బదిలీ బేరం

ABN , First Publish Date - 2022-06-16T06:55:55+05:30 IST

జలవనరుల శాఖలో ఫెవికాల్‌ వీరులు పైరవీలు ప్రారంభించారు. బదిలీల నేపథ్యంలో ఇంజనీర్లు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

బదిలీ బేరం

అక్కడ ఉండాలని కొందరు

ఎక్కడికో వెళ్లాలని మరికొందరు

ప్రజా ప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ

ఖర్చు పెట్టుకునేందుకూ సంసిద్ధత

ఇరిగేషన శాఖలో భారీగా పైరవీలు

జలవనరుల శాఖలో ఫెవికాల్‌ వీరులు పైరవీలు ప్రారంభించారు. బదిలీల నేపథ్యంలో ఇంజనీర్లు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. జలవనరుల శాఖలో ప్రధానంగా హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనంతపురం సర్కిల్‌, హెచ్చెల్సీ, మైనర్‌ ఇరిగేషన, క్వాలిటీ కంట్రోల్‌ విభాగాలు ఉన్నాయి. వీటిలో జిల్లా స్థాయిలో నలుగురు ఇంజనీర్లు, డివిజన స్థాయిలో 20 మంది వరకు, సబ్‌ డివిజన స్థాయిలో 60 మంది వరకు ఇంజనీర్లు ఉన్నారు. జేఈ స్థాయిలో 120మంది వరకు పనిచేస్తున్నారు. అదే స్థానంలో కొనసాగేందుకు, కోరిన స్థానం కోసం పలువురు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. బాగా లెక్కలొచ్చే చోటుకు వెళ్లడానికి ‘ఖర్చు’ పెట్టుకోవడానికి కూడా వెనుకాడడం లేదు. ఓ ఇంజనీరు కాంట్రాక్టర్‌గా అవతారమెత్తి, అదే స్థానంలో ఉండాలని, మరో ఇంజనీరు బాగా ఆర్థిక లావాదేవీలు జరిగే చోటకు వెళ్లాలని ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 

అనంతపురం క్లాక్‌టవర్‌


హంద్రీనీవాలో..

- హంద్రీనీవా సుజల స్రవంతి పథకం అనంతపురం సర్కిల్‌లో 5 డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 20 సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన ఇంజనీరు కడపకు బదిలీ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తిన మరో ఈఈ.. అదే స్థానంలో కొనసాగాలని ఓ ప్రజాప్రతినిధి చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఫలించకపోతే ముడుపులు ఇచ్చేందుకూ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. 

- గుంతకల్లు డివిజన కోసం మైనర్‌ ఇరిగేషనలో పనిచేస్తున్న ఓ ఇంజనీరు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. 5 డివిజన్లకు గాను మూడు డివిజన్లు, ఒక డిప్యూటీ ఎస్‌ఈ పోస్టుకు కొత్త ఇంజనీర్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం 20 మంది డీఈలకు గాను 11 మందికి స్థానచలనం తప్పదని తెలుస్తోంది. 65 మంది జేఈలకు గాను 29 మంది బదిలీ తప్పదని సమాచారం. ఉద్యోగులు, ఇంజనీర్లు బదిలీ ఆప్షన్లు ఇచ్చారు.


హెచ్చెల్సీలో ప్రయత్నాలు..

తుంగభద్ర ఎగువకాలువ (టీబీపీ హెచ్చెల్సీ) ఇంజనీర్లు, ఉద్యోగులు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ 7 డివిజన్లు, 28 సబ్‌ డివిజన్లు ఉన్నాయి. ఇందులో ఒక ఈఈ మాత్రమే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. ఇటీవలే ఆయన గుండె ఆపరేషన చేయించుకున్నారు. దీంతో అదే స్థానంలో కొనసాగే పరిస్థితి కనబడుతోంది. హెచ్చెల్సీ లోక్‌ డివిజనలో ఓ ఉద్యోగి ఎనిమిదేళ్లుగా తిష్టవేశారు. ఇప్పుడైనా కదిలిస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఇంజనీర్లు, ఉద్యోగులు బదిలీలకు ఆప్షన్లు ఇచ్చారు. 

- మరో కీలక ఇంజనీరు హంద్రీనీవాలో ప్రధాన స్థానం కోసం ప్రజాప్రతినిధిని సంప్రదించినట్లు తెలుస్తోంది. అక్కడ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చిన ఆ ఇంజనీరు తిరిగి అక్కడికే వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. బదిలీ ప్రయత్నాలు తీవ్రతరం చేశారని ఆశాఖలో చర్చించుకుంటున్నారు. మరో డివిజనలో ఉన్న ఓ ఇంజనీరు అదే స్థానంలో కొనసాగాలని ఓ మంత్రి ద్వారా సిఫారసు చేయించినట్లు సమాచారం. ఓ డివిజన ఈఈ జిల్లా అధికారి ఎఫ్‌ఏసీ బాధ్యతల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


మైనర్‌ ఇరిగేషనలో..

బదిలీల కోసం మైనర్‌ ఇరిగేషనలో ఉద్యోగులు, ఇంజనీర్లు ముడుపుల వ్యవహారానికి తెరలేపారు. ఈ విభాగంలో ప్రధాన అధికారిగా ఉన్న ఓ ఇంజనీరు, ఇంజనీర్లు, ఉద్యోగుల నుంచి ముడుపులు తీసుకుని, కోరుకున్న చోటకు బదిలీ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఆ అధికారి స్థానం పదిలమా? లేక బదిలీపై వెళ్తారా? అన్న చర్చ జరుగుతోంది. ఈ కారణంగా ఇంజనీర్లు, ఉద్యోగులు ఆ అధికారిని నమ్మాలా వద్దా అనే ఆలోచనలో పడ్డారు. 

Updated Date - 2022-06-16T06:55:55+05:30 IST