ట్రాన్స్‌కో.. మేలుకో!

ABN , First Publish Date - 2022-05-16T05:02:30+05:30 IST

ట్రాన్స్‌కో.. మేలుకో!

ట్రాన్స్‌కో.. మేలుకో!
పర్వత్‌పల్లిలో కూలిన ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె

  • పర్వత్‌పల్లిలో కూలిన ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె 
  • పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు, సిబ్బంది
  • ఇప్పటికే పలుమార్లు కరెంట్‌ షాక్‌తో పశువుల మృత్యువాత 
  • గ్రామస్థులకూ పొంచి ఉన్న ముప్పు

బషీరాబాద్‌, మే 15: ట్రాన్స్‌కో సిబ్బంది, అధికారులు నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనడానికి మచ్చుతునక ఈ ఫొటో. పర్వత్‌పల్లిలో ఊరి బావి సమీపంలో పానాది పక్కనున్న ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె సగానికిపైగా కూలింది. ట్రాన్స్‌ఫార్మర్‌ గద్దె శిథిలమై కూలే స్థితిలో ఉన్నా దాన్ని అలాగే నడిపిస్తున్నారు. గద్దె రాళ్లు ఎక్కడికక్కడ ఊడి లక్షలు విలువ చేసే ట్రాన్స్‌ఫార్మర్‌ సైతం కింద పడే పరిస్థితి ఉన్నా స్థానిక హెల్పర్‌గానీ, ఏఈ, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌గానీ పట్టించుకోవడం లేదు. పశువులైనా, మనుషులైనా అటు వైపు వెళ్తే ప్రమాదానికి గురవడం ఖాయం. ట్రాన్స్‌ఫార్మర్‌ కిందపడి ధ్వంసం అయితే రైతులకు కరెంట్‌ సరఫరా నిలిచిపోతుంది. రైతులు, మహిళా కూలీలు రోజూ దీని పక్క నుంచే పొలాలకు పోతుంటారు. ఇదే ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద కరెంట్‌ షాక్‌తో పలుమార్లు పశువులు మృతిచెందిన సంఘటనలూ ఉన్నాయని రైతులు చెప్పారు. ఇంత ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను వదిలేయడం సరికాదన్నారు. వానకాలం నెత్తిమీదికొచ్చిన ఈ తరుణంలోనైనా ఏఈ/డీఈ స్పందించి ట్రాన్స్‌ఫార్మర్‌కు కొత్త గద్దెను కొంచెం ఎత్తులో నిర్మించాని రైతులు కోరుతున్నారు.

Updated Date - 2022-05-16T05:02:30+05:30 IST