Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుండె జబ్బు ముదిరిపోయి హై రిస్కులో ఉన్నవారికి గుడ్ న్యూస్!

ఆంధ్రజ్యోతి(21-09-2021)

పెద్ద గుండెకు చిన్న చికిత్స!

గుండె సర్జరీ అనగానే పెద్దల గుండె గుభేలుమంటుంది! ఈ వయసులో ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని తట్టుకోగలనో, లేనో అనే భయం వారిలో సహజం! అయితే సర్జరీకి వీలు పడని, హై రిస్క్‌ హృద్రోగులైన పెద్దలకు...ఇప్పుడొక అత్యాధునిక చికిత్సా విధానం అందుబాటులోకొచ్చింది. అదే... ట్రాన్స్‌ క్యాథెటర్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌... ‘టావీ’!దీన్లోని ప్రయోజనాల గురించి వైద్యులు ఇలా వివరిస్తున్నారు.


గుండెలోని నాలుగు కవాటాల్లో ప్రధానమైనది బృహద్ధమని... అయోర్టిక్‌ వాల్వ్‌. శరీరానికి మంచి రక్తాన్ని పంప్‌ చేసే ఈ కవాటంలో క్యాల్షియం పేరుకుపోయి, ఇరుకుగా మారుతుంది. వయసు పైబడడం, రుమాటిక్‌ ఫీవర్‌తో హార్ట్‌ డిసీజ్‌, పుట్టుకతోనే వాల్వ్‌లో లీఫ్‌లెట్‌ సమస్యలు కలిగి ఉండడం... ఈ కారణాల వల్ల ఈ కవాటం దెబ్బ తింటుంది. ఈ పరిస్థితే అయోర్టిక్‌ స్టెనోసిస్‌. ఫలితంగా ఆయాసం, ఛాతీలో నొప్పి, తల తిరుగుడు లాంటి లక్షణాలు మొదలవుతాయి. లక్షణాలు కనిపించిన వెంటనే ఈ సమస్యకు చికిత్స అందించడం అవసరం. ఈ రుగ్మతను పూర్వం ఓపెన్‌ హార్ట్‌ సర్జరీతో మాత్రమే సరిదిద్దేవారు.


అయితే ఛాతీని తెరచి చేసే ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని పెద్దల శరీరాలు తట్టుకోలేకపోవచ్చు. గుండె జబ్బు ముదిరిపోయి హై రిస్క్‌కు చేరుకున్న కొందరు పెద్దలకు కూడా ఈ రకమైన సర్జరీ చేసే వీలుండదు. ఇలాంటప్పుడు ఛాతీ తెరిచి, నేరుగా గుండెను చేరుకోకుండా, డొంక తిరుగుడు దారిలో గుండెను చేరుకోవలసి ఉంటుంది. ఇందుకోసం కనుగొన్న ప్రక్రియే ట్రాన్స్‌ క్యాథెటర్‌ అయోర్టిక్‌ వాల్వ్‌ ఇంప్లాంటేషన్‌... ‘టావీ’!


జబ్బు ముదిరేది ఇలా...

నిరంతర రక్తప్రసరణతో రక్తనాళాల మీద ఒత్తిడి ఏర్పడుతుంది. కాలక్రమేణా ఈ పరిస్థితి రక్తనాళాలను బలహీనపరిచి, కుచించుకుపోయేలా చేసి, రక్తప్రవాహం ద్వారా క్యాల్షియం పేరుకునేలా చేస్తుంది. పెద్ద వయస్కుల్లో పదేళ్ల వ్యవధిలోనే అయోర్టిక్‌ కవాటం క్రమేపీ ఇరుకుగా మారి కవాటం మార్పిడి చేయవలసిన పరిస్థితి తలెత్తుతుంది. కవాటం ఇరుకుగా మారుతున్న ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలూ కనిపించవు. ఇలా మైల్డ్‌ నుంచి మోడరేట్‌ దశకు చేరుకున్నప్పుడు కేవలం శ్రమతో కూడిన పనులు చేస్తున్నప్పుడు మాత్రమే ఆయాసం, గుండె వేగం విపరీతంగా పెరగడం లాంటి లక్షణాలు మొదలవుతాయి.


ఈ దశలో మందులతో, రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటూ, జీవనశైలి మార్పులను అనుసరిస్తూ, వ్యాధి ముదిరే వేగాన్ని నియంత్రించుకోవచ్చు. లక్షణాలు తీవ్రమైతే అత్యవసరంగా సర్జికల్‌ (ఓపెన్‌ హార్ట్‌) లేదా నాన్‌ సర్జికల్‌ (టావీ) ప్రక్రియలతో కవాటాన్ని మార్చుకోవలసి ఉంటుంది. అయితే లక్షణాలు బయల్పడడానికంటే ముందే, కవాటం దెబ్బతినే వీలున్న విషయాన్ని కనిపెట్టడం కోసం, 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ క్రమం తప్పక గుండె పరీక్షలు చేయించుకుంటూ గుండె ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలి.


కాలి ద్వారా గుండెకు...

టావీ ప్రక్రియ కోసం వైద్యులు ప్రధానంగా కాలి రక్తనాళాన్ని ఎంచుకుంటారు. యాంజియోప్లాస్టీ మాదిరిగా కాలి రక్తనాళం నుంచి క్యాథెటర్‌ను గుండె దగ్గరకు చేర్చి, క్యాల్షియం డిపాజిట్‌తో ఇరుకుగా మారిన కవాటంలోకి బెలూన్‌ను వ్యాకోచింపజేసి, మార్గాన్ని వెడల్పు చేసి, ఆ ప్రదేశంలో ఇంప్లాంట్‌ను అమర్చుతారు. ఇంప్లాంట్‌ సరిగ్గా ఇమిడిపోయిందని నిర్థారించుకున్న తర్వాత క్యాథెటర్‌ను వచ్చిన మార్గంలోనే వెనక్కి తీసుకువచ్చి, రక్తనాళం ద్వారా బయటకు తీసేస్తారు. ఈ ప్రకియ కోసం కాలి దగ్గర చేసిన రంథ్రాన్ని చిన్న కుట్టుతో మూసేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం ఒకటి నుంచి రెండు గంటల్లోనే ముగుస్తుంది. 


చిన్న కోత, తక్కువ మత్తు

ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ మాదిరిగా ఛాతీని తెరిచే పని ఉండదు కాబట్టి, టావీలో రోగి త్వరగా కోలుకోగలుగుతాడు. రక్త నష్టం ఎంతో తక్కువ. తక్కువ మత్తుతో కూడిన కాన్షియస్‌ సెడేషన్‌లో రోగి సర్జరీ అసాంతం మెలకువగా ఉంటాడు. కాబట్టి వెంటిలేటర్‌ అవసరం ఉండదు. కోత పెట్టిన చోట ఒకటి లేదా రెండు కుట్లు మాత్రమే పడతాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కోలుకోవడానికి రోజులు, నెలల సమయం పట్టే ఓపెన్‌ సర్జరీ కంటే టావీ ఎంతో సౌకర్యవంతమైనది, సురక్షితమైనదని చెప్పవచ్చు.

వేర్వేరు దారుల్లో...

నూటికి 90శాతం మందిలో కాలి దగ్గరి రక్తనాళం ద్వారానే గుండెకు చేరుకునే మార్గాన్ని వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే ఆ మార్గం మొత్తం ఎటువంటి అడ్డంకులు, వంపులు లేకుండా క్యాథెటర్‌ ప్రయాణానికి వీలుగా వెడల్పుగా ఉండాలి. అలా కాకుండా వంపులు ఎక్కువగా ఉండి, క్యాల్షియం అడ్డంకులు ఉన్నా, రక్తనాళం చుట్టుకొలత 5 మిల్లీమీటర్లే ఉన్నా టావీలో ఎంచుకునే కవాటం, టావీ ప్రక్రియ మార్గం మారుతుంది.


కాలి ద్వారా వీలుపడనప్పుడు బాహుమూలల్లోని రక్తనాళం ద్వారా, అదీ వీలుపడకపోతే ఛాతీ ఎముక గుండా, అంతిమంగా నేరుగా గుండెలో నుంచి క్యాథెటర్‌ను పంపడం ద్వారా కృత్రిమ కవాటాలను అమర్చే వీలుంది. రక్తనాళం చుట్టుకొలత 7 మిల్లీమీటర్లు ఉండీ, దారి వంపులు, అవరోధాలు లేకుండా సాఫీగా ఉంటే కాలి ద్వారానే ప్రక్రియ ముగుస్తుంది. అయితే ఎవరికి ఏ రకమైన ఇంప్లాంట్‌, ఏ మార్గం ద్వారా అనేది కొన్ని పరీక్షల ద్వారా టావీ ప్రక్రియకు ముందుగానే వైద్యులు నిర్థారిస్తారు.


ఈ మందులు తప్పనిసరి

ఎటువంటి గుండె సర్జరీ చేసినా, యాంటీ ప్లేట్‌లెంట్‌ మందులు వాడిన విధంగానే, టావీ చేయించుకున్న తర్వాత కూడా ఈ మందులు జీవితకాలం వాడుకోవలసి ఉంటుంది. అయితే రక్తం పలుచనయ్యే మందులు వాడుకోవలసిన అవసరం ఉండదు. 


మనలోనే ఎక్కువ ఎందుకంటే...

మన భారతీయులం జన్యుపరంగా గుండె జబ్బుల ప్రమాదం కలిగి ఉన్నవాళ్లం. పైగా మనకు అన్నం ఎక్కువగా తినే అలవాటు. వ్యాయామం పట్ల ఆసక్తి తక్కువ. మధుమేహం, అధిక రక్తపోటు కూడా మనలో ఎక్కువే! మరీముఖ్యంగా రక్తనాళాలను కుంచింపజేసే ధూమపానుల సంఖ్య కూడా మనలోనే ఎక్కువ. కాబట్టే గుండె జబ్బుల బారిన పడేవాళ్లతో పాటు, చిన్న వయసులోనే గుండె జబ్బులు తెచ్చుకుంటున్న యువత సంఖ్య పెరుగుతోంది.


ఈ పరిస్థితి మెరుగవ్వాలంటే పిండిపదార్థాలు తక్కువగా పీచు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. వేపుళ్లు, కొవ్వులు తగ్గించి, కాలానుగుణంగా పండే పండ్లను కనీసం వారంలో మూడు రోజులైనా తింటూ ఉండాలి. మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉంటూ, రోజుకు కనీసం 30 నుంచి 45 నిమిషాలకు తగ్గకుండా వ్యాయామం చేయాలి. మానసిక ఒత్తిడిని అదుపులో ఉంచుకుంటూ, అధిక రక్తపోటు, మధుమేహాలను మందులతో నియంత్రణలో ఉంచుకుంటూ ఉండాలి.

టావీ ఎవరికి?

టావీ... ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ తట్టుకోలేని, హైరిస్క్‌ రోగులకు ఉద్దేశించినది. అయితే రక్తస్రావం లేకపోవడం, కోలుకునే సమయం తక్కువగా ఉండడం లాంటి సర్జరీలో ఉన్న సౌకర్యాలపరంగా అంతకంటే తక్కువ వయస్కులు (55 ఏళ్లు) కూడా సర్జరీ పట్ల మొగ్గు చూపుతున్న పరిస్థితి. అలాగని కవాటం డ్యామేజీ అయిన ప్రతి ఒక్కరికీ ఈ సర్జరీ చేసే వీలుండదు. టావీ ఇంప్లాంట్‌ జీవిత కాలం తక్కువ కాబట్టి 55 ఏళ్ల కంటే తక్కువ వయసున్న హృద్రోగులకు, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీతో మెకానికల్‌ వాల్వ్‌ అమర్చక తప్పదు. 


వీళ్లే అర్హులు!

రుమాటిక్‌ హార్ట్‌ డిసీజ్‌లో భాగంగా స్టెనోసిన్‌కు గురైన వారూ అయోర్టిక్‌ స్టెనోసి్‌సకు గురైన యుక్తవయస్కులు టావీకి అనుర్హులు. కేవలం వయసు పైబడడం మూలంగా కవాటాలు డ్యామేజీ అయి, స్టెనోసిన్‌ తలెత్తిన, 65 ఏళ్లు దాటిన పెద్దలు మాత్రమే టావీకి అర్హులు.


ఇంప్లాంట్‌ ఖరీదు

రెండు రకాల అమెరికన్‌ వాల్వ్‌ల ధర 21 నుంచి 22 లక్షలు. స్వదేశీ కంపెనీలు తయారు చేస్తున్న రెండు రకాల కవాటాల్లో ఒకటి 9 లక్షలు, మరొకటి 12 లక్షలు ధర పలుకుతున్నాయి. ఈ ధరకు సర్జరీ ఖర్చులు అదనం. 


ఇది బయలాజికల్‌ వాల్వ్‌

టావీ ప్రక్రియలో బయలాజికల్‌ వాల్వ్‌ను ఉపయోగిస్తారు. ఇవి మనుష్య కణజాలాన్ని పోలిన పంది లేదా ఆవు నుంచి సేకరించిన గుండె కణజాలంతో తయారవుతాయి. కాబట్టి వీటి వల్ల దుష్ప్రభావాలు తక్కువ. శరీరంలో ఇమిడిపోయే ఈ కవాటాల జీవిత కాలం ఎనిమిది నుంచి పదేళ్లు. అయితే వాల్వ్‌ జీవిత కాలం ముగిసిన తర్వాత తిరిగి రెండోసారి కూడా ఇదే ప్రక్రియను అశ్రయించి కవాటాన్ని మార్చుకోవచ్చు. ఓపెన్‌ హార్ట్‌ సర్జరీలో ఉపయోగించే మెకానికల్‌ వాల్వ్‌ జీవిత కాలం పాతికేళ్లు. 

డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి

ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌,

సన్‌షైన్‌ హాస్పిటల్‌, సికింద్రాబాద్‌.

(ఛైర్మన్‌ అండ్‌ కోర్స్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ ఫోరం, హైదరాబాద్‌)


Advertisement
Advertisement

ప్రత్యేకం మరిన్ని...