తర్జనభర్జనలు!

ABN , First Publish Date - 2022-07-01T05:46:17+05:30 IST

అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు.

తర్జనభర్జనలు!

జాబితాల్లో మార్పులు.. చేర్పులతో అధికారుల అవస్థలు

ఒకే ప్రాంతంలో ఇద్దరు, ముగ్గ్గురికి ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు

ఏలూరు జిల్లాకు వెళ్లేందుకు ఉద్యోగులు, అధికారుల విముఖత

కృష్ణాజిల్లాకు వచ్చేందుకే సుముఖత

అధికారులు, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ ఇంకా కొలిక్కి రాలేదు. జూన్‌ 30వ తేదీ నాటికి బదిలీల జాబితాలు ప్రకటించాల్సి ఉన్నా.. ఒకే పోస్టుకు ప్రజాప్రతినిధుల నుంచి అనేక సిఫార్సు లేఖలు రావడంతో బదిలీల వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. ఆఖరు నిమిషం వరకు ఈ జాబితాలు తయారు కాలేదు.  

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

బదిలీల కమిటీకి కృష్ణా జిల్లా కలెక్టర్‌ చైర్మన్‌గా, ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల కలెక్టర్‌లు కన్వీనర్లుగా ఉన్నారు. రెండు రోజుల క్రితం మూడు జిల్లాల కలెక్టర్లు, జేసీలు సమావేశమయ్యారు. బదిలీల అంశంపై తుది నిర్ణయం తీసుకుంటారని ఉద్యోగ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. వివిధ కారణాలతో ఏలూరు జిల్లాకు అధికారులు, ఉద్యోగులు వెళ్లేందుకు అసక్తి చూపకపోవడంతో  ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోవడంలో జాప్యం  జరిగింది. ఎంతమంది బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు? ఎంతమందికి బదిలీలు ఉంటాయి? అని అధికారులను అడిగితే ఇంకా కొలిక్కిరాలేదనీ,  ఈ వివరాలు అడగవద్దనీ చెబుతున్నారు.

  ఒకే పోస్టుకు ఎక్కువ సిఫార్సు లేఖలు 

జిల్లాలో ఉద్యోగులు, అధికారుల బదిలీలు ప్రజాప్రతినిధుల సిఫార్సులేఖల ఆధారంగానే జరుగుతాయని అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యోగులు, అధికారులకు సిఫార్సు లేఖలు ఇవ్వడంతో ఏ లేఖను పరిగణనలోకి తీసుకోవాలో జిల్లాస్థాయి అధికారులకు అర్థంకాని స్థితి. తహసీల్దార్లు, ఇంజనీర్లు, పంచాయతీ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, ఇతర ఉద్యోగులకు ఒక్కో శాసనసభ్యుడు ఇద్దరు, ముగ్గురు అధికారులు, ఉద్యోగులకు ఒకే ప్రాంతానికి బదిలీ చేయాలని సిఫార్సు లేఖలు ఇవ్వడంతో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అధికారులు చెబుతున్నారు. గురువారం మచిలీపట్నం కలెక్టరేట్‌కు ఎన్టీఆర్‌, ఏలూరు జిల్లాల అధికారులు   వచ్చి సంప్రదింపులు జరిపారు. ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలతో గంటకో జాబితాను తయారు చేయాల్సి రావడంతో ఏ జాబితాను తుది జాబితాగా ప్రకటించాలనే అంశంపై గందరగోళం నెలకొందని ఆయా యూనియన్‌ల నాయకులు చెబుతున్నారు.    

 ఏలూరు వెళ్లేందుకు విముఖత

 ఉమ్మడి కృష్ణాజిల్లాలో పనిచేసిన ఉద్యోగులు ఏలూరు జిల్లాకు బదిలీపై వెళ్లేందుకు సుముఖత చూపడం లేదు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు.  ఎన్టీఆర్‌ జిల్లా నుంచి కృష్ణా జిల్లాకు వచ్చేందుకు ఎక్కువ మంది తహసీల్దార్లు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లాకు వెళ్లేందుకు తహసీల్దార్లు తక్కువ మంది దరఖాస్తు చేసుకు న్నారు. ఆ జిల్లాలో తహసీల్దార్లను బదిలీచేస్తే, అక్కడ ఏర్పడిన ఖాళీలను ఎలా భర్తీ చేయాలని, ఈ కారణంలో ఎన్టీఆర్‌ జిల్లాలో ప్రస్తుతం పనిచేస్తూ బదిలీకోసం దరఖాస్తు చేసుకున్న వారిని బదిలీ చేసేది లేదని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ పట్టుబట్టారని అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. 

  ఎంపీడీవోల బదిలీల

 జాబితాలు రెడీ అయినా..

 ఉమ్మడి జిల్లాలో 15 మంది ఎంపీడీవోలు బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ జాబితాలు సిద్ధమైనా విడుదల చేయలేదు. కలెక్టర్‌ అనుమతి తరువాతనే తుది జాబితాలను విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు.  జిల్లా పంచాయతీ కార్యాలయంలో మహిళా అటెండరును ఏలూరు జిల్లా నుంచి మచిలీపట్నం తీసుకువచ్చేందుకు, మచిలీపట్నంలో పనిచేస్తున్న ఉద్యోగిని ఏలూరు జిల్లాకు బదిలీ చేసేందుకు కార్యాలయ సిబ్బంది అతిగా వ్యవహరించడంతో ఈ అంశం గురువారం వివాదాస్పదమైంది. 


Updated Date - 2022-07-01T05:46:17+05:30 IST