ప్రైవేట్ బాటలో రైళ్ళు

ABN , First Publish Date - 2020-07-16T06:00:39+05:30 IST

ప్రజా రవాణా సంస్థలు ప్రజా జీవితంలో అత్యంత కీలకమైనవి కాబట్టే రాజ్యాంగ సభ చర్చల్లో డాక్టర్ అంబేడ్కర్ ఈ విధంగా సూచించారు: ‘లాభనష్టాలతో సంబంధం లేకుండా...

ప్రైవేట్ బాటలో రైళ్ళు

ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడానికి గుర్తించిన 109 రైల్వే మార్గాలూ రైల్వేశాఖకు అత్యధిక ఆదాయం సమకూర్చి పెట్టే రూట్లే. ఇవి ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్తే రైల్వే శాఖ ప్రధాన ఆదాయ భాగాన్ని కోల్పోతుంది.


ప్రజా రవాణా సంస్థలు ప్రజా జీవితంలో అత్యంత కీలకమైనవి కాబట్టే రాజ్యాంగ సభ చర్చల్లో డాక్టర్ అంబేడ్కర్ ఈ విధంగా సూచించారు: ‘లాభనష్టాలతో సంబంధం లేకుండా ఒక సామాజిక బాధ్యతతో ప్రభుత్వాలు ప్రజారవాణా వ్యవస్థను ఆదరించాలి. ప్రజల శ్రేయస్సు, ప్రయాణ సౌలభ్యం కోసం దాని అభివృద్ధికి, విస్తరణకు, ఆధునికీకరణకు అవసరమైన నిధులను వార్షిక బడ్జెట్‌లలో విధిగా కేటాయించాలి’. రాజ్యాంగ నిర్మాత సూచనను గత ఏడు దశాబ్దాలుగా కేంద్ర పాలకులు విస్మరిస్తూనే ఉన్నారు. 


రైల్వేల ఆస్తులపైన, లాభాలపైన దృష్టిసారించిన బడా కార్పొరేట్‌ సంస్థలు రైల్వేల ప్రైవేటీకరణకు కొన్నేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నాయి. ఫలితంగానే నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ రైల్వేలను పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించే ప్రక్రియకు నిర్మాణాత్మక చర్యలు చేపట్టింది. మోదీ సర్కార్ తొలి వార్షిక బడ్జెట్‌లో రైల్వేస్‌లో మౌలిక సదుపాయాలకు రూ.50 లక్షల కోట్లు అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ మొత్తాన్ని ప్రతి ఏటా 1.5 నుండి 1.6 లక్షల కోట్లు సమకూర్చుకోవలసిన అవసరముందని పేర్కొన్నారు. ఈ ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే స్థితిలో లేదని, ఇప్పటికే దశాబ్దాలుగా అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని ఆర్థిక మంత్రి అన్నారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి, రైల్వేల అభివృద్ధి, విస్తరణ, మౌలిక సదుపాయాల ఆధునికీకరణకు అవసరమైన నిధులను సమీకరించుకోవడానికి, ఉపాధి అవకాశాలను పెంచడం, ప్రయాణ కాలాన్ని తగ్గించడం, డిమాండ్‌ సప్లైల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడం కోసం ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యం (పి.పి.పి )అనివార్యమని ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు.


భారతీయ రైల్వేల విస్తరణ వాటి ఆధునికీకరణకు 2015లో బిబేక్‌ డెబ్రాయ్‌ ఆధ్వర్యంలో ‘నిపుణుల ప్యానెల్‌ కమిటీ’ని ఏర్పాటు చేశారు. 109 రూట్లలో 151 ఆధునిక ప్యాసింజర్ల రైళ్లను 50 రైల్వే స్టేషన్ల పరిధిలో నిర్వహించే బాధ్యతలు కార్పొరేట్‌ సంస్థలకు ఇవ్వాలని ఆ కమిటీ సూచించింది. దీనితో రైల్వే ట్రాక్‌లు, మ్యాన్యుఫ్యాక్చరింగ్‌, ప్రయాణికులరవాణా తదితర విభాగాలను ప్రైవేట్‌ పరం చేయనున్నారు. దేశంలో వివిధ రూట్లలో ప్రయాణీకుల రవాణా ప్రాజెక్టులకు కూడా ‘పి.పి.పి అప్రైజల్‌ కమిటీ’ అంగీకరించింది. 2020-–21 వార్షికబడ్జెట్‌లో ప్రైవేట్‌ ప్రభుత్వ భాగస్వామ్యంలో కిసాన్‌ రైళ్లు, మరిన్ని తేజస్‌ రైళ్లు (టూరిస్ట్‌) ప్రవేశపెట్టనున్నారు. రానున్న కాలంలో రైల్వే రంగాన్ని పూర్తిస్థాయిలో ప్రైవేటీకరించాలన్న సంకల్పానికి ఆచరణాత్మక నిర్ణయమిది. వాస్తవానికి ఇప్పటికే రైల్వే శాఖలో ప్రైవేటీకరణ విధానాలు అమలవుతున్నాయి. ‘ఇండియస్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సిటిసి)’ భాగస్వామ్యంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నిర్వహించడమే అందుకు నిదర్శనం. బిబేక్‌ డెబ్రాయ్‌ కమిటీ సూచనల ప్రకారం తాజాగా 109 జతల రూట్లలో 151 రైలు సర్వీసులను, ప్రధాన నగరాల్లో గల 50 రైల్వే స్టేషన్లను నిర్వహించడానికి 35 ఏళ్లపాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇస్తూ కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 50 రైల్వే స్టేషన్ల పరిధిలో గల విలువైన రైల్వే భూములను ప్రైవేట్‌ సంస్థలకు లీజుకు ఇవ్వడానికి రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ రంగం సిద్ధం చేసింది.


2023 నుండి ప్రైవేట్‌ రైళ్లు తిరుగుతాయని కూడా ప్రకటించింది. తొలుత 5 శాతం రైళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తారు. ఆ మేరకు ‘అర్హతకు అభ్యర్థనను’ ఆహ్వానిస్తూ జూలై 1న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. మౌలిక సదుపాయాలు, రవాణా, వ్యాపార రంగాల్లో అనుభవం ఉన్న బడా కార్పొరేట్‌ సంస్థలైన ఆథాని పోర్ట్స్‌, టాటా రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎస్‌.ఎల్‌ గ్రూప్‌, బొంబార్డ్‌యర్‌ ఇండియా, మక్వేర్‌ గ్రూప్‌ తదితర 20 సంస్థలు రైల్వేలను నడపడానికి ముందుకు వచ్చాయి. ఫలితంగా రైల్వే సంస్థలోని అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించడానికి మోదీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగా 2023 నాటికి ప్రభుత్వ రైల్వే సిగ్నలింగ్‌, ప్రభుత్వ రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ రైల్వే డ్రైవర్లు, గార్డులతో ప్రైవేట్‌ రైలు ఇండియన్‌ రైల్వే పట్టాలెక్కనున్నాయి. ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడానికి గుర్తించిన ముఖ్యమైన నగరాల రైల్వే స్టేషన్ల పరిధిలోని 109 రైల్వే మార్గాలు అత్యధిక ఆదాయం రైల్వేశాఖకు సమకూర్చి పెట్టే రూట్లే. ఇవి ప్రైవేటు సంస్థల ఆధీనంలోకి వెళ్తే రైల్వే శాఖ ప్రధాన ఆదాయ భాగాన్ని కోల్పోతుంది.

ఎం.శ్రీనివాస్‌ 

ఐఎఫ్‌టీయూ 

Updated Date - 2020-07-16T06:00:39+05:30 IST