ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

ABN , First Publish Date - 2022-08-17T04:49:16+05:30 IST

కాంట్రాక్టు బిల్లుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఓ ట్రాన్స్‌కో ఏఈ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది.

ఏసీబీకి చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ
లంచం తీసుకుంటూ పట్టుబడిన సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు ఏఈ గోవిందరాజు

హుజూర్‌నగర్‌, ఆగస్టు 16 : కాంట్రాక్టు బిల్లుకు సంబంధించి లంచం తీసుకుంటుండగా ఓ ట్రాన్స్‌కో ఏఈ ఏసీబీకి చిక్కారు. ఈ సంఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల ఇన్‌చార్జి ఏసీబీ డీఎస్పీ కృష్ణాగౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మేళ్లచెర్వు మండలం కందిబండకు చెందిన రాజేష్‌ తన అక్క అయిన తిరుపతమ్మ పేరు మీద కాంట్రాక్ట్‌ లైసెన్స్‌ తీసుకుని ఎస్‌వీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో విద్యుత్‌శాఖ పనులు నిర్వహిస్తున్నాడు. 23 పనులకు సంబంధించి సుమారు రూ.13లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. కాగా, వాటి కోసం మేళ్లచెర్వు ఏఈ గోవిందరాజును కలిశాడు. 3శాతం కమీషన్‌ కింద రూ.54వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, మూడునెలల క్రితం రూ.25 వేలు ఇచ్చాడు. అయినా బిల్లులు మంజూరు చేయించకపోవడంతో తిరిగి ఏఈని ప్రాథేయపడినా మొత్తం డబ్బులిస్తేనే బిల్లులు చేస్తానని చెప్పడంతో రాజేష్‌ ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారుల సూచన మేరకు రాజేష్‌ రూ.29వేల నగదు తనవద్ద ఉంచుకుని మంగళవారం ఉదయం ఏఈ గోవిందరాజుకు ఫోన్‌ చేశాడు. ఆ సమయంలో హుజూర్‌నగర్‌లోని డివిజనల్‌ ఇంజనీరింగ్‌ కార్యాలయంలో సమావేశంలో ఉన్నానని, గంట తరువాత కోదాడకు వస్తానని ఏఈ చెప్పారు. సమావేశ అనంతరం కోదాడకు వెళ్తుండగా పట్టణంలోని మార్గమధ్యంలో ఎల్‌ఐసీ కార్యాలయం వద్ద రాజేష్‌ ఏఈని కలిశాడు. రూ.29వేల నగదును తన కారు డాష్‌బోర్డులో పెట్టాలని సూచించగా, రాజేష్‌ వెంటనే నగదును కారులో పెట్టాడు. అదే సమయంలో అతడిని అనుసరిస్తున్న ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగదును స్వాధీనం చేసుకుని, ఏఈని అరెస్టు చేయడంతో పాటు కారును సీజ్‌ చేశారు. అక్కడి నుంచి ఏఈని తీసుకువచ్చి హుజూర్‌నగర్‌లోని డీఈ కార్యాలయంలో సుమారు 4గంటల పాటు విచారించారు. మేళ్లచెర్వు మండలంలో ఎస్‌వీ ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో చేసిన పనులకు సంబంధించి పూర్తి వివరాలు, మండలంలోని ఇతర కాంట్రాక్టర్లు చేసిన పనుల వివరాలను సేకరించారు. కాంట్రాక్టు బిల్లులు మంజూరులో వేధింపులకు గురిచేయడం, డబ్బులు డిమాండ్‌ చేయడంతో పాటు బిల్లులు ఆలస్యం చేసి కావాలనే కాంట్రాక్టర్‌ను ఏఈ ఇబ్బందులకు గురిచేశాడని డీఎస్పీ తెలిపారు. రాజేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పూర్తివిచారణ చేయనున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఏఈ గోవిందరాజును ఏసీబీ కోర్టుకు హాజరుపరుస్తామన్నారు. 



Updated Date - 2022-08-17T04:49:16+05:30 IST