక్కడ విధులు నిర్వర్తించాలో అర్థం కావడం లేదని, పొమ్మన లేక పొగబెట్టే వ్యవహారం జరుగుతోందని బాధితులు అంటున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులను కలిశామని తెలిపారు. నిబంధనల మేరకు జాబితాను సిద్ధం చేసి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. 


అక్కడికి వెళ్తే ఇక్కట్లే..

తాము శ్రీసత్యసాయి జిల్లా వాసులం కాదని, అక్కడికి వెళ్తే తమ పిల్లలకు నాన లోకల్‌ ముద్ర పడుతుందని, వారి చదువుల విషయంలో ఇక్కట్లు తప్పవని బాధితులు వాపోతున్నారు. ఇంకా అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తోందని అంటున్నారు. నిబంధనల మేరకు ప్రత్యేకంగా సీనియార్టీ జాబితా, లేదా జూనియర్స్‌ విభాగం నుంచి ఎవరెవరు అర్హులో గుర్తించి బదిలీ చేయాలని అంటున్నారు. ఇష్టారాజ్యంగా నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. హెచఆర్‌ఏ అనంతపురం జిల్లాలో 16 శాతం వర్తిస్తుండగా, శ్రీసత్యసాయి జిల్లాలో 10 శాతం మాత్రమే ఇస్తున్నారని, ఈ కారణంగా ప్రతి నెలా రూ.3,500 కోత పడుతుందని అంటున్నారు.

Updated Date - 2022-08-11T05:50:57+05:30 IST